చీకటి పత్రం
చీకటి పత్రం
Published Thu, Sep 29 2016 12:10 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
– తాజాగా జేసీ విచారణతో ఊరట
– రూ.33 కోట్ల నష్టపరిహారం చెల్లింపునకు మార్గం సుగమం
– అనుమతివ్వాలని ప్రభుత్వానికి వినతి
– గతంలో హడావుడిగా ఆర్డీఓల నివేదికలు
– వీటి ఆధారంగా కోర్టులో తేల్చుకోవాలన్న కలెక్టర్
– గత నివేదికలు తప్పని తేల్చిన జేసీ విచారణ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇప్పటికే పలు పార్టీలు, ప్రజా సంఘాలు అసంతప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా మరోసారి కలెక్టర్ వైఖరి చర్చనీయాంశమయింది. గని, శకునాల రైతులకు నష్టపరిహారం చెల్లింపు విషయంలో వివాదాలు ఉన్నాయనే కారణంగా కోర్టు ద్వారానే తేల్చుకోవాలంటూ స్వయంగా కలెక్టర్ సమర్పించిన నివేదిక తప్పని తేలింది. అందులో అనేక మంది రైతుల భూముల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని.. వారికి నష్టపరిహారం చెల్లించాల్సిందేనని జాయింట్ కలెక్టర్(జేసీ) పునర్విచారణలో స్పష్టమైంది. ఈ నేపథ్యంలో కోర్టులో తేల్చుకోవాలంటూ గతంలో సమర్పించిన నివేదికను పక్కనపెట్టి.. అర్హులని తేలిన రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని తాజాగా ప్రభుత్వాన్ని జిల్లా యంత్రాంగం కోరింది. ఇన్ని రోజులుగా మెగా సోలార్ ప్లాంటు ఏర్పాటు పనులకు అడ్డంకిగా మారిన గని, శకునాల భూముల వ్యవహారం తాజాగా జేసీ విచారణతో తేలనుంది. మొత్తం మీద అర్హులైన రైతులకు త్వరలో పరిహారం అందనుంది. మొత్తం రూ.33 కోట్ల మేరకు పరిహారం చెల్లించాల్సి ఉంటందని జేసీ విచారణలో తేలినట్టు సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంటు ఏర్పాటు విషయంలో కలెక్టర్ వైఖరితోనే ఇన్ని రోజులుగా పనులు జరగడం లేదనే ఆరోపణలకు తాజా విచారణ బలం చేకూరుస్తోంది.
66 శాతం మంది అర్హులే..
ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంటును జిల్లాలోని గని, శకునాల వద్ద ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం భూసేకరణను చేపట్టారు. అయితే, కొద్ది మంది రైతుల భూముల వ్యవహారంలో ఎవరు అర్హులో? ఎవరు కాదో అనే తకరారు ఏర్పడింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆర్డీఓలను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ నుంచి వచ్చిన ఆదేశాలు, ఒత్తిడితో ఆర్డీఓలు హడావుడిగా నివేదికలు తయారుచేశారు. మొత్తం 1,300 ఎకరాలపై నెలకొన్న వివాదంపై సుమారు 600 మంది రైతులను విచారించి ఇందులో 60 శాతానికి పైగా రైతులు(సుమారు 360 మంది రైతులు) పరిహారం పొందేందుకు అర్హులని జేసీ విచారణలో తేలింది. వీరందిరికీ రూ.33 కోట్ల పరిహారం చెల్లించాలని జేసీ సూచించారు. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి.. రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని తాజాగా ప్రభుత్వాన్ని జిల్లా యంత్రాంగం కోరింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే రైతులకు నష్టపరిహారం అందనుంది. మొత్తం మీద జేసీ విచారణతో గని, శకునాల రైతులకు కాస్తా ఊరట లభించనుంది.
సోలార్ కంపెనీ ఫిర్యాదు
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా అతి పెద్ద సోలార్ ప్లాంటు ఏర్పాటుకు చేపట్టిన ప్రయత్నాలకు మొదటి నుంచీ అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. భూ సేకరణ కోసం అవసరమయ్యే మొత్తాన్ని తాము కలెక్టర్ వద్ద డిపాజిట్ చేసినప్పటికీ పనులు మాత్రం ముందుకు కదలడం లేదని సోలార్ కంపెనీ యాజమాన్యం వాపోతోంది. హక్కుదారులమైనా వివాదం పేరిట కోర్టులో తేల్చుకోవాలన్న కలెక్టర్ నివేదికపై రైతులు మండిపడ్డారు. పనులు జరుగనిచ్చేది లేదని భూమి పూజ కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)కి కంపెనీ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఒకవైపు భూసేకరణ పూర్తయ్యిందని కలెక్టర్ చెబుతున్నప్పటికీ పనులు చేసేందుకు వెళితే మాత్రం రైతులు అడ్డుకుంటున్నారని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో భూసేకరణ వ్యవహారంపై తేల్చాలని కలెక్టర్‌ను సీఎస్ ఆదేశించారు. పైగా వాస్తవానికి విరుద్ధంగా నివేదికలు ఇవ్వడంపై ఆయన మండిపడినట్టు సమాచారం. ఫలితంగా జేసీ ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేసి అర్హులైన రైతులెవరో తేల్చాలని కలెక్టర్ కోరారు. ఇందుకు అనుగుణంగా గతంలో ఇచ్చిన ఆర్డీఓల నివేదికకు భిన్నంగా అనేక మంది రైతులు పరిహారానికి అర్హులని తేలడంతో ఇప్పటికైనా వ్యవహారం సద్దుమణిగి సోలార్ ప్లాంటు పనులు ముందుకు సాగుతాయో లేదో చూడాల్సి ఉంది.
Advertisement
Advertisement