పెద్ద నోట్ల దందా
వరంగల్ పోస్టల్ శాఖలో అక్రమాలు
అధికారుల ఇళ్లలో సీబీఐ సోదాలు
వరంగల్ : పెద్ద నోట్ల రద్దుతో జరిగిన అక్రమాల వ్యవహారం వరంగల్ నగరానికి తాకింది. నల్లధనం వెలికితీత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. ప్రజల వద్ద ఉన్న పెద్ద నోట్లను బ్యాంకులతోపాటు పోస్టాఫీసులలో మార్పిడి చేసుకునే అవకాశం కల్పించింది. ఇలా పెద్ద నోట్ల మార్పిడి అవకాశాన్ని ఆసరాగా చేసుకుని వరంగల్ నగరంలోని పోస్టల్ శాఖ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) కేసు నమోదు చేసింది. వరంగల్ పోస్టల్ విభాగంలో పనిచేస్తున్న ఎ.సోమయ్య(ట్రెజరర్), పి.ఎ.సురేశ్‌కుమార్(అసిస్టెంట్ ట్రెజరర్), ఎన్.శివకుమార్(క్లర్క్), జి.కేదారి(క్లర్క్) పెద్ద నోట్ల మార్పిడిలో కమీషన్లు పొంది అక్రమాలు చేసినట్లు అసిస్టెంట్ పోస్టుమాస్టర్ జనరల్ శేషగిరిరావు సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు 2016 నవంబరు 9 నుంచి 24 వరకు వీరంతా కలిసి రూ.11 లక్షల కొత్త నోట్లను మార్పిడి కోసం వినియోగించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అంశాలను పరిశీలించిన సీబీఐ వీరిపై కేసు నమోదు చేసింది.
వరంగల్ నగరంలోని వీరి ఇళ్లలో బుధవారం సోదాలు జరిపి వివరాలను సేకరించారు. మొత్తంగా సీబీఐ కేసు నమోదు, అధికారుల ఇళ్లలో సోదాలతో పోస్టల్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. అక్రమాలకు పాల్పడిన మరికొందరు అధికారులలో భయాందోళన మొదలైంది. మరోవైపు తొర్రూరు పోస్టల్ అధికారులు సైతం పెద్ద నోట్ల మార్పిడిలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక్కడి అక్రమాలపై కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు ఇప్పటికే దృష్టిసారించాయి. ప్రాథమిక ఆధారాలను సేకరించిన తర్వాత కేసు నమోదు చేసేందుకు నిఘా అధికారులు సిద్ధమవుతున్నారు. పెద్ద నోట్ల మార్పిడిలో అక్రమాలకు పాల్పడిన పోస్టల్ శాఖ అధికారుల ఆస్తుల వివరాలను కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు, నిఘా సంస్థలు సేకరిస్తున్నాయి.