చర్చి కూలి 160 మంది మృతి
నైజీరియాలో దుర్ఘటన
లాగోస్: నైజీరియాలో శనివారం ఓ చర్చిలో ఘోర ప్రమాదం జరిగింది. చర్చి పైకప్పు కుప్పకూలడంతో 160 మంది దుర్మరణం చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అక్వా ఇబోమ్ రాష్ట్ర రాజధాని యువోలోని రీనర్స్ బైబిల్ చర్చ్ ఇంటర్నేషనల్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇంకా నిర్మాణంలోనే ఉన్న ఈ చర్చిలో భారీ లోహ స్తంభాలు విరిగిపడ్డంతో లోహపు పైకప్పు భక్తులపై కూలిపోరుుంది. చర్చి వ్యవస్థాపకుడైన మతబోధకుడు అకాన్ వీక్స్‌ను బిషప్‌గా ప్రకటించే కార్యక్రమం మొదలైన కాసేపటికే ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం నుంచి అకాన్ వీక్స్, రాష్ట్ర గవర్నర్ ఉదోమ్ ఎమ్మానుయెల్ తదితర ప్రముఖులు సురక్షితంగా తప్పించుకున్నారు.
శిథిలాలను తొలగిస్తున్నామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న యువో వర్సిటీ టీచింగ్ హాస్పిటల్ వైద్యులు చెప్పారు. కాగా, చర్చి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, నిర్మాణంలో లోపాలున్నాయో లేదో తేల్చడానికి దర్యాప్తు జరుపుతామని అధికారులు వెల్లడించారు. నైజీరియాలో కాంట్రాక్టర్లు నాణ్యత లేని సామగ్రిని వాడడం వల్ల తరచూ భవనాలు కూలిపోతున్నారుు. 2014 లాగోస్‌లోని సినగోగ్ చర్చికి చెందిన బహుళ అంతస్తుల అతిథి గృహం కూలిపోవడంతో 116 మంది చనిపోయారు.
కెన్యాలో పెట్రోల్ ట్యాంకర్ పేలి 30 మంది దుర్మరణం
నైరోబి: పెట్రోల్ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఇతర వాహనాలను ఢీకొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగారుు. ఈ ఘటనలో సుమారు 30 మంది మరణించగా, 11 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. కెన్యాలోని నైవాష పట్టణంలో శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కెన్యాలో నిత్యం రద్దీగా ఉండే నైరోబి-నాకూరు జాతీయ రహదారిపై వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ కరాయ్ ప్రాంతం వద్దకు రాగానే డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోవడంతో రోడ్డుపై ఉన్న ఇతర వాహనాలను ఢీకొంది. దీంతో ట్యాంకర్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి చుట్టుపక్కల ఉన్న ఇతర వాహనాలకు వ్యాపించడంతో ఆ వాహనాల్లోనివారు మంటల్లో కాలిపోయారని స్థానికులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు.