కాటేసిన అప్పులు
కాటేసిన అప్పులు
Published Sat, Nov 12 2016 9:16 PM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM
- దంపతులు ఆత్మహత్య
- అనాథైన చిన్నారి
- కారుమంచిలో దుర్ఘటన
ఆస్పరి: అవసరాల కోసం చేసిన అప్పులు మృత్యుపాశాలయ్యాయి. వాటిని తీర్చలేక దంపతులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రుల మృతితో చిన్నారి అనాథ అయింది. ఈ ఘటన ఆస్పరి మండలం కారుమంచి సమీపంలో చోటు చేసుకుంది. కారుమంచి గ్రామానికి చెందిన మునెమ్మకు (22), తుగ్గలి మండలం రాతన గ్రామానికి చెందిన ఉశేని (26)కి మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరికీ రెండేళ్ల కీర్తన అనే బాలిక ఉంది. కూలీ పనులు చేసుకుంటూ వీరు జీవనం సాగిస్తుండే వారు. కుటుంబ అవసరాల కోసం రూ. 1.50 లక్షల వరకు అప్పు చేశారు. అప్పులు తీర్చే విషయంలో తరుచుగా భార్యాభర్తలు గొడవ పడుతుండేవారు. రెండు రోజలు క్రితం వీరు..దేవనకొండ మండలం తెర్నెకల్లులో ఉండే మునెమ్మ అక్కను చూడటానికి వెళ్లారు. శనివారం ఉదయం తెర్నెకల్లు నుంచి రాతనకు భార్యాభర్త, కూతురు బయలు దేరారు. అయితే మార్గమధ్యంలో కారుమంచి సమీపంలో దిగి పక్కనే ఉన్న వాగులోకి వెళ్లి కుమార్తె ఎదుటే పురుగుల మందు తాగారు. చిన్నారి గుక్కపట్టి ఏడుస్తుడటంతో వాగు పక్క దారి నుంచి పొలాలకు వెళ్లే వారు అక్కడి వెళ్లి చూడగా దంపతులిద్దరూ విగత జీవులుగా కనిపించారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. రెండేళ్ల చిన్నారి ఏడుపు పలువురిని కంటతడి పెట్టించింది. ఎస్‌ఐ వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలను బంధువులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Advertisement