భయం.. భయం | danger.. danger.. | Sakshi
Sakshi News home page

భయం.. భయం

Published Thu, Aug 4 2016 9:47 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

భయం.. భయం - Sakshi

భయం.. భయం

ఎల్లారెడ్డి
నాగిరెడ్డిపేట : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయి. ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ అందులోనే విధులు నిర్వహిస్తున్నారు. అసలే వర్షకాలం.. చిరుజల్లులకే పైకప్పుల నుంచి నీళ్లు కారుతున్నాయి.. పెచ్చులూడి పడుతున్నాయి. వరుస వర్షాలతో ఎప్పుడూ కూలుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గాంధారి మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయ భవనం ప్రమాదకరంగా మారింది. పైకప్పు పెచ్చులూడి వర్షం నీళ్లు కిందకు కారుతున్నాయి. పుస్తకాలను ఎలా భద్రపరచాలో అర్థం కాక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని పాత భవనం శిథిలమైంది. దీన్ని తొలగించడం లేదు. ఉత్తునూర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాల, ఎల్లారెడ్డి పట్టణంలోని ఎస్టీవో కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. బాలుర  ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం కూలేందుకు సిద్ధంగా ఉంది. వరండాలో పైకప్పు నుంచి పూర్తిగా పెచ్చులూడిపోయాయి. సదాశివగనర్‌ మండల కేంద్రంలోని హైస్కూల్‌తో పాటు భూంపల్లి, అడ్లూర్‌ ఎల్లారెడ్డి హైస్కూళ్ల భవనాలు ప్రమాదకరంగా మారాయి. తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్, క్రిష్ణాజివాడి, నందివాడ తదితర పాఠశాలలకు చెందిన తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. 70 ఏళ్ల క్రితం కట్టిన భవనంలోనే ఎర్రపహాడ్‌ ప్రాథమిక పాఠశాల నిర్వహిస్తున్నారు. ఇది ఎప్పుడు కూలుతుందో తెలియక విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనతో గడుపుతున్నారు.
బాల్కొండ
మోర్తాడ్‌/కమ్మర్‌పల్లి/వేల్పూర్‌ : బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పాత భవనాలు కూలేందుకు సిద్ధమయ్యాయి. వీటిని తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మోర్తాడ్‌ మండలంలోని పాలెం ప్రాథమికోన్నత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుత వర్షాలతో అది మరింత ప్రమాదకరంగా మారింది. పశువైద్యశాల భవనం కూడా శిథిలావస్థకు చేరింది. కమ్మర్‌పల్లి మండలంలోని చౌట్‌పల్లి జెడ్పీ హైస్కూల్‌ భవనం ప్రమాదకరంగా మారింది. తరగతి గదుల్లో స్లాబు పెచ్చులూడి ఇనుప చువ్వలు తేలాయి. గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. భారీ వర్షాలకు కూలిపోయే ప్రమాదం ఉంది. వేల్పూర్‌ మండల కేంద్రంలో చాలా ఏళ్ల క్రితం నిర్మించిన పశు వైద్యశాల కూలేందుకు సిద్ధమైంది. ప్రమాదకరంగా మారిన ఈ భవనంలోనే ఆస్పత్రి నిర్వహిస్తున్నారు.
నిజామాబాద్‌ అర్బన్‌
నిజామాబాద్‌ అర్బన్‌ : నగరంలో పురాతన భవనాలు ప్రమాదకరంగా మారాయి. ఏళ్ల కిందట నిర్మించిన నివాస గృహాలు శిథిలావస్థకు చేరాయి. కోటగల్లి, గాజులపేట, మార్వాడి గల్లీ, కసాబ్‌గల్లీ, అశోక్‌ వీధి, జెండా గల్లీ, మైసమ్మవీధి, పెద్దబజారు ప్రాంతాల్లో ఎక్కువగా పురాతన కట్టడాలు ఉన్నాయి. అప్పట్లో మట్టితో నిర్మించిన ఇళ్లు కాలం చెల్లాయి. ప్రస్తుత వర్షాలకు అవి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవల ఆశోక్‌వీధిలో ఓ పురాతన భవనం కూలిపోయింది. ఇలాంటి ఇళ్లను ఇప్పటికే గుర్తించిన అధికారులు వాటిని ఖాళీ చేయించారు. అయితే, వాటిని తొలగించడంలో మాత్రం జాప్యం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. కలెక్టరేట్‌లోని పలు భవనాలు సహా నిజామాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయం ప్రమాదకరంగా మారింది. ఉద్యోగులు భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు. పెద్దబజారులోని యూనాని ఆసుపత్రి పాత భవనంలోనే కొనసాగుతోంది.
ఆర్మూర్‌..
ఆర్మూర్‌అర్బన్‌/మాక్లూర్‌/నందిపేట : నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ప్రమాకరంగా మారాయి. ఆర్మూర్‌ మండలంలోని ఇస్సాపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. 1968లో నిర్మించిన ఈ భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. ఆర్మూర్‌లోని ఎన్‌ఆర్‌ఈజీఎస్, వీఆర్వో కార్యాలయాలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియక ఉద్యోగులు భయంభయంగా విధులు నిర్వహిస్తున్నారు. మాక్లూర్‌ మండల కేంద్రంలోని ట్రాన్స్‌కో కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దీంతో అధికారులు ఆ కార్యాలయంలో పనులు చేయాలంటే జంకుతున్నారు. నందిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల భవనాలు ప్రమాదకరంగా మారాయి. మండలంలోని వెల్మల్‌ గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం శిథిలావస్థకు చేరి ఏళ్లు గడుస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అలాగే శాపూర్‌లోని ప్రాథమిక పాఠశాల, నందిపేటలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల తరగతి గదులు కూలేందుకు సిద్ధమయ్యాయి.
కామారెడ్డి..
కామారెడ్డి : నియోజకవర్గంలో చాలా భవనాలు కూలే దశకు చేరాయి. నిజాం కాలంలో నిర్మించిన కట్టడాల్లో ఇంకా కార్యాలయాలు కొనసాగిస్తున్నారు. ఆ భవనానికి కాలం చెల్లిందని ఎప్పుడో నిర్ధారించారు. అందులో ఉన్న తహసీల్‌ కార్యాలయాన్ని మార్చారు కూడా. కానీ అదే భవనంలో ఓ మూలన ఉప కోశాధికారి (సబ్‌ ట్రెజరీ) కార్యాలయం మాత్రం కొనసాగుతోంది. నిజాం కాలంలో నిర్మితమైన ఈ భవనాన్ని కాలం చెల్లిన భవనాల జాబితాలో చేర్చారు. అందుకే తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలోని క్లబ్‌ భవనంలోకి మార్చారు. అయితే సబ్‌ ట్రెజరీ కార్యాలయం విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదు. వర్షం కురిసినప్పుడు కార్యాలయంలోని గదుల్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. కూలిపోతుందనే వాస్తవం తెలిసినప్పటికీ కార్యాలయాలను కొనసాగిస్తుండడం మనోళ్లకే చెల్లింది. పైగా, ప్రమాదకరంగా మారిన ఈ భవనంలోకే కొత్తగా ఎక్సైజ్‌ కార్యాలయాన్ని మార్చనున్నారని సమాచారం. 
బోధన్‌ : నియోజకవర్గంలో పలు కట్టడాలు అవసాన దశకు చేరాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని ఈ కట్టడాల్లోనే ఇంకా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బోధన్‌లోని శక్కర్‌నగర్‌ నిజాంషుగర్‌ ఫ్యాక్టరీ గేట్‌కు ఎదురుగా దశాబ్దాల క్రితం నిర్మించిన జనరల్‌ ఆస్పత్రి బహుళ అంతస్తుల భవనం కూలిపోయే దశలో ఉంది. ఈభవనంలోనే ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఎఫ్‌ కోర్‌ కమిటీ కార్యాలయం కొనసాగుతోంది. శక్కర్‌నగర్‌లోని ఎంవీఐ కార్యాలయం భవనం రాకాసీపేట్‌ ప్రాంతంలో పశువైద్యశాల భవనం, పాత మున్సిపల్‌ ఆఫీసు భవనం, ఆర్‌డబ్ల్యూస్‌ డివిజన్‌ కార్యాలయంతో పాటు పలుచోట్ల ప్రభుత్వ పాఠశాలల భవనాలు, కళాశాలల భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఆర్టీసీ కొత్త బస్టాండ్‌లో నిజామాబాద్‌ వెళ్లే ప్లాట్‌ ఉన్న రేకుల షెడ్డు కూలిపోయే దశకు చేరింది. నియోజకవర్గంలో 82 గ్రామ పంచాయతీలుండగా, ఇందులో సగానికి పైగా పంచాయతీ కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయి. నవీపేట మండల కేంద్రంలో పీహెచ్‌సీ భవనం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ఉంది. పలు గ్రామాల్లో పురాతన కాలంలో నిర్మించిన మట్టి బురుజులు ప్రమాదకరంగా మారాయి. 2014లో బోధన్‌ మండలంలోని హున్సాలో జనావాసాల మధ్య ఉన్న మట్టి బురుజు సగభాగం విరిగి పడింది. మట్టి బురుజులను తొలగిస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన అధికారులు ఇంతవరకు అమలు చేయలేదు. మరోవైపు, ప్రమాదకరంగా మారిన పాత భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలను సర్వే ద్వారా గుర్తించారు కానీ, ఇంతవరకు తొలగించే ప్రక్రియ చేపట్టలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement