![ఉసురుతీసిన అప్పులు](/styles/webp/s3/article_images/2017/09/4/51470764991_625x300.jpg.webp?itok=8DzzQM3b)
ఉసురుతీసిన అప్పులు
అప్పులబాధతో రైతు బలవన్మరణం
హుజూర్‌నగర్ మండల పరిధిలో ఘటన
హుజూర్‌నగర్:
అప్పులకుంపటి మరో రైతు ఉసురు తీసింది. వర్షాభావ పరిస్థితులకు దిగుబడి రాక, అప్పుల వారి ఒత్తిడి తట్టుకోలేక చావే శరణ్యమనుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హుజూర్‌నగర్ మండల పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన రాగం అంజయ్య (35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న మూడు ఎకరాల భూమిలో వరి సాగు చేశాడు. పెట్టుబడులు, కుటుంబ అవసరాల నిమిత్తం తెలిసిన వారి వద్ద రూ. 6 లక్షల వరకు అప్పు చేశాడు. గత రెండు సీజన్లుగా సాగు నీరు అందకపోవడంతో దిగుబడి ఆశాజనకంగా లేదు. దీంతో అప్పుల వారి ఒత్తిడి పెరిగిపోవడంతో తట్టుకోలేక మంగళవారం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకున్నాడు. కాగా అటువైపుగా వెళ్తున్న రైతులు చెట్టుకు వేలాడుతున్న అంజయ్య మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.