ముషీరాబాద్: నోట్ల మార్పిడికి యత్నిస్తున్న వ్యక్తులను ముషీరాబాద్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చిక్కడపల్లి ఏసీపీ నర్సయ్య, ముషీరాబాద్ ఇన్‌స్పెక్టర్ బిట్టు మోహన్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కూకట్‌పల్లికి చెందిన బియ్యం వ్యాపారి లక్ష్మణస్వామి వ్యాపార లావాదేవీల నిమిత్తం రూ.18లక్షలు సేకరించాడు. ఈ మొత్తాన్ని బ్యాంక్‌లో డిపాజిట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా తనకు పరిచయస్తుడైన సాయికుమార్ అనే వ్యక్తి ఐదు శాతం కమీషన్ ఇప్పిస్తానని చెప్పడంతో అందుకు లక్ష్మణస్వామి అంగీకరించాడు. దీంతో సాయికుమార్ అజాం అనే వ్యక్తికి ఈ విషయం చెప్పగా, అతను తన స్నేహితులు సయ్యద్ అంజద్, మహ్మద్ నఫీజ్ ఖాన్, అబ్దుల్ విలాయత్‌తో కలిసి నగదు మార్చుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
దీంతో వారిని గాంధీనగర్ రమ్మని చెప్పడంతో మంగళవారం లక్ష్మణస్వామి తన స్నేహితుడు నాగేంద్రకుమార్‌రెడ్డితో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అక్కడ సాయికుమార్‌ను కలిసి బాకారంలోని ఇంటికి వచ్చి మొదటి అంతస్తులో కుర్చున్నారు. వారి వద్ద కొత్త నోట్లను కొట్టేయాలని పథకం పన్నిన అజాం అతని స్నేహితులు లక్ష్మణస్వామిని మరో ఇంటికి రమ్మని కబురుచేశారు. అక్కడ తెల్ల పేపర్లను కట్‌చేసి 25కట్టలుగా బ్యాగులో అమర్చారు. లక్ష్మణ స్వామి పాతనోట్లను చూయించాలని కోరగా వారిపై దాడి చేసి డబ్బులను లాక్కున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తామని బెదిరించారు. ఆ డబ్బును నలుగురు స్నేహితులు పంచుకోగా వారిలో ముగ్గురిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేసి రూ. 16లక్షలు రికవరీ చేశారు. రెండు లక్షలతో పరారైన ఆజాం కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
నకిలీ పోలీసుల ఆటకట్టు
అమీర్‌పేట: రద్దయిన పాతనోట్లు మార్చి ఇస్తామంటూ నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.10 లక్షల దండుకున్న ఇద్దరు నకిలీ పోలీసులను ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌కం ట్యాక్స్ అధికారుల అవతారం ఎత్తిన మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై వీరస్వామి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి వైఎస్‌ఆర్‌జిల్లా మైదుకూరుకు చెందిన సునీల్, వెంకటసుబ్బయ్య మోతీనగర్‌లో ఉంటూ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేవారు. సులభంగా డబ్బులు సంపాదించేందుకుగాను వారు నకిలీ పోలీసుల అవతారం ఎత్తారు. ఐడీ కార్డులను కూడా తయారు చేసుకున్నారు.
రద్దుచేసిన రూ.500 ,1000 పాత నోట్లను మార్చి ఇస్తామని ప్రచారం చేసుకోవడంతో మరధురానగర్‌కు చెందిన చంద్రశేఖర్ రూ.10 లక్షలు తీసుకుని వారి వద్దకు రాగా ఐడీ కార్డులు చూపి అతడిని బెదిరించి డబ్బులు తీసుకున్నారు. అంతలో ఇన్‌కం ట్యాక్స్ అధికారులుగా చెప్పుకుంటూ ఇద్దరు వ్యక్తులు అక్కడికి రాగా తామే పట్టుకున్నామని డబ్బులు తీసుకుని స్టేషన్‌ను వెళుతున్నట్లు చెప్పి నలుగురు కలిసి వెళ్లిపోయారు. దీంతో బాధితుడు ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సునీల్, వెంకట సుబ్బయ్యను అరెస్టు చేసి రూ. 9 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.