Gattu mandal
-
శాంతించిన ఆలూరు నిర్వాసితులు
గట్టు : ఆలూరు ముంపు గ్రామస్తులకు అండగా ఉంటామని జేసీ రాంకిషన్ తెలిపారు. రెండవ రోజు మంగళవారం ఆలూరు గ్రామాన్ని జేసీ రాంకిషన్, గద్వాల ఆర్డీఓ అబ్దుల్ హామీద్, డీఎస్పీ బాలకోటి, సీఐ సురేష్‌లతో పాటుగా డివిజన్లోని అధికార యంత్రాంగం, గద్వాల నియోజక వర్గ టీఆర్ఎస్ ఇన్చార్జ్ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ముంపు గ్రామాన్ని సందర్శించారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ధరూరు మండలం ర్యాలంపాడు రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న ఆలూరు గ్రామాన్ని ఖాళీ చేసేందుకు రెవన్యూ, పోలీస్ అధికార యంత్రాంగం గ్రామానికి చేరుకున్నారు. సోమవారం గ్రామస్తులను తరలించేందుకు అధికారులు ప్రయత్నించగా ఆర్డీఓను గ్రామంలోనే నిర్బందించి నిరసనను తెలియజేసిన విషయం విదితమే.మరో వైపు ఆలూరు గ్రామంలోకి ర్యాలంపాడు రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ ఇళ్లలొకి వచ్చి చేరుతున్న తరుణంలో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాన్ని ఖాళీ చేసేందుకు ఆలూరు నిర్వాసితులు నిరాకరిస్తున్న తరుణంలో మరో మారు జేసీ గ్రామాన్ని సందర్శించి, గ్రామస్తులతో చర్చించారు. ప్రభుత్వ పరంగా ప్రతిపైసా చెల్లిస్తాం: జేసీ తప్పని పరిస్థితుల్లో గ్రామాన్ని ఖాళీ చేయాలని, ఆలూరు నిర్వాసితులకు ప్రభుత్వ పరంగా అందించే ప్రతి పైసా నిర్వాసితులకు అందిస్తామని జేసీ స్పష్టం చేశారు. పునరావాస కేంద్రంలో కూర్చోని నిర్వాసితులతో చర్చించారు. పునరావాస కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. గ్రామాన్ని ఖాళీ చేసేందుకు కనీసం రెండు నెలల గడువు కావాలని గ్రామస్తులు పట్టుబట్టారు. అయితే గడువు ఇచ్చే పరిస్థితి లేదని, ప్రత్యామ్నాయంగా ఏదైనా సహాయం కావాలంటే చేస్తామని అధికారులు నచ్చ చెప్పారు. ఇప్పటికిప్పుడు గ్రామాన్ని ఖాళీ చేయాలంటే ఇబ్బందితో కూడిన పని అంటూ గ్రామస్తులు వాపోయారు. రూ.48వేల అదనపుసాయం.. ఆలూరు గ్రామాన్ని ముంపు గ్రామాన్ని సందర్శించిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వాస్తవ పరిస్థితులను జిల్లా మంత్రుల దృష్టికి తీసుకు వచ్చారు. ముంపు నిర్వాసితులకు ఇప్పటికే ప్రభుత్వం కుటుంబానికి 48 వేలను పునరావాస ప్యాకేజీ ఇస్తున్నారు. ఇందులో 40 మందికి చెక్కులు అందాల్సి ఉంది. రెండు రోజుల్లో అందేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మరో 48 వేలను అదనంగా ఇచ్చే విధంగా కృష్ణమోహన్‌రెడ్డి, జిల్లా మంత్రి జూపల్లితో మాట్లాడి అధికారుల ద్వారా ఆలూరు గ్రామస్తులకు చెప్పించారు. ఎట్టకేలకు ఆలూరు గ్రామస్తులు గ్రామాన్ని ఖాళీ చేసేందుకు అంగీకరించారు. పునరావాస కేంద్రంలో ప్రత్యేక శిబిరం... ఆలూరు నిర్వాసితులకు S బింగిదొడ్డి తండా దగ్గర 110 ఎకరాల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆశించిన స్థాయిలో ఇక్కడ గ్రామస్తులు ఇళ్ల నిర్మాణాలను చేట్టలేదు. 1460 కుటుంబాలకు గాను కేవలం 100 మంది మాత్రమే పునరావాస కేంద్రంలో ఇళ్లను నిర్మించుకున్నారు. ఇళ్లు నిర్మించుకోని వారి కోసం పునరావాస కేంద్రంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి భోజనాలు అందించేందుకు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని జేసీ రాంకిషన్ స్వయంగా ప్రారంభించారు. నిర్వాసితులకు భోజనం వడ్డించారు. పునరావాస కేంద్రంలో తాత్కాలిక షెడ్లు వేసుకునేందుకు తన వంతు సహకరిస్తానని ఈ సందర్భంగా కృష్ణమోహన్‌రెడ్డి నిర్వాసితులకు చెప్పారు. అందుకు వారు అంగీకరించారు. -
‘అక్షరం’లో అధమం
దశాబ్దకాలంలో అక్షరాస్యత పెంపు అంతంతే దేశంలోనే అట్టడుగున ‘గట్టు’ నామమాత్రంగా అక్షరాస్యత పెంపు కార్యక్రమాలు నేడు 50వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం మహబూబ్‌నగర్: జిల్లా ఏ రంగంలో అభివృద్ధి సాధించాలన్నా అక్షరాస్యత ముఖ్యం. పాలమూరు జిల్లాలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ నిరక్షరాస్యత కారణంగా వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోలేక పోతున్నాం. అక్షరాస్యత, నైపుణ్యం కలిగిన యువత లేకపోవడం, మానవవనరుల కొరత జిల్లా అభివృద్ధికి తీవ్ర ఆటంకంగా మారింది. నేటికీ అక్షరజ్ఞానం లేని ఎంతో మంది ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్తున్న పరిస్థితి ఉంది. అక్షరాస్యత పెంచేందుకు జిల్లాలో ప్రవేశపెడుతున్న పథకాలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ప్రతి పథకం ఆరంభంలో బాగానే ఉన్నప్పటికీ తర్వాత నీరుగారుతున్న పరిస్థితి. ఫలితంగా ఇప్పటికీ దేశంలో అక్షరాస్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా పాలమూరు అపకీర్తిని మోస్తూనే ఉంది. జిల్లాలో గట్టు మండలం 27.73శాతం అక్షరాస్యతతో దేశంలోనే చివరిస్థానంలో ఉంది. అక్షరాస్యత పెంపే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సాక్షరభారత్ లాంటి పథకాలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. లెక్కలన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయే గానీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. 2011లో అతి తక్కువ అక్షరాస్యత ఉన్న మండలాలు మండలం అక్షరాస్యతశాతం గట్టు 27.73 ధరూర్ 28.19 మల్దకల్ 30.85 దామరగిద్ద 32 దౌల్తాబాద్ 34 మద్దూరు 34 అయిజ 35.95 == 2001, 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా అక్షరాస్యత శాతం సంవత్సరం అక్షరాస్యత పురుషులు స్త్రీలు 2001 45.83 57.87 32.83 2011 55.04 65.21 44.72 2001 నుంచి 2011 మధ్య కాలంలో జిల్లా అక్షరాస్యత పదిశాతం మాత్రమే పెరిగింది. ప్రస్తుతం మండలాల వారీగా తీసుకుంటే 60.68శాతం ఉత్తీర్ణతకు పెరిగినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అక్షరాస్యత పెంచటం కోసం ప్రభుత్వాలు అధికమొత్తంలో నిధులను ఖర్చు చేసినప్పటికీ అనుకున్నంత లక్ష్యం సాధించలేకపోయింది. సాక్షరభారత్కు నిధుల కొరత సాక్షరభారత్ కార్యక్రమం ప్రస్తుతం నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. సాక్షరభారత్ మిషన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.30కోట్లకు పైగానే ఖర్చు చేశారు. కానీ గతేడాది కాలంగా నిధులే లేకపోవడం వల్ల ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా 2,458మంది గ్రామ కో–ఆర్డినేటర్లు, 59మంది మండల కో–ఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో వయోజన విద్యాకేంద్రం ఉంది. 2010నవంబర్ నుంచి కొనసాగుతున్న సాక్షరభారత్ కేంద్రాలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం, ఏడాదికాలంగా కో–ఆర్డినేటర్లకు జీతాలు చెల్లించకపోవడం వల్ల కేంద్రాలు అసలు తెరుచుకునే పరిస్థితి లేదు. 2015 సాక్షరభారత్ సర్వే ప్రకారం జిల్లాలో 15,52,774 మంది 15ఏళ్లకు పైబడిన నిరక్షరాస్యులు ఉన్నారు. సాక్షరభారత్ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి ఆరేళ్లలో 6,29,327మందిని అక్షరాస్యులుగా మార్చినట్లు వయోజన విద్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. నిధుల కొరత కారణంగా అక్షరాస్యత పెంపు కార్యక్రమాలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. దేశంలోనే అట్టడుగున గట్టు అక్షరాస్యత పరంగా దేశంలోనే అత్యంత వెనకబడిన మండలంగా గుర్తింపు పొందిన గట్టులో ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన అక్షరాస్యతపరంగా అభివృద్ధి సాధించడం లేదు. సుమారు 78వేల మంది జనాభా ఉన్న ఈ మండలంలో అధికశాతం నిరుపేద కుటుంబాలకు చెందినవారే. బడిఈడు పిల్లలను కొందరు పశువులు, గొర్రెలు మేపేందుకు పంపిస్తున్నారు. 2001లో గట్టు అక్షరాస్యత 22.5శాతంగా నమోదైంది. 2011 నాటికి 27.73శాతం అక్షరాస్యత గట్టులో ఉంది. ధరూర్ మండలం 28.19శాతం, మల్దకల్ 30.85, దామరగిద్ద 32శాతం, దౌల్తాబాద్, మద్దూరు 34శాతం, అయిజ 35.95 శాతం అక్షరాస్యతతో జిల్లాలో అట్టడుగున ఉన్నాయి. 6వేలకు పైగా బడిఈడు పిల్లలు బడి బయట ఉన్నారు. ఇప్పటికైనా అక్షరాస్యత పెంపుపై దృష్టిసారిస్తేనే జిల్లా అక్షరాస్యత పరంగా అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుంది. అందరి భాగస్వామ్యంతో అక్షరాస్యత పెంపు కార్యక్రమం.. జిల్లాలో అక్షరాస్యత పెంపునకు ప్రభుత్వం వినూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. పీయూ విద్యార్థులు, డిగ్రీ కళాశాలల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ యూనిట్లు, శ్రమశక్తి సంఘాలు ద్వారా డీఆర్డీఏ ఆధ్వర్యంలో వయోజనులను అక్షరాస్యులు చేసే కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. అదేవిధంగా 8, 9వ తరగతుల విద్యార్థులు వారి అమ్మానాన్నలకు చదువు చెప్పేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో కార్యక్రమం అమలు చేయనున్నాం. – వీరభద్రరావు, డీడీ, వయోజన విద్య -
విద్యుదాఘాతంతో రైతు మృతి
తుమ్మలపల్లి (గట్టు): బోరు మోటారును ఆఫ్ చేసేందుకు వెళ్లిన ఓ యువ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గట్టు మండలం తుమ్మలపల్లికి చెందిన బోయ తిమ్మప్ప(28), బోయ భీమన్న అన్నదమ్ములు. తండ్రి సంపాదించిన ఐదు ఎకరాలను ఇద్దరు రెండున్నర ఎకరాల చొప్పున పంచుకుని, రెండు బోర్లు వేసుకుని సేద్యం చేసుకుంటున్నారు. వీరి పొలం గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉండడంతో వ్యవసాయ పొలం దగ్గరే అన్నదమ్ములు గుడిసెలు వేసుకుని, అక్కడే నివాసం ఉంటున్నారు. ఇద్దరు ఎకరా చొప్పున సీడ్‌పత్తిని సాగు చేశారు. రోజులాగే బుధవారం సాయంత్రం సీడ్ పత్తికి నీరు పారించిన బోయ తిమ్మప్ప బోరును ఆఫ్ చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య గోవిందమ్మతో పాటు ఇద్దరు కుమారులున్నారు. ఈ సంఘటనతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. -
పాలమూరులో సమంతకు ఓటు!
గట్టు: ‘ఈగ’ సినిమా ఫేం తెలుసు కదా..! ప్రముఖ సినీనటి సమంత. ఆమె కూడా మహబూబ్‌నగర్ జిల్లా ఓటరేనండోయ్! సమంత ఏంటి..ఇక్కడ ఓటు ఉండటమేమిటి అనుకుంటున్నారా? ఆశ్చర్యపోకండి ఇది నిజం. గట్టు మండల అధికారుల ఆమెకు మాచర్ల గ్రామ ఓటరు జాబితాలో చోటుకల్పించేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందడిలో మాచర్ల గ్రామ ఓటర్ జాబితాను పరిశీలిస్తున్న క్రమంలో శనివారం సమంత ఫొటోను చూసినవారు ఆశ్చర్యానికి గురయ్యారు. గ్రామ ఓటర్ జాబితాలో వరుస నెం.391, ఇంటి నెంబర్ 2-52 చిరునామా పేర గుడిసె మహేశ్వరి పేరున్న చోట ఆమె ఫొటోకు బదులు సమంత ఫొటో పెట్టారు. ఈ విషయమై తహశీల్దార్ సైదులును ‘న్యూస్‌లైన్’ వివరణ కొరగా.. గతంలో ఈ పొరపాటు జరిగి ఉంటుందని, ఉన్నతాధికారుల దృష్టికితీసుకెళ్లి ఫొటోను తొలగిస్తామన్నారు.