క్షీణధార | dairy centers are in criticle position | Sakshi
Sakshi News home page

క్షీణధార

Published Mon, Mar 27 2017 4:42 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM

క్షీణధార

క్షీణధార

► పాడిపరిశ్రమకు గడ్డురోజులు
► 8 బీఎంసీ కేంద్రాలు మూత
► రాయచోటిలో ఒంటిపూట పాలసేకరణ
► ఆందోళనలో పాడిరైతులు
► పట్టించుకోని ప్రభుత్వం

 
పాడిని నమ్ముకున్న వారికి కూటికి కొదవ ఉండదని గతంలో పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడా కాలం చెల్లిపోయిందా అనిపిస్తోంది.  వారికి పాలధారలు కాదు కన్నీళ్లే రాలుతున్నాయి. పాడి పెంపకాన్నే జీవనాధారం చేసుకున్న వారికి నష్టాలే మిగులుతున్నాయి. పరిస్థితి చేయిదాటిపోకుండా చూడాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

కడప అగ్రికల్చర్‌ : భూమాతను నమ్మిన రైతుకు ప్రకృతి విపత్తులు శాపంగా మారాయి. వ్యవసాయంలో వరుస నష్టాలు  కుంగదీస్తున్నాయి. వ్యవసాయం తర్వాత పాడిపరిశ్రమ ఆదుకుంటుందని అనుకున్న రైతన్నకు బలమైన నమ్మకం లేకుండాపోతోంది. ప్రభుత్వ తీరుతో పాడికి గడ్డురోజులు పొంచి ఉన్నాయి.  2004 తర్వాత  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం  రైతులకు మేలు చేయాలని సంకల్పించి ముఖ్యమంత్రి, ప్రధాని పశుక్రాంతి పథకాన్ని ప్రవేశపెట్టి అర్హులైన వారికి రెండు పాడిపశువులను 50 శాతం సబ్సిడీతో అందజేశారు. అన్నదాతలు మరిన్ని పాడిపశువులను కొనుగోలు చేసి పాడిపరిశ్రమను విస్తృత పరచుకుని  లబ్ధిపొందారు. అప్పట్లో ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కూడా  పశుసంవర్ధకశాఖతో కలసి మంచి కార్యక్రమాలు చేపట్టి   పాడి రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది. కేవలం పాడిపరిశ్రమతోనే కుటుంబాలను పోషించుకుంటున్న చాలామంది రైతులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు.  వైఎస్‌ మరణం అనంతరం వచ్చిన ప్రభుత్వాలు ఏపీడీడీసీని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఏపీడీడీసీని మరింత కుంగదీస్తోంది. సంస్థ కష్టాల్లో ఉందన్న ఇంగిత జ్ఞానం కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందని రైతులు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో ఉండిపోయిన సంస్థను ఏపీకి తెచ్చుకుని జవసత్వాలు పోస్తామన్న సదభిప్రాయం ప్రభుత్వానికి ఎందుకు కలుగలేదని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. జిల్లాలోని పాడిపశువుల నుంచి వచ్చే వేలాది లీటర్ల పాలు రైతులు ఎంతమందికి పోసినా ఇంకా మిగులే ఉంటాయని, అవి రోజుల తరబడి నిల్వ చేసేదానికి కూడా వీలుండదని, మరి వాటిని ఏం చేయాలో దిక్కుతోచక అవస్థలు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని సంఘాల సభ్యులు అంటున్నారు.

జిల్లాలో బల్క్‌మిల్క్‌ సెంటర్లు ఇవే: జిల్లాలో కొండాపురం, చక్రాయపేట, ప్రొద్దుటూరు, రాజంపేట, పులివెందుల, భాకరాపేట, రాయచోటి, తిమ్మంపల్లె,రాజుపాలెం, మైదుకూరు, వేంపల్లె, సింహాద్రిపురం, ఒంటిమిట్ట, రామాపురం, పెనగలూరు, రైల్వేకోడూరు కేంద్రాలను పాలసేకరణ కోసం డీఆర్‌డీఏ, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసింది.  అయితే ఇందులో పాలసేకరణ డీఆర్‌డీఏలోని మహిళా సంఘాలు చేపట్టగా ఏపీడీడీసీ పాలబిల్లులు, అవసరమైన సామగ్రి సమకూర్చింది. ఏ సమస్య తలెత్తినా ఏపీడీడీసీ పరిష్కరిస్తూ ఉండేది. పాలసేకరణలో ఏవైనా లోపాలు ఉంటే డీఆర్‌డీఏ అధికారులు తక్షణమే  సవరించేవారు. మహిళా సంఘాలు కూడా పాలసేకరణలో చాలా జాగ్రత్తలు పాటించి సంస్థకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసుకునేవారు.

మూతపడిన బీఎంసీలు ఇవే: జిల్లాలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన బల్క్‌ మిల్క్‌ సెంటర్లు(బీఎంసీలు) కొన్ని వెలవెలబోతున్నాయి. లీటర్ల కొద్దీ వచ్చే  పాలను మేము కొలవలేకుపోతున్నామని నిర్వాహకులు చెబుతుంటే  పాలకులు చాలా సంతోషించి రైతులకు  మేలు జరుగుతుందని విశ్వసించారు. ఒక గేదెతో పోషణ ప్రారంభించిన రైతులు ఎంతో లబ్ధిపొందారు.  ఇçప్పుడు ఆ పరిస్థితుల పూర్తిగా మారిపోయాయి. పాల సేకరణ కేంద్రాల నిర్వహకులు పాలు పట్టలేం..మేం మూతవేస్తున్నామని చెప్పి చాలా కేంద్రాలను మూసేశారు. జిల్లాలో 16 బీఎంసీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో  రైల్వేకోడూరు, రాజంపేట, వేంపల్లె, మైదుకూరు,సింహాద్రిపురం రాజుపాలెం, ఒంటిమిట్ట, కొండాపురం  కేంద్రాలు మూతపడ్డాయి. రాయచోటి సమీపంలోని బీఎంసీలో ఉదయం పాలసేకరణ చేపట్టి సాయంత్రం పూట  చేపట్టడం లేదని పాడిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇంకొన్ని కేంద్రాలు రేపో, మాపో మూసివేయడానికి సిద్ధంగా ఉన్నాయి.  ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పాల సేకరణ చేయకపోవడం,  బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం, నిర్వహణ ఖర్చులు భరించకపోవడం, పాలలో వెన్న తీసే యంత్రాల రిపేర్లు చేపట్టకపోవడమే దీనికి కారణం.   ప్రభుత్వ తీరువల్ల సంస్థ కోలుకోలేని పరిస్థితికి చేరుకుంది. పాలసేకరణ పూర్తిగా ఆగిపోతున్న విషయం ప్రభుత్వానికి తెలియనిది కాదని పాడిరైతులు అంటున్నారు.

రెండంకెల అభివృద్ధి ఎలా సాధ్యం: రాష్ట్రంలో వ్యవసాయం రెండంకెల అభివృద్ధి సాధించాలని   ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,   వ్యవసాయశాఖ మంత్రి పుల్లారావు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల సమావేశాలు, బహిరంగ సభల్లో ప్రగల్భాలు పలుకుతుంటారని, మరి పాడిపరిశ్రమ కోలుకోలేని విధంగా దెబ్బతింటుంటే ఎందుకు ఆలోచించలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. రెండంకెల అభివృద్ధి చేయాలన్నప్పుడు ఎక్కడ లోపం ఉందో గుర్తించి వాటిని సవరించాలనే విషయం తెలీదా? అని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

ప్రభుత్వానికి నివేదించాం: జిల్లాలో వివిధ కారణాలతో బీఎంసీలు మూతపడిన మాట వాస్తమే. అయితే వాటిని తెరిపించాలని ప్రభుత్వానికి నివేదికలు పంపాం. సంస్థ చాలా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తమే. తెలంగాణలో ఉన్న సంస్థకు ఏపీలో ప్రత్యామ్నాయం ఆలోచించాలని  ఎండీకి వివరించాం. --- శ్రీనివాసులు, జిల్లా డిప్యూటీ డైరక్టర్, ఏపీడీడీసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement