9వ తరగతి విద్యార్థినులకు సైకిళ్లు
– ఈ నెల 24 తర్వాత అందజేయనున్న అధికారులు
కర్నూలు సిటీ: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు డీఈఓ తాహెరా సుల్తానా తెలిపారు. శనివారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ బడికొస్తా పథకంలో భాగంగా 14,900 సైకిళ్లు మంజూరయ్యాయని.. ఇందులో 70 శాతం ఇప్పటికే జిల్లాకు చేరాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నెల 24 తర్వాత విద్యార్థులకు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2015 సంవత్సరంలో బాలికల విద్యపై చేపట్టిన ఓ సర్వేలో బాల్య వివాహాలకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లు అందుబాటులో లేకపోవడమే కారణంగా వెల్లడయిందన్నారు. ఈ కారణంగా చదువును మధ్యలోనే ఆపేస్తున్నట్లు సర్వే ప్రకటించిందన్నారు.
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో బాలికల హాజరు శాతం ఉన్నత పాఠశాలలకు వచ్చే సరికి సగానికి పైగా తగ్గుతోందన్నారు. ఈ నేపథ్యంలో 9వ తరగతి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేస్తే కనీసం 10వ తరగతి పూర్తి చేసేందుకైనా అవకాశం ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే ఈ పథకం రూపుదిద్దుకుందన్నారు. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్ స్కూళ్లకు చెందిన విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసేందుకు విజయవాడకు చెందిన ఓ కంపెనీని ఎంపిక చేశారన్నారు. ఈ కంపెనీ సైకిల్ విడి భాగాలను తీసుకొచ్చి స్కూళ్ల వద్ద పంపిణీకి సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.