-
దశాబ్దకాలంలో అక్షరాస్యత పెంపు అంతంతే
-
దేశంలోనే అట్టడుగున ‘గట్టు’
-
నామమాత్రంగా అక్షరాస్యత పెంపు కార్యక్రమాలు
-
నేడు 50వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం
మహబూబ్‌నగర్: జిల్లా ఏ రంగంలో అభివృద్ధి సాధించాలన్నా అక్షరాస్యత ముఖ్యం. పాలమూరు జిల్లాలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ నిరక్షరాస్యత కారణంగా వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోలేక పోతున్నాం. అక్షరాస్యత, నైపుణ్యం కలిగిన యువత లేకపోవడం, మానవవనరుల కొరత జిల్లా అభివృద్ధికి తీవ్ర ఆటంకంగా మారింది. నేటికీ అక్షరజ్ఞానం లేని ఎంతో మంది ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్తున్న పరిస్థితి ఉంది.
అక్షరాస్యత పెంచేందుకు జిల్లాలో ప్రవేశపెడుతున్న పథకాలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ప్రతి పథకం ఆరంభంలో బాగానే ఉన్నప్పటికీ తర్వాత నీరుగారుతున్న పరిస్థితి. ఫలితంగా ఇప్పటికీ దేశంలో అక్షరాస్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా పాలమూరు అపకీర్తిని మోస్తూనే ఉంది. జిల్లాలో గట్టు మండలం 27.73శాతం అక్షరాస్యతతో దేశంలోనే చివరిస్థానంలో ఉంది. అక్షరాస్యత పెంపే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సాక్షరభారత్ లాంటి పథకాలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. లెక్కలన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయే గానీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
2011లో అతి తక్కువ అక్షరాస్యత ఉన్న మండలాలు
మండలం అక్షరాస్యతశాతం
గట్టు 27.73
ధరూర్ 28.19
మల్దకల్ 30.85
దామరగిద్ద 32
దౌల్తాబాద్ 34
మద్దూరు 34
అయిజ 35.95
==
2001, 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా అక్షరాస్యత శాతం
సంవత్సరం అక్షరాస్యత పురుషులు స్త్రీలు
2001 45.83 57.87 32.83
2011 55.04 65.21 44.72
2001 నుంచి 2011 మధ్య కాలంలో జిల్లా అక్షరాస్యత పదిశాతం మాత్రమే పెరిగింది. ప్రస్తుతం మండలాల వారీగా తీసుకుంటే 60.68శాతం ఉత్తీర్ణతకు పెరిగినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అక్షరాస్యత పెంచటం కోసం ప్రభుత్వాలు అధికమొత్తంలో నిధులను ఖర్చు చేసినప్పటికీ అనుకున్నంత లక్ష్యం సాధించలేకపోయింది.
సాక్షరభారత్‌కు నిధుల కొరత
సాక్షరభారత్ కార్యక్రమం ప్రస్తుతం నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. సాక్షరభారత్ మిషన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.30కోట్లకు పైగానే ఖర్చు చేశారు. కానీ గతేడాది కాలంగా నిధులే లేకపోవడం వల్ల ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా 2,458మంది గ్రామ కో–ఆర్డినేటర్లు, 59మంది మండల కో–ఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో వయోజన విద్యాకేంద్రం ఉంది. 2010నవంబర్ నుంచి కొనసాగుతున్న సాక్షరభారత్ కేంద్రాలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం, ఏడాదికాలంగా కో–ఆర్డినేటర్లకు జీతాలు చెల్లించకపోవడం వల్ల కేంద్రాలు అసలు తెరుచుకునే పరిస్థితి లేదు. 2015 సాక్షరభారత్ సర్వే ప్రకారం జిల్లాలో 15,52,774 మంది 15ఏళ్లకు పైబడిన నిరక్షరాస్యులు ఉన్నారు. సాక్షరభారత్ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి ఆరేళ్లలో 6,29,327మందిని అక్షరాస్యులుగా మార్చినట్లు వయోజన విద్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. నిధుల కొరత కారణంగా అక్షరాస్యత పెంపు కార్యక్రమాలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి.
దేశంలోనే అట్టడుగున గట్టు
అక్షరాస్యత పరంగా దేశంలోనే అత్యంత వెనకబడిన మండలంగా గుర్తింపు పొందిన గట్టులో ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన అక్షరాస్యతపరంగా అభివృద్ధి సాధించడం లేదు. సుమారు 78వేల మంది జనాభా ఉన్న ఈ మండలంలో అధికశాతం నిరుపేద కుటుంబాలకు చెందినవారే. బడిఈడు పిల్లలను కొందరు పశువులు, గొర్రెలు మేపేందుకు పంపిస్తున్నారు. 2001లో గట్టు అక్షరాస్యత 22.5శాతంగా నమోదైంది. 2011 నాటికి 27.73శాతం అక్షరాస్యత గట్టులో ఉంది. ధరూర్ మండలం 28.19శాతం, మల్దకల్ 30.85, దామరగిద్ద 32శాతం, దౌల్తాబాద్, మద్దూరు 34శాతం, అయిజ 35.95 శాతం అక్షరాస్యతతో జిల్లాలో అట్టడుగున ఉన్నాయి. 6వేలకు పైగా బడిఈడు పిల్లలు బడి బయట ఉన్నారు. ఇప్పటికైనా అక్షరాస్యత పెంపుపై దృష్టిసారిస్తేనే జిల్లా అక్షరాస్యత పరంగా అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుంది.
అందరి భాగస్వామ్యంతో
అక్షరాస్యత పెంపు కార్యక్రమం..
జిల్లాలో అక్షరాస్యత పెంపునకు ప్రభుత్వం వినూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. పీయూ విద్యార్థులు, డిగ్రీ కళాశాలల విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్‌లు, శ్రమశక్తి సంఘాలు ద్వారా డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో వయోజనులను అక్షరాస్యులు చేసే కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. అదేవిధంగా 8, 9వ తరగతుల విద్యార్థులు వారి అమ్మానాన్నలకు చదువు చెప్పేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో కార్యక్రమం అమలు చేయనున్నాం.
– వీరభద్రరావు, డీడీ, వయోజన విద్య