తప్పని కరెన్సీ కష్టాలు
అనంతపురం అగ్రికల్చర్ : రోజులు గడుస్తున్నా పెద్ద నోట్ల రద్దు వల్ల పేదోళ్లకు కష్టాలు తప్పడం లేదు. రూ.100 నోట్ల సరఫరా తక్కువగా ఉండడంతో రూ.4,500 మార్పిడికి ఇబ్బంది తయారైంది. ఎస్‌బీఐ పరిస్థితి బాగానే ఉన్నా మిగిలిన బ్యాంకులన్నీ తమ ఖాతాదారులకు మాత్రమే అంతో ఇంతో నగదు మార్పిడి చేస్తున్నాయి. చిల్లర సమస్యతో రూ.2 వేల నోట్లు తీసుకోవడానికి ప్రజలు వెనుకాడుతున్నారు. చాలా చోట్ల చిరిగిపోయిన, పూర్తిగా పాతపడిన రూ.100 నోట్లతోనే సరిపెట్టుకుంటున్నారు. నగదు మార్పిడి రోజూ రూ.4,500 వరకు మార్చుకోవచ్చునని ప్రకటించినా... వారానికి ఒకసారి మాత్రమే ఇవ్వడం గగనమైంది. రెండోసారి ఇవ్వమని గంటల కొద్దీ క్యూలో నిలుచున్న వారిని వెనక్కు పంపుతున్నారు.
సాయినగర్ ఎస్‌బీఐ ప్రధాన శాఖ ప్రజలతో కిటకిటలాడింది. ఆంధ్రా, కెనరా, సిండికేట్. హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీబీఆర్, ఏపీజీబీ లాంటి బ్యాంకులు జనంతో రద్దీగా కనిపించాయి. వారానికి గరిష్టంగా అకౌంట్‌నుంచి రూ.24 వేల వరకు తీసుకోవచ్చునని ప్రకటించినా, నగదు కొరత కారణంగా రూ.6 నుంచి రూ.10 వేల వరకు మాత్రమే ఇస్తున్నారు. ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రాలు పనిచేయడం లేదు. మరికొన్ని బ్యాంకులకు చెందిన కొన్ని ఏటీఎంలు పనిచేస్తున్నా గంటల్లోపే నగదు అయిపోతోంది. రాత్రి సమయంలో కూడా జనం ఏటీఎంల వద్ద క్యూ కడుతున్నారు.
ఎస్‌బీఐ ఆధ్వర్యంలో కార్తికేయ మెడికల్ సెంటర్ (శ్రీకంఠం సర్కిల్), కమలానగర్, సప్తగిరి సర్కిల్‌లో మరో రెండు దుకాణాల్లో పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) మిషన్లు, స్వైప్ ద్వారా మినీ ఏటీఎంలు అందుబాటులో ఉంచామని ఎస్‌బీఐ ఆర్‌ఎం ఎంవీఆర్ మురళీకృష్ణ తెలిపారు. రెండు మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా మరో 20 వరకు ఇలాంటి వాటిని ప్రజలకు అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దాచుకున్న పాత రూ.500, రూ.1000 నోట్లు డిపాజిట్ చేసుకునే కార్యక్రమం కొనసాగుతోంది. పురుషులు తమ ఖాతాల్లో రూ.2 లక్షలు, మహిళలకైతే రూ.2.50 లక్షల వరకు జమ చేసుకున్నా ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. కరెన్సీ చెస్ట్‌లు కలిగిన బ్యాంకుల పరిస్థితి బాగానే ఉన్నా మిగతా బ్యాంకులు నగదు కోసం చెస్ట్ బ్యాంకుల వద్ద పడిగాపులు తప్పడం లేదు. సహకార బ్యాంకుల లావాదేవీలపై రిజర్వ్‌బ్యాంకు నిబంధనలు విధించడంతో వాటి పరిస్థితి దారుణంగా ఉంది.