కబళించిన మృత్యువు
Published Sat, Dec 10 2016 2:17 AM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM
విద్యుదాఘాతానికి యువకుడి బలి
కైకరం(ఉంగుటూరు): మృత్యువు శుక్రవారం ముగ్గురిని కబళించింది. కైకరంలో విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కైకరంలోని ఓ ఇంటికి కూలి పనికి వెళ్లిన చింతాడ నూకరాజు(31) విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో బంధువులు నూకరాజుకు స్థానిక పీఎంపీ వైద్యశాల వద్ద ప్రాథమిక చికిత్స చేయించి, అక్కడి నుంచి నారాయణపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించటంతో తాడేపల్లిగూడెం ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నూకరాజు మృతి చెందాడు. చేబ్రోలు ఎస్సై చావా సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ..
మొగల్తూరు : గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతిచెందిన ఘటన శుక్రవారం మొగల్తూరులో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మొగల్తూరులోని శ్రీదేవి జానకి థియేటర్ ఎదురుగా నివాసం ఉంటున్న బండి సత్తెమ్మ(65) తన ఇంటి ముందు శుక్రవారం వేకువ జామున కళ్లాపు చల్లుతుండగా, వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఆమెను ఢీకొని కొద్ది దూరం ఈడ్చుకుపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే ఆమె మరణించింది. దీనిపై పోలీసు కేసు పెట్టడం ఇష్టం లేక కుటుంబ సభ్యులు మిన్నకుండిపోయారు. మృతురాలికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ధ్రువ చిత్రం విడుదల సందర్భంగా థియేటర్ ముందు వందలాదిమంది ప్రేక్షకులు ఉన్నా.. ఎవరూ ప్రమాదాన్ని గమనించకపోవడం విశేషం.
వాటర్ ట్యాంకర్ ఢీకొట్టి..
భీమవరం టౌ¯ŒS : స్థానిక ప్రకాశంచౌక్ సెంటర్లో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఒక ఆక్వా కంపెనీకి చెందిన వాటర్ ట్యాంకర్ ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులను వివరణ కోరగా సమాచారం ఇంకా అందాల్సి ఉందని పేర్కొన్నారు.
Advertisement
Advertisement