రెస్టారెంట్ గదిని ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్
ప్రకాశం జిల్లా: పెట్రోలు లోడ్‌తో వేగంగా వెళ్తున్న ట్యాంకర్ టైరు పంక్చరై రోడ్డు పక్కన ఆగి ఉన్న బాతుల లోడ్ లారీని ఢీకొట్టి అదుపుతప్పి రోడ్డు పక్కనున్న రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన శనివారం సాయంత్రం జాతీయ రహదారిపై సింగరాయకొండ మండల పరిధిలోని జీవీఆర్ ఆక్వా కంపెనీ సమీపంలో రాయల్ భోజన్ హోటల్ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలవడాన్ని మినహాయిస్తే.. పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన చూడటానికి చిన్నదైనా ఆయిల్ ట్యాంకర్ కావడంతో బోల్తా పడి ఉంటే తీవ్ర నష్టం జరిగేది.
పోలీసుల కథనం ప్రకారం.. మిర్యాలగూడ నుంచి నాయుడుపేటకు బాతుల లోడ్‌తో వెళ్తున్న ఐచర్ లారీకి రాయల్ భోజన్ హోటల్ సమీపంలో టైరు పంక్చరైంది. డ్రైవర్ పంక్చర్ వేస్తుండగా అదే సమయంలో విజయవాడ నుంచి నెల్లూరు జిల్లా జొన్నవాడ వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ అతి వేగంగా వచ్చి బాతుల లోడ్ లారీని బలంగా ఢీకొట్టి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం నేరుగా రోడ్డు పక్కనున్న రాయల్ భోజన హోటల్ గదిని ఢీకొట్టి ఆగింది. ఆ సమయంలో రెస్టారెంట్ యజమాని మద్దెల వెంకటేశ్వర్లు గదిలో నిద్రిస్తున్నాడు.
అతని పక్కగా ట్యాంకర్ వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ సిద్దయ్యకు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని హైవే అంబులెన్స్‌లో ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అదే 5 గంటల సమయంలో జరిగి ఉంటే రెస్టారెంట్ బయట కుర్చీలు, మంచాలు వేసి జనం కూర్చుని ఉండేవారు. ప్రాణాపాయం కూడా జరిగేది.
ప్రస్తుతం హోటల్ గది మాత్రమే ధ్వంసమై ప్రాణాపాయం జరగలేదని స్థానికులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పక్కనే ఉన్న సర్వీసు రోడ్డు ద్వారా పోలీసులు పునరుద్ధరించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.శ్రీరామ్ తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ రమణయ్య, కానిస్టేబుల్ సుమన్, హైవే పెట్రోలింగ్ కానిస్టేబుల్ శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment