కుదిరిన ముహూర్తం | date conform | Sakshi
Sakshi News home page

కుదిరిన ముహూర్తం

Published Sun, Jul 24 2016 8:34 PM | Last Updated on Mon, Jul 30 2018 1:30 PM

కుదిరిన ముహూర్తం - Sakshi

కుదిరిన ముహూర్తం

  • ఆర్‌ఎఫ్‌సీఎల్, ఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్‌–1 ప్లాంట్లకు ముహూర్తం
  • ఆగస్టు 7న ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా శంకుస్థాపన
  • ఏర్పాట్లలో నిమగ్నమైన యాజమాన్యాలు
  • గోదావరిఖని : ఎట్టకేలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ రామగుండం పారిశ్రామిక ప్రాంత పర్యటనకు ముహూర్తం ఖరారైంది. గత ఏడాది నవంబర్, డిసెంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని ఈ ప్రాంతానికి వస్తారని స్వయంగా కేంద్రమంత్రులే ప్రకటించినప్పటికీ ఆయన పర్యటన రదై్దంది. తాజాగా సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర పర్యటనకు రావాలని కోరడంతో ప్రధాని అంగీకరించారు. ఆగస్టు 7వ తేదీన రాష్ట్ర పర్యటనకు వస్తున్న క్రమంలో రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్‌–1 ప్లాంట్, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ గ్యాస్‌ ఆధారిత ఎరువుల కర్మాగారం పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మూసివేసిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని గ్యాస్‌ ఆధారితంగా పునర్నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన అంతర్గత పనులు మార్చి 25న (జీరో డేట్‌) ప్రారంభమయ్యాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ను నిర్మించే క్రమంలో రామగుండంలో తెలంగాణ స్టేజ్‌–1 కింద 800 మెగావాట్ల రెండు యూనిట్లను నెలకొల్పుతోంది. ఈ పనులు జనవరి 29న  (జీరో డేట్‌) అంతర్గతంగా ప్రారంభమయ్యాయి. ఈ రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆగస్టు 7న లాంఛనప్రాయంగా శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్‌ టౌన్‌షిప్‌లో మూడు హెలీక్యాప్టర్లు ల్యాండ్‌ అయ్యేవిధంగా హెలీప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. పక్కనే గల స్టేడియంలో బహిరంగసభ నిర్వహించే అవకాశాలున్నాయి. 
    ఆర్‌ఎఫ్‌సీఎల్‌తో మహర్దశ
    గతంలో రామగుండం పారిశ్రామికాభివృద్ధికి ఎరువుల కర్మాగారం కీలకంగా నిలిచింది. అన్నపూర్ణ పేరుతో ఎరువులను తెలంగాణ ప్రాంతానికి అందించింది. అయితే నిర్వహణ లోపాలు, అప్పుల కారణంగా ఈ కర్మాగారం నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో 1999 మార్చి 31న ఉత్పత్తిని నిలిపివేశారు. బీఐఎఫ్‌ఆర్‌కు వెళ్లిన ఈ కంపెనీ రూ.10 వేల కోట్ల అప్పులను మాఫీ చేయడంతో చాలాకాలం తర్వాత అందులో నుంచి బయటపడింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ కర్మాగారాన్ని గ్యాస్‌ ఆధారితంగా పునర్నిర్మించడానికి నిర్ణయించింది. ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్, నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్, ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా జాయింట్‌ వెంచర్‌లో రూ.5,700 కోట్ల అంచనా వ్యయంతో పునర్నిర్మిస్తున్నారు. 3,850 మెట్రిక్‌ టన్నులు అమోనియా, 2,200 మెట్రిక్‌ టన్నుల యూరియా ఈ కర్మాగారంలో ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. గ్యాస్‌ సరఫరాకు సంబంధించి ఈనెల 8న గుజరాత్‌కు చెందిన కంపెనీతో ఒప్పందం జరిగింది. కాకినాడ నుంచి మల్లవరం వరకు వేసే పైపులైన్‌ నుంచి గ్యాస్‌ను తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం రామగుండం ఎరువుల కర్మాగారం ఆవరణలోని పాత యంత్రాలు, విభాగాలను పూర్తిగా తొలగించి నేలను చదును చేశారు. యూరియా ప్రిల్లింగ్‌ టవర్, యూరియాను నిల్వ ఉంచే సైలో మినహా అన్నింటిని తొలగించారు. ఇందులో 500 మంది శాశ్వత ఉద్యోగులు, మరో వెయ్యి మంది కాంట్రాక్ట్‌ కార్మికులకు ఉపాధి లభించనుంది. 
    రెండు ప్లాంట్లు... 1600 మెగావాట్లు 
    తెలంగాణ స్టేజ్‌–1 మొదటి దశలో 800 మెగావాట్ల రెండు యూనిట్ల నిర్మాణ పనులు వేగంగా నడుస్తున్నాయి. బాయిలర్‌ కాంట్రాక్టు పొందిన బీహెచ్‌ఈఎల్‌ సంస్థ గ్రౌండ్‌ లెవల్, గ్రేడింగ్‌ పనులను పూర్తి చేసి బాయిలర్లు నెలకొల్పేందుకు ఫౌండేషన్‌ను సిద్ధం చేసింది. టర్బైన్‌ కాంట్రాక్టును దక్కించుకున్న ఆల్‌స్టాం సంస్థ మట్టి పరీక్ష పనులను పూర్తి చేసి పవర్‌హౌస్‌ స్థలాన్ని చదును చేసి స్ట్రక్చర్ల నిర్మాణానికి సిద్ధం చేసింది. అలాగే పవర్‌హౌస్, బాయిలర్లు, కూలింగ్‌ టవర్లు, స్విచ్‌యార్డుతోపాటు 275 మీటర్ల చిమ్నీని నిర్మిస్తారు. తెలంగాణ ఫేస్‌–1 కోసం ఇప్పటికే రూ.10,500 కోట్లు మంజూరయ్యాయి. బాయిలర్, టర్బైన్‌ పనులు నడుస్తుండగా, మిగతా సివిల్‌ పనులను బీహెచ్‌ఈఎల్, ఆల్‌స్టాం సంస్థలు సబ్‌కాంట్రాక్టర్లకు అప్పగించాయి. సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో నిర్మిస్తున్నందున ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 42 నెలల సమయం పడుతుంది. ఫేస్‌–2లో 800 మెగావాట్ల 3 యూనిట్లను ప్రస్తుత కొత్త ప్లాంట్‌ ప్రతిపాదిత స్థలంలోనే నిర్మించేందుకు కార్పొరేట్‌ ఇంజనీరింగ్‌ విభాగం నిర్ణయించింది. ఈ మూడు యూనిట్లకు అనుసంధానంగా ఉండే మెయిన్‌ ప్లాంటులోని బాయిలర్, టర్బైన్‌ తదితర విభాగాలను ఫేస్‌–1 పరిసరాలలోనే ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 7వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుండడంతో పనులు మరింత వేగవంతమవుతాయని భావిస్తున్నారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement