ముస్లిం సద్భావన మండపాలు ఏర్పాటు చేయండి
– కేంద్ర మైనారిటీ శాఖ మంత్రికి ఎంపీ బుట్టా రేణుక లేఖ
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు నగరం, ఆదోని పట్టణంలో ముస్లిం సద్భావనా మండపాలు నిర్మించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్త్యార్ అబ్బాస్ నక్వీని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కోరారు. ఈ మేరకు లేఖ రాసినట్లు ఆదివారం ఎంపీ కార్యాలయం నుంచి ఒక పత్రికా ప్రకటన విడుదలైంది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలు అత్యధికంగా ఉన్నారని, వారి ప్రయోజనార్థం కేంద్ర మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేసి సద్భావనా మండపాలు నిర్మించాలని ఎంపీ ఆ లేఖలో కోరారు. ప్రధాన మంత్రి వికాస్ యోజన ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ముస్లిం సోదరుందరికీ తెలియజేసేలా ఈ మండపాలు 24 గంటలూ పని చేస్తాయన్నారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ కేంద్రాల వద్ద తెలియజేస్తే 48 గంటల్లో కేంద్ర మంత్రిత్వ శాఖ పరిష్కరిస్తుందని తెలిపారు. సద్భావనా మండపాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన స్థలాలు చూపాలని కోరారు. లేనిపక్షంలో రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఖాళీ స్థలాల్లో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.