మింగేసిన వేగం
రెండు పదుల వయస్సుకే తెల్లారిన జీవితాలు
మద్యం మత్తుకు అదనంగా అతి వేగం
వేకువజామున విశాలాక్షినగర్‌లో ఘోర ప్రమాదం
ఘటనాస్థలిలో ఇద్దరు యువకుల దుర్మరణం
మరో ఇద్దరి పరిస్థితి విషమం
ఆరిలోవ (విశాఖ తూర్పు) : మద్యం మత్తుకు అతివేగం తోడవడంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా తయారయింది. బీచ్‌రోడ్డును ఆనుకుని ఆరో వార్డు పరిధి విశాలాక్షినగర్‌లో ఆది వారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వారంతా నగరంలో మాధవధార, వేపగుంట ప్రాంతాలకు చెందినవారు. ఇంజినీరింగ్ చదువుతున్న వారంతా కలిసి శనివారం సాయంత్రం విశాలాక్షినగర్‌లో ఉంటున్న మరో స్నేహితుడి ఇంటికి కారులో వెళ్లారు. అక్కడే రాత్రంతా గడిపి వేకువజామున కారులో తిరిగి తమ ఇళ్లకు బయలుదేరారు. అతివేగంగా నడిపిన కారు అదుపుతప్పి విశాలాక్షిగర్‌లో బీవీకే కళాశాల సమీపంలో ఓ చెట్టుకు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకొంది. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం...
స్నేహితుని ఇంటిలో సరదాగా గడిపి...
ప్రమాదంలో మాధవధారకు చెందిన అన్నవర్జుల శశాంక్(21), వేపగుంటకు చెందిన సాయి వంశీకృష్ణ(21) సంఘటన స్థలంలోనే మృతి చెందారు. శశాంక్ చెన్నైలో ఎస్.ఆర్.ఎం కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మరో మృతుడు సాయివంశీతో పాటు తీవ్ర గాయాలపాలైన చైతన్య బెహర(21), కిరణ్ బెహర(21)లు నగరంలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. వీరంతా ఒకప్పుడు విశాఖ వేలీ స్కూల్‌లో చదువుకున్నారు. వారితోపాటు విశాఖ వేలీ స్కూల్‌లో చదువుకుని విశాలాక్షినగర్‌లో ఉంటున్న స్నేహితుడి ఇంటికి శనివారం వచ్చి రాత్రంతా టీవీలో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ మద్యం సేవించారు. తిరిగి ఆదివారం వేకువ జామున 3.30 గంటల సమయంలో కారులో ఇళ్లకు బయలుదేరారు. మితిమీరిన వేగంతో నడిపిన కారు అదుపుతప్పి రోడ్డు పక్క ఓ చెట్టుకు ఢీకొని ప్రమాదానికి గురైంది. డ్రైవింగ్ చేసిన చైతన్య బెహర కాళ్లు రెండూ నుజ్జవడంతో కారులోనే ఇరుక్కుపోయాయి. తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ముందు సీటులో అతని పక్కనే కూర్చొన్న శశాంక్, వెనుక సీటులో కూర్చొన్న వంశీకృష్ణ సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. కిరణ్ బెహర తలకు తీవ్ర గాయాలవడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఆరిలోవ సీఐ సీహెచ్ తిరుపతిరావు, ఎస్‌ఐలు సంతోష్‌కుమార్, కాంతారావు సిబ్బందితో ప్రమాద స్థలికి చేరుకున్నారు. అనంతరం కొంతసేపటికి ఏసీపీ రంగరాజు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు. నుజ్జయిన కారును క్రేన్ సహాయంతో తొలగించారు. అందులో ఇరుక్కుపోయిన మృతులు, గాయాల పాలైనవారిని వెల్డర్లు సహకారంతో బయటకు తీశారు. వెల్డింగ్ పరికరాలతో కారు డోర్‌లను కోసి మృతదేహాలను బయటకు తీసి కేజీహెచ్‌లో పోస్టుమార్టం కోసం తరలించారు. గాయాలపాలైన చైతన్య, కిరణ్ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.