తీరని కష్టాలుపెరుగుతున్న మోసాలు
బ్యాంకుల వద్ద మాటేస్తున్న దొంగలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
పెద్ద నోట్ల రద్దు కారణంగా జనం బ్యాంకుల ముందు క్యూ కడుతుంటే.. దొంగలు ఇదే అదునుగా నిలువు దోపిడీ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మోసగిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సోమవారం ఒక్కరోజే మూడు చోట్ల బ్యాంకుల వద్ద దొంగతనాలు చోటుచేసుకున్నాయి. ఉంగుటూరు మండలం నీలాద్రిపురం గ్రామానికి చెందిన ములకల వెంకటేశ్వరరావు అనే వృద్ధుడు బ్యాంక్‌లో సొమ్ము జమ చేయడానికి వెళ్లి.. ఓచర్ పూర్తి చేయడం కోసం ఇద్దరి యువకుల సాయం కోరాడు. ఒకరు ఓచర్ పూర్తి చేస్తుండగా, రెండో యువకుడు వృద్ధుని సంచిలో ఉన్న డబ్బులు కాజేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరో ఘటనలో అప్పారావుపేట గ్రామానికి చెందిన పామర్తి తాతారావు అనే వృద్ధుడు చేపల విక్రయానికి సంబంధించిన రూ.14 వేలతోపాటు తన సొంత సొమ్ము రూ.10 వేలు కలిపి రూ.24 వేలను తన ఖాతాలో జమ వేయటానికి నారాయణపురంలోని స్టేట్ బ్యాంక్‌కు వెళ్లగా దొంగలు కాజేశారు. బుట్టాయగూడెం విజయ బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన ముప్పినవారిగూడెంకు చెందిన తాళ్లూరి వెంకటేశ్వరరావు నుంచి రూ.23 వేలతో పాటు రెండు బ్యాంకు చెక్కులను అపహరించారు.
సొమ్ములున్నా.. వచ్చేది సున్నా
సేవింగ్స్ ఖాతా నుంచి వారానికి రూ.24వేలు, కరెంట్ అకౌంట్ నుంచి వారానికి రూ.50 వేలు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించినప్పటికీ జనానికి అక్కరకు రావడం లేదు. మూడు రోజుల నుంచి జిల్లాలోని ఏటీఎంలలో 80శాతం మూతపడ్డాయి. వాటిలో నామమాత్రంగా పెడుతున్న సొమ్ము గంట, రెండు గంటల్లోనే అయిపోవడంతో మూత పడుతున్నాయి. బ్యాంకుల్లో రూ.4 వేలకు మించి ఇవ్వడం లేదు. ఆదివారం సెలవు కావడంతో సోమవారం బ్యాంకులకు నగదు చేరలేదు. దీంతో ఈ రోజు డబ్బులు డ్రా చేయడం కష్టమైంది.