
తుపాను మనల్ని చూసి భయపడింది: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలు బాగా వెనకబడ్డాయి
ఉద్యోగులంతా త్యాగాలు చేసి జూన్ 27లోగా రావాలి
నా భార్య రాకపోయినా నేనొచ్చి పనిచేస్తున్నా
ఆమె వారానికి ఒకసారి వచ్చి వెళ్తారు
విజయవాడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హోదా ఉన్న పది రాష్ట్రాలు ఏం సాధించాయని, ఆ పదీ ఇప్పుడు బాగా వెనకబడి ఉన్నాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కరువు, తుపానులు సమస్యగా మారాయని చెప్పారు. మొన్న తుపాను వచ్చినా.. మనల్ని చూసి భయపడి వెళ్లిపోయిందని చంద్రబాబు తెలిపారు. నీటి పంపకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు లేవని అన్నారు.
తాత్కాలిక సచివాలయం తరలింపునకు అవసరమైతే మరో రూ. 200-300 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. ఉద్యోగులంతా త్యాగాలు చేసి జూన్ 27వ తేదీ లోపు రావాలని పిలుపునిచ్చారు. తన భార్య రాకపోయినా తాను మాత్రం ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నానని తెలిపారు. ఆమెకు వ్యాపారం ఉందని, అందుకే ఆమె హైదరాబాద్‌లో ఉన్నారని.. వారానికి ఒక రోజు విజయవాడ వచ్చి వెళ్తారని అన్నారు. ఇక నియోజకవర్గాల పెంపుపై ఏపీ, తెలంగాణ ఏకాభిప్రాయంతో ఉన్నట్లు బాబు చెప్పారు. ఏపీకి ఎప్పటికీ అవతరణ దినోత్సవాలు ఉండబోవనని, ప్రతియేటా జూన్ 2వ తేదీన నవనిర్మాణ దీక్షలు మాత్రమే నిర్వహిస్తామని ఆయన తెలిపారు.