కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు
అనంతపురం అగ్రికల్చర్: అనంతపురం జిల్లాలో 27వ రోజు సోమవారం కూడా నగదు కష్టాలతో జనం ఇబ్బంది పడ్డారు. అనంతపురం, హిందూపురం, తాడిపత్రి, గుంతకల్లు లాంటి ప్రధాన పట్టణాల్లో బ్యాంకుల వద్ద ఉద్యోగులు, పెన్షనర్లు, సామాన్యులు అవస్థలు పడ్డారు. కదిరి, ఓడీ చెరువు, గుంతకల్లు, యాడికి తదితర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విత్‌డ్రాల కోసం వృద్ధులు, వికలాంగులు, రోగులు, గర్భిణులు, బాలింతలు బ్యాంకుల వద్ద పడిగాపులు కాసినా చాలా మందికి నిరాశ తప్పలేదు. సోమవారం విత్‌డ్రాలు చాలా బ్యాంకుల్లో రూ.4 వేల నుంచి గరిష్టంగా రూ.10 వేలు ఇచ్చారు. చిన్న నోట్ల కొరత కొనసాగింది. 80 శాతానికి పైగా రూ.2 వేల నోట్లతో సరిపెట్టారు. రూ.500 నోట్లు ఒకట్రెండు బ్యాంకులు మినహా ఎక్కడా పంపిణీ చేయలేదు. 556 ఏటీఎంలకు గానూ 20 మించి పనిచేయలేదు. జిల్లాలో ఇప్పటివరకు రూ.2,500 కోట్లకు పైగా డిపాజిట్లు వచ్చినట్లు సమాచారం.