నాన్న ఎప్పుడొస్తాడు..? | death of Nageshwara Rao in the house | Sakshi
Sakshi News home page

నాన్న ఎప్పుడొస్తాడు..?

Published Wed, May 3 2017 1:22 AM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

నాన్న ఎప్పుడొస్తాడు..?

నాన్న ఎప్పుడొస్తాడు..?

మృతుడు నాగేశ్వరరావు ఇంట్లో విషాదం
అనాథలైన భార్య, పిల్లలు


నాన్న డ్యూటీకెళ్లాడు.. వచ్చేస్తాడు.. వచ్చినప్పడు రోజూ పప్పలు తెస్తాడు... చిన్నారుల ఎదురుచూపు. అమ్మ హడావిడిగా వెళ్లింది.. అమ్మమ్మ ఏడుస్తోంది.. ఇంటి నిండా జనం..వారికి ఏం జరిగిందో తెలీదు పాపం. నాన్న ఇక రాడని.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని అర్థం చేసుకోలేని వయసు వారిది. అంత చిన్నతనంలోనే ఎంత కష్టమొచ్చిందో అంటూ కుటుంబ సభ్యుల కన్నీరు..

అచ్యుతాపురం: పరవాడ ఫార్మా సిటీలో మంగళవారం జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అచ్యుతాపురం మండలం ఖాజీపాలేనికి చెందిన పీలా నాగేశ్వరరావు (28) ఇంట్లోని హృదయవిదారక దృశ్యమిది. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న నాగేశ్వరరావు పరవాడ ఫార్మా సిటీ పరిశ్రమకు పనికి వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోవడంతో ఆ కుటుంబం దిక్కులేనిదయింది. నాన్నను కోల్పోయి అనాథలైన ఆ చిన్నారులను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. ఖాజీ పాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నాగేశ్వరరావుకు భార్య మంగ, పాప జగదీశ్వరి (5), బాబు సంతోష్‌కుమార్‌ (3) ఉన్నారు. నాగేశ్వరరావు ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు. సొంత భూమి లేకపోవడంతో కౌలు రైతుగా కొన్నాళ్లు వ్యవసాయం చేశాడు. నష్టాలు రావడంతో వ్యవసాయాన్ని విడిచిపెట్టాడు. ఆ తరువాత వ్యవసాయ కూలీగా గ్రామంలో పనులకు వెళ్లేవాడు. ఏడాది పొడవునా గ్రామంలో కూలిపని లభించకపోవడంతో ఫార్మా సిటీలో పనికివెళుతున్నాడు. అతని సంపాదన మీదే కుటుంబం ఆధారపడి ఉంది. ఇంతలో ఘోరం జరిగిపోయింది.  

తండ్రి కోసం ఎదురుచూపు
పిల్లలు ఉదయం నిద్ర లేచేసరికి తండ్రి నాగేశ్వరరావు డ్యూటీకి వెళ్లిపోయాడు. సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి వచ్చేస్తాడని ఆ చిన్నారులు ఎదురుచూస్తున్నారు. నాన్న డ్యూటీకి వెళ్లాడు.. వచ్చేస్తాడని ఆ చిన్నారులు చెబుతున్నప్పుడు అక్కడున్నవారు కంటతడిపెట్టారు. ఇక ఆ పిల్లలకు దిక్కెవరని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement