
రోదిస్తున్న భార్యాపిల్లలు
- కరెంటు కాటుకు యువ రైతు బలి
- అధికారుల తీరును నిరసిస్తూ గ్రామస్తుల ఆందోళన
- రూ.4 లక్షలు పరిహారం ప్రకటించిన చేతులు దులుపుకున్న విద్యుత్ శాఖ
వెల్దుర్తి: కరెంటు కాటుకు ఓ యువరైతు బలి అయ్యాడు. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో అధికారులు రూ. 4 లక్షలు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఫలితంగా మృతుని తండ్రి,భార్యాపిల్లలు అనాథలయ్యారు. మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మండలంలోని కుకునూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బస్వాపురం గ్రామానికి చెందిన మాసబోయిన దిగంబర్ (25) రోజు మాదిరిగా పొలంలోకి వెళుతున్న సమయంలో మరో పొలంలో వేలాడుతున్న విద్యుత్తు వైర్లు ఛాతికి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చుట్టు పక్కల ఉన్న రైతులు ఇది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న తండ్రి మైసయ్య, భార్య చంద్రకళ, కూతురు వైష్ణవి, కుమారుడు జశ్వంత్, గ్రామస్తులు సంఘటనా స్థలానికి వచ్చి గుండెలవిసేలా రోదించడం పలువురిని కంట తడిపెట్టించింది. దీంతో గ్రామస్తులు విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైందంటూ ఆగ్రహిస్తూ వెల్దుర్తి–నర్సాపూర్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
విద్యుత్తు వైర్లు వేలాడుతున్నాయని, మరో స్తంభం ఏర్పాటు చేయాలని రెండు నెలల నుంచి అధికారులను వేడుకున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న తూప్రాన్ ఏడీ వీరారెడ్డి సంఘటనా స్థలానికి రావడంతో ఆగ్రహించిన గ్రామస్తులు అధికారుల తీరును నిలదీశారు.
దీంతో ఏడీ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, తమ శాఖ తరఫున మృతుని కుటుంబానికి రూ. 4 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శివకుమార్ తెలిపారు.
విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష ్యమే కారణం.. సునీతారెడ్డి
విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష ్యమే నిండు ప్రాణాన్ని బలిగొందని డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఆమె గ్రామానికి చేరుకుని మృతుని తండ్రి, భార్యా పిల్లలను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం కాకముందే వేలాడుతున్న వైర్లు, ఒరిగిన స్తంభాలను సరి చేస్తే బాగుండేదన్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆమె మండిపడ్డారు. మృతుని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, పిల్లలకు ఉచితంగా చదవు చెప్పించాలని ఆమె డిమాండ్ చేశారు.