సాహితీ నర్తనం
-
ఎల్‌కేజీలో గజ్జె కట్టి..
-
మూడేళ్లలో 45 ప్రదర్శనలిచ్చి..
-
పదుగురి ప్రశంసలు అందుకుని..
-
నేడు అరంగేట్రానికి సిద్ధమైన కృష్ణసాహితి
రాజమహేంద్రవరం కల్చరల్ :
కృష్ణసాహితి కాలికి గజ్జె కట్టింది ఎల్‌కేజీ రోజుల్లో.. మూడో తరగతికి వచ్చేసరికి ఆమె ఇచ్చిన ప్రదర్శనలు 45.. గోదావరి, కృష్ణ పుష్కరాల్లో ఆమె నాట్య ప్రదర్శన ప్రజల ప్రశంసలందుకుంది.
ఆసక్తి ఎలా కలిగిందంటే..
జిల్లాలోని అయినవిల్లి గ్రామంలో 2007 అక్టోబర్ రెండున కృష్ణసాహితి జన్మించింది. తండ్రి వీరవెంకట సుబ్రహ్మణ్యం, తల్లి సత్యకుమారిలకు నాట్యంలో అభినివేశం లేకపోయినప్పటికీ చిన్ననాడే రాజమండ్రి వచ్చిన ఆ చిన్నారి నగరంలో అనునిత్యం జరిగే నాట్య ప్రదర్శనలు చూసి ఆ రంగంపై మక్కువ పెంచుకుంది. ఆమె ఆసక్తికి తల్లితండ్రులూ చేయూతనివ్వడంతో ధవళేశ్వరానికి చెందిన శ్రీరాధాకృష్ణ సంగీత నృత్య కళాక్షేత్రలో చేరి కూచిపూడి నేర్చుకుంది. కృష్ణసాహితిలోని ప్రతిభను గుర్తించిన సంస్థ వ్యవస్థాపకుడు రాధాకృష్ణ ఆనం కళాకేంద్రంలో తమ బ్యానర్‌పై ప్రదర్శించిన నక్షత్రమాలికా చరితంలో ఆమెకు తొలిసారిగా శ్రీకృష్ణునిగా నర్తించే అవకాశం ఇచ్చారు.
మూడో తరగతికి వచ్చేనాటికి 45 ప్రదర్శనలు
గోదావరి ఆది, అంత్యపుష్కరాలు, విజయవాడలో కృష్ణాపుష్కరాల్లో సైతం ఆమె నర్తించి ఎన్నో పురస్కారాలు అందుకుంది. ప్రదర్శనలలో పాల్గొని కృష్ణసాహితి ఎన్నో పురస్కారాలను అందుకుంది. గణపతి కౌతం, నవరాగమాలిక వర్ణం, తరంగం, దశావతార శబ్దం, దుర్గాస్తుతి, అన్నమయ్య కీర్తనలు, థిల్లాన తదితర అంశాలపై ఆమె చక్కని పట్టు సాధించి తొలిసారిగా ఆదివారం కూచిపూడి అరంగేట్రానికి సిద్ధమవుతోంది. ఈ అంశాలపై పట్టు సాధించినప్పుడే కూచిపూడి నాట్యం సంపూర్ణంగా అభ్యసించినట్టు నాట్యకోవిదులు భావిస్తారు.
నేడు హేమాహేమీల సన్నిధిలో:
ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు రివర్‌బే హోటల్ వేదికపై కృష్ణసాహితి నాట్యానికి ప్రియాంక వ్యాఖ్యాతగా పాల్గొననున్నారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్.పి.ఇందిరా హేమ, ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యుడు పసుమర్తి శ్రీనివాసులు, ఇతర నాట్యరంగ ప్రముఖులు, ప్రముఖ శిల్పి రాజకుమార్ ఉడయార్ తదితరులు ఈ చిన్నారికి ఆశీస్సులు అందజేయనున్నారు.