శాంతించిన ఆలూరు నిర్వాసితులు
Published Wed, Sep 14 2016 12:12 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM
గట్టు : ఆలూరు ముంపు గ్రామస్తులకు అండగా ఉంటామని జేసీ రాంకిషన్ తెలిపారు. రెండవ రోజు మంగళవారం ఆలూరు గ్రామాన్ని జేసీ రాంకిషన్, గద్వాల ఆర్డీఓ అబ్దుల్ హామీద్, డీఎస్పీ బాలకోటి, సీఐ సురేష్‌లతో పాటుగా డివిజన్‌లోని అధికార యంత్రాంగం, గద్వాల నియోజక వర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ముంపు గ్రామాన్ని సందర్శించారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ధరూరు మండలం ర్యాలంపాడు రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న ఆలూరు గ్రామాన్ని ఖాళీ చేసేందుకు రెవన్యూ, పోలీస్ అధికార యంత్రాంగం గ్రామానికి చేరుకున్నారు. సోమవారం గ్రామస్తులను తరలించేందుకు అధికారులు ప్రయత్నించగా ఆర్డీఓను గ్రామంలోనే నిర్బందించి నిరసనను తెలియజేసిన విషయం విదితమే.మరో వైపు ఆలూరు గ్రామంలోకి ర్యాలంపాడు రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ ఇళ్లలొకి వచ్చి చేరుతున్న తరుణంలో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాన్ని ఖాళీ చేసేందుకు ఆలూరు నిర్వాసితులు నిరాకరిస్తున్న తరుణంలో మరో మారు జేసీ గ్రామాన్ని సందర్శించి, గ్రామస్తులతో చర్చించారు.
ప్రభుత్వ పరంగా ప్రతిపైసా చెల్లిస్తాం: జేసీ
తప్పని పరిస్థితుల్లో గ్రామాన్ని ఖాళీ చేయాలని, ఆలూరు నిర్వాసితులకు ప్రభుత్వ పరంగా అందించే ప్రతి పైసా నిర్వాసితులకు అందిస్తామని జేసీ స్పష్టం చేశారు. పునరావాస కేంద్రంలో కూర్చోని నిర్వాసితులతో చర్చించారు. పునరావాస కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. గ్రామాన్ని ఖాళీ చేసేందుకు కనీసం రెండు నెలల గడువు కావాలని గ్రామస్తులు పట్టుబట్టారు. అయితే గడువు ఇచ్చే పరిస్థితి లేదని, ప్రత్యామ్నాయంగా ఏదైనా సహాయం కావాలంటే చేస్తామని అధికారులు నచ్చ చెప్పారు. ఇప్పటికిప్పుడు గ్రామాన్ని ఖాళీ చేయాలంటే ఇబ్బందితో కూడిన పని అంటూ గ్రామస్తులు వాపోయారు.
రూ.48వేల అదనపుసాయం..
ఆలూరు గ్రామాన్ని ముంపు గ్రామాన్ని సందర్శించిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వాస్తవ పరిస్థితులను జిల్లా మంత్రుల దృష్టికి తీసుకు వచ్చారు. ముంపు నిర్వాసితులకు ఇప్పటికే ప్రభుత్వం కుటుంబానికి 48 వేలను పునరావాస ప్యాకేజీ ఇస్తున్నారు. ఇందులో 40 మందికి చెక్కులు అందాల్సి ఉంది. రెండు రోజుల్లో అందేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మరో 48 వేలను అదనంగా ఇచ్చే విధంగా కృష్ణమోహన్‌రెడ్డి, జిల్లా మంత్రి జూపల్లితో మాట్లాడి అధికారుల ద్వారా ఆలూరు గ్రామస్తులకు చెప్పించారు. ఎట్టకేలకు ఆలూరు గ్రామస్తులు గ్రామాన్ని ఖాళీ చేసేందుకు అంగీకరించారు.
పునరావాస కేంద్రంలో ప్రత్యేక శిబిరం...
ఆలూరు నిర్వాసితులకు S బింగిదొడ్డి తండా దగ్గర 110 ఎకరాల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆశించిన స్థాయిలో ఇక్కడ గ్రామస్తులు ఇళ్ల నిర్మాణాలను చేట్టలేదు. 1460 కుటుంబాలకు గాను కేవలం 100 మంది మాత్రమే పునరావాస కేంద్రంలో ఇళ్లను నిర్మించుకున్నారు. ఇళ్లు నిర్మించుకోని వారి కోసం పునరావాస కేంద్రంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి భోజనాలు అందించేందుకు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని జేసీ రాంకిషన్ స్వయంగా ప్రారంభించారు. నిర్వాసితులకు భోజనం వడ్డించారు. పునరావాస కేంద్రంలో తాత్కాలిక షెడ్లు వేసుకునేందుకు తన వంతు సహకరిస్తానని ఈ సందర్భంగా కృష్ణమోహన్‌రెడ్డి నిర్వాసితులకు చెప్పారు. అందుకు వారు అంగీకరించారు.
Advertisement
Advertisement