Catastrophic event
-
నాన్న ఎప్పుడొస్తాడు..?
మృతుడు నాగేశ్వరరావు ఇంట్లో విషాదం అనాథలైన భార్య, పిల్లలు నాన్న డ్యూటీకెళ్లాడు.. వచ్చేస్తాడు.. వచ్చినప్పడు రోజూ పప్పలు తెస్తాడు... చిన్నారుల ఎదురుచూపు. అమ్మ హడావిడిగా వెళ్లింది.. అమ్మమ్మ ఏడుస్తోంది.. ఇంటి నిండా జనం..వారికి ఏం జరిగిందో తెలీదు పాపం. నాన్న ఇక రాడని.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని అర్థం చేసుకోలేని వయసు వారిది. అంత చిన్నతనంలోనే ఎంత కష్టమొచ్చిందో అంటూ కుటుంబ సభ్యుల కన్నీరు.. అచ్యుతాపురం: పరవాడ ఫార్మా సిటీలో మంగళవారం జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అచ్యుతాపురం మండలం ఖాజీపాలేనికి చెందిన పీలా నాగేశ్వరరావు (28) ఇంట్లోని హృదయవిదారక దృశ్యమిది. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న నాగేశ్వరరావు పరవాడ ఫార్మా సిటీ పరిశ్రమకు పనికి వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోవడంతో ఆ కుటుంబం దిక్కులేనిదయింది. నాన్నను కోల్పోయి అనాథలైన ఆ చిన్నారులను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. ఖాజీ పాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నాగేశ్వరరావుకు భార్య మంగ, పాప జగదీశ్వరి (5), బాబు సంతోష్‌కుమార్ (3) ఉన్నారు. నాగేశ్వరరావు ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు. సొంత భూమి లేకపోవడంతో కౌలు రైతుగా కొన్నాళ్లు వ్యవసాయం చేశాడు. నష్టాలు రావడంతో వ్యవసాయాన్ని విడిచిపెట్టాడు. ఆ తరువాత వ్యవసాయ కూలీగా గ్రామంలో పనులకు వెళ్లేవాడు. ఏడాది పొడవునా గ్రామంలో కూలిపని లభించకపోవడంతో ఫార్మా సిటీలో పనికివెళుతున్నాడు. అతని సంపాదన మీదే కుటుంబం ఆధారపడి ఉంది. ఇంతలో ఘోరం జరిగిపోయింది. తండ్రి కోసం ఎదురుచూపు పిల్లలు ఉదయం నిద్ర లేచేసరికి తండ్రి నాగేశ్వరరావు డ్యూటీకి వెళ్లిపోయాడు. సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి వచ్చేస్తాడని ఆ చిన్నారులు ఎదురుచూస్తున్నారు. నాన్న డ్యూటీకి వెళ్లాడు.. వచ్చేస్తాడని ఆ చిన్నారులు చెబుతున్నప్పుడు అక్కడున్నవారు కంటతడిపెట్టారు. ఇక ఆ పిల్లలకు దిక్కెవరని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. -
మింగేసిన వేగం
రెండు పదుల వయస్సుకే తెల్లారిన జీవితాలు మద్యం మత్తుకు అదనంగా అతి వేగం వేకువజామున విశాలాక్షినగర్‌లో ఘోర ప్రమాదం ఘటనాస్థలిలో ఇద్దరు యువకుల దుర్మరణం మరో ఇద్దరి పరిస్థితి విషమం ఆరిలోవ (విశాఖ తూర్పు) : మద్యం మత్తుకు అతివేగం తోడవడంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా తయారయింది. బీచ్‌రోడ్డును ఆనుకుని ఆరో వార్డు పరిధి విశాలాక్షినగర్‌లో ఆది వారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వారంతా నగరంలో మాధవధార, వేపగుంట ప్రాంతాలకు చెందినవారు. ఇంజినీరింగ్ చదువుతున్న వారంతా కలిసి శనివారం సాయంత్రం విశాలాక్షినగర్‌లో ఉంటున్న మరో స్నేహితుడి ఇంటికి కారులో వెళ్లారు. అక్కడే రాత్రంతా గడిపి వేకువజామున కారులో తిరిగి తమ ఇళ్లకు బయలుదేరారు. అతివేగంగా నడిపిన కారు అదుపుతప్పి విశాలాక్షిగర్లో బీవీకే కళాశాల సమీపంలో ఓ చెట్టుకు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకొంది. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... స్నేహితుని ఇంటిలో సరదాగా గడిపి... ప్రమాదంలో మాధవధారకు చెందిన అన్నవర్జుల శశాంక్(21), వేపగుంటకు చెందిన సాయి వంశీకృష్ణ(21) సంఘటన స్థలంలోనే మృతి చెందారు. శశాంక్ చెన్నైలో ఎస్.ఆర్.ఎం కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మరో మృతుడు సాయివంశీతో పాటు తీవ్ర గాయాలపాలైన చైతన్య బెహర(21), కిరణ్ బెహర(21)లు నగరంలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. వీరంతా ఒకప్పుడు విశాఖ వేలీ స్కూల్లో చదువుకున్నారు. వారితోపాటు విశాఖ వేలీ స్కూల్లో చదువుకుని విశాలాక్షినగర్‌లో ఉంటున్న స్నేహితుడి ఇంటికి శనివారం వచ్చి రాత్రంతా టీవీలో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ మద్యం సేవించారు. తిరిగి ఆదివారం వేకువ జామున 3.30 గంటల సమయంలో కారులో ఇళ్లకు బయలుదేరారు. మితిమీరిన వేగంతో నడిపిన కారు అదుపుతప్పి రోడ్డు పక్క ఓ చెట్టుకు ఢీకొని ప్రమాదానికి గురైంది. డ్రైవింగ్ చేసిన చైతన్య బెహర కాళ్లు రెండూ నుజ్జవడంతో కారులోనే ఇరుక్కుపోయాయి. తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ముందు సీటులో అతని పక్కనే కూర్చొన్న శశాంక్, వెనుక సీటులో కూర్చొన్న వంశీకృష్ణ సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. కిరణ్ బెహర తలకు తీవ్ర గాయాలవడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఆరిలోవ సీఐ సీహెచ్ తిరుపతిరావు, ఎస్ఐలు సంతోష్‌కుమార్, కాంతారావు సిబ్బందితో ప్రమాద స్థలికి చేరుకున్నారు. అనంతరం కొంతసేపటికి ఏసీపీ రంగరాజు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు. నుజ్జయిన కారును క్రేన్ సహాయంతో తొలగించారు. అందులో ఇరుక్కుపోయిన మృతులు, గాయాల పాలైనవారిని వెల్డర్లు సహకారంతో బయటకు తీశారు. వెల్డింగ్ పరికరాలతో కారు డోర్లను కోసి మృతదేహాలను బయటకు తీసి కేజీహెచ్‌లో పోస్టుమార్టం కోసం తరలించారు. గాయాలపాలైన చైతన్య, కిరణ్ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
చర్చి కూలి 160 మంది మృతి
నైజీరియాలో దుర్ఘటన లాగోస్: నైజీరియాలో శనివారం ఓ చర్చిలో ఘోర ప్రమాదం జరిగింది. చర్చి పైకప్పు కుప్పకూలడంతో 160 మంది దుర్మరణం చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అక్వా ఇబోమ్ రాష్ట్ర రాజధాని యువోలోని రీనర్స్ బైబిల్ చర్చ్ ఇంటర్నేషనల్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇంకా నిర్మాణంలోనే ఉన్న ఈ చర్చిలో భారీ లోహ స్తంభాలు విరిగిపడ్డంతో లోహపు పైకప్పు భక్తులపై కూలిపోరుుంది. చర్చి వ్యవస్థాపకుడైన మతబోధకుడు అకాన్ వీక్స్‌ను బిషప్‌గా ప్రకటించే కార్యక్రమం మొదలైన కాసేపటికే ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం నుంచి అకాన్ వీక్స్, రాష్ట్ర గవర్నర్ ఉదోమ్ ఎమ్మానుయెల్ తదితర ప్రముఖులు సురక్షితంగా తప్పించుకున్నారు. శిథిలాలను తొలగిస్తున్నామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న యువో వర్సిటీ టీచింగ్ హాస్పిటల్ వైద్యులు చెప్పారు. కాగా, చర్చి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, నిర్మాణంలో లోపాలున్నాయో లేదో తేల్చడానికి దర్యాప్తు జరుపుతామని అధికారులు వెల్లడించారు. నైజీరియాలో కాంట్రాక్టర్లు నాణ్యత లేని సామగ్రిని వాడడం వల్ల తరచూ భవనాలు కూలిపోతున్నారుు. 2014 లాగోస్‌లోని సినగోగ్ చర్చికి చెందిన బహుళ అంతస్తుల అతిథి గృహం కూలిపోవడంతో 116 మంది చనిపోయారు. కెన్యాలో పెట్రోల్ ట్యాంకర్ పేలి 30 మంది దుర్మరణం నైరోబి: పెట్రోల్ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఇతర వాహనాలను ఢీకొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగారుు. ఈ ఘటనలో సుమారు 30 మంది మరణించగా, 11 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. కెన్యాలోని నైవాష పట్టణంలో శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కెన్యాలో నిత్యం రద్దీగా ఉండే నైరోబి-నాకూరు జాతీయ రహదారిపై వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ కరాయ్ ప్రాంతం వద్దకు రాగానే డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోవడంతో రోడ్డుపై ఉన్న ఇతర వాహనాలను ఢీకొంది. దీంతో ట్యాంకర్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి చుట్టుపక్కల ఉన్న ఇతర వాహనాలకు వ్యాపించడంతో ఆ వాహనాల్లోనివారు మంటల్లో కాలిపోయారని స్థానికులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు. -
దారుణం
మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో ఘోర ప్రమాదం కోడలు సారిక సహా ముగ్గురు మనువళ్ల సజీవ దహనం గ్యాస్ లీక్ కావడంతో ఘటన హత్యా.. ఆత్మహత్యా... అని అనుమానాలు హత్య చేశారని సారిక తల్లి ఆరోపణ పోలీసుల అదుపులో ‘సిరిసిల్ల’ కుటుంబం ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ర్టంలో సంచలనం మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. రాజయ్య కోడలు సారిక, మనవళ్లు అభినవ్(7), అయోన్(5), శ్రీయోన్(5) మంగళవారం రాత్రి పడుకున్న వారు పడుకున్నట్లుగానే మంటల్లో కాలిపోయారు. గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం జరిగిందని రాజయ్య కుటుంబీకులు చెబుతుండగా.. కొంతకాలంగా జరుగుతున్న గొడవల్లో భాగంగానే తమ కుమార్తెను అత్తింటివారే హత్య చేశారని సారిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా.. అభం శుభం తెలియని చిన్నారులు మంటల్లో మాడిపోవడం ప్రతిఒక్కరినీ కలిచివేసింది. వరంగల్ క్రైం : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు కుమారుల సజీవ దహనంపై శాస్త్రీయ పద్ధతిలో విచారణ చేపడుతున్నట్లు వరంగల్ నగర పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. సంఘటనా ప్రదేశం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఫోరెన్సిక్ టీమ్‌ను రప్పిస్తున్నామని పూర్తి స్థారుులో విచారణ చేపట్టిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత నిజాలు వెలుగుచూస్తాయని పేర్కొన్నారు. విచారణకు ప్రత్యేక టీమ్... సజీవదహనం కేసును చేధించేందుకు ప్రత్యేకం గా పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఏసీపీ నేతృత్వంలో నియమించనున్న ఈ బృందంలో ముగ్గురు సీఐ లు విచారణ అధికారులుగా ఉంటారన్నారు. పలుమార్లు ఘటనా ప్రదేశానికి సీపీ ఇదిలా ఉండగా ఘటన జరిగిన రాజయ్య ఇం టికి ఉదయమే చేరుకున్న సీపీ సుధీర్‌బాబు అ క్కడే ఉండి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే, ఘటన జరిగిన గదిని ప్రత్యేకంగా పరి శీలించిన సీపీ ఆ తర్వాత కూడా పలుమార్లు సం ఘటన ప్రదేశానికి వెళ్లడం గమనార్హం. అక్కడి ఆనవాళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పోచమ్మమైదాన్ : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఆయన కోడలు, మనుమలు మృతి చెందిన విషయం బుధవారం తెల్లవారుజామున వెలుగులోకి రావడంతో అధికారులు పరిశీలించారు. ఘటనకు సంబంధించి ఎన్నికల కమిషన్ నుంచి నివేదిక అడిగే అవకాశముండడంతో అధికారులు రెవెన్యూ కాలనీలోని రాజయ్య ఇంటికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. అధికారులు పరిశీలించి వెళ్తున్న క్రమంలో మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన కలెక్టర్ కరుణ.. పోలీసు కమిషనర్ సుధీర్‌బాబుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఐజీ నవీన్ చంద్.. మీడియాతో మాట్లాడుతూ సారిక పడక గదిలో గ్యాస్ సిలిండర్ లభ్యమైందని తెలిపారు. తెల్లవారుజామున 4గంటలకు ఘటన జరిగిందని, ఈ ఘటనతో సంబంధం ఉన్న వాళ్ల పై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సారిక అమ్మ, చిన్నమ్మ ఘటనాస్థలికి వచ్చారని.. పోస్ట్‌మార్టం అనంతరం సారిక, అభినవ్, అయోన్, శ్రీయోన్ మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగిస్తామని తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలిని పరిశీలిస్తున్నారని, కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉందని వెల్లడించారు. ఇక వరంగల్ సీపీ సుధీర్‌బాబు ఉదయం నుంచి మృతదేహాలను తరలించే వరకు అక్కడే ఉన్నారు. ఇంకా డీఐజీ మల్లారెడ్డి, రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్ ఝ, వరంగల్ ఆర్డీఓ వెంకట మాధవరావు, వరంగల్ తహసీల్దార్ గుజ్జుల రవీందర్ ఉన్నారు.