సాక్షి,సిటీబ్యూరో: దసరా ప్రయాణం షురూ అయింది. శుక్రవారం నుంచి అక్టోబర్ 13 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో నగర వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో గురువారం నుంచే రైళ్లు, బస్సుల్లో పండుగ రద్దీ మొదలైంది. విజయవాడ, వైజాగ్, తిరుపతి వైపు వెళ్లే రైళ్లు ప్రయాణికులతో నిండిపోయాయి.
మరోవైపు విజయవాడ, వరంగల్, కరీంనగర్ మార్గాల్లో నడిచే బస్సుల్లోనూ ఇదే రద్దీ కనిపించింది. దసరా, దీపావళిని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే ఈసారి 52 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయగా, దసరా సెలవులకు హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీల్లోని ప్రధాన ప్రాంతాలకు ఆర్టీసీ 3,060 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది. అక్టోబర్ 10 వరకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ బస్సులు నడుపుతారు.
అన్ని వైపుల నుంచి బస్సులు..
నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ గంగాధర్ ‘సాక్షి’తో చెప్పారు. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్ నుంచే కాకుండా బీహెచ్‌ఈఎల్, కేపీహెచ్‌బీ, జీడిమెట్ల, ఎస్‌ఆర్ నగర్, ఈసీఐఎల్, ఎల్‌బీనగర్, ఆరాంఘర్ చౌరస్తా, ఉప్పల్ రింగ్‌రోడ్డు నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు.
ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున అక్టోబర్ 5న 95 బస్సులు, 6న 190, 7న 655 బస్సులను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 8న 550, 9న 430, 10న 390 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ, విశాఖ, నెల్లూరు, తిరుపతి, బెంగళూరు, పూణే, ముంబయి, చెన్నైతో పాటు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, తదితర ప్రాంతాలకు ఏ రోజుకు ఆ రోజు ప్రత్యేక బస్సులు ఉంటాయని ఆర్‌ఎం స్పష్టం చేశారు.
ఈసారి అరకొర రైళ్లే..
ఏటా ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నా ప్రత్యేక రైళ్లు మాత్రం పెరగడం లేదు. ఈసారి దసరా, దీపావళి పురస్కరించుకుని దక్షిణమధ్య రైల్వే 52 అదనపు రైళ్లు నడిపేందుకు మాత్రమే చర్యలు తీసుకుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విజయవాడ, పట్నా, కాకినాడ, జైపూర్ తదితర ప్రాంతాలకు ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
సాధారణ రోజుల్లో జంట నగరాల నుంచి 2.5 లక్షల మంది ప్రయాణికులు, పండుగలు, వరుస సెలవుల్లో 3.5 లక్షల మంది నగరం నుంచి బయలుదేరుతారు. మిగతా రవాణా సదుపాయాల కంటే రైలు ప్రయాణానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. కానీ అందుకు అనుగుణంగా అదనపు సదుపాయాలు పెంచాల్సిన అధికారులు ఆ దిశగా కసరత్తు చేపట్టకపోవడం గమనార్హం. దీంతో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు.
కాకినాడకు ప్రత్యేక రైళ్లు..
ఇలా ఉండగా, దసరా సందర్భంగా సికింద్రాబాద్–కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఇంచార్జి సీపీఆర్వో ఏకే సింగ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్–కాకినాడ స్పెషల్ అక్టోబర్ 4,11,18,25, నవంబర్ 1 తేదీల్లో సాయంత్రం 7.15 కు ఇక్కడి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 5,12,19,26, నవంబర్ 2 తేదీల్లో సాయంత్రం 5.30కు కాకినాడలో బయలుదేరుతుంది.