రోదిస్తున్న బోయ తిమ్మప్ప కుటుంబసభ్యులు
తుమ్మలపల్లి (గట్టు): బోరు మోటారును ఆఫ్ చేసేందుకు వెళ్లిన ఓ యువ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గట్టు మండలం తుమ్మలపల్లికి చెందిన బోయ తిమ్మప్ప(28), బోయ భీమన్న అన్నదమ్ములు. తండ్రి సంపాదించిన ఐదు ఎకరాలను ఇద్దరు రెండున్నర ఎకరాల చొప్పున పంచుకుని, రెండు బోర్లు వేసుకుని సేద్యం చేసుకుంటున్నారు. వీరి పొలం గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉండడంతో వ్యవసాయ పొలం దగ్గరే అన్నదమ్ములు గుడిసెలు వేసుకుని, అక్కడే నివాసం ఉంటున్నారు.
ఇద్దరు ఎకరా చొప్పున సీడ్‌పత్తిని సాగు చేశారు. రోజులాగే బుధవారం సాయంత్రం సీడ్ పత్తికి నీరు పారించిన బోయ తిమ్మప్ప బోరును ఆఫ్ చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య గోవిందమ్మతో పాటు ఇద్దరు కుమారులున్నారు. ఈ సంఘటనతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.