– మృతుల పేరిట పింఛన్లను కాజేస్తున్న తెలుగు తమ్ముళ్లు
– ఆర్‌ఈబీల సహకారంతో ప్రతి నెలా సొమ్ము చేసుకుంటున్న వైనం
ధర్మవరం: సామాజిక పింఛన్ల పంపిణీలో తెలుగు తమ్ముళ్లు తమ హస్తలాఘవం చూపుతున్నారు.. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు అందాల్సిన పింఛన్లను ఆర్‌ఈబీల సహకారంతో తమ జేబులు నింపుకుంటున్నారు. ఇదేమని అడిగితే మీ వేలి ముద్రలు పడలేదు.. అంటూ మూడు నెలల పాటు పింఛన్లు ఇవ్వకుండా.. వృద్ధులను వేధిస్తున్నారు.
మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా మృతి చెందిన వృద్ధుల పేరిట పింఛన్లను కాజేస్తున్నారు. వేలి ముద్రలు పడలేదన్న కారణాలతో ఆర్‌ఈబీల అథెంటికేషన్‌ను వినియోగించుకుంటూ దందాకు పాల్పడుతున్నారు. ఇందుకు జన్మభూమి కమిటీ సభ్యులు, ఆయా వార్డుల ఇన్‌చార్జ్‌లు కీలక భూమిక పోషిస్తున్నారు. ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని 23 వ వార్డులో మృతి చెందిన వారిపేరిట పింఛన్లను అధికార పార్టీ నాయకులు ఆరగిస్తున్నారు.
ఆధారాలివి..గో..
► పట్టణంలోని 23 వ వార్డులో నివాసం ఉంటోంది ..11259271 పింఛన్ ఐడి పేరిట పింఛన్ తీసుకుంటూ 5 నెలల క్రితం మరణించింది. అయితే ఈమెకు సంబంధించిన ఫింఛన్ మొత్తాన్ని ఈ నెల 07వ తేదిన వీఆర్‌ఏ(ఆర్‌ఈబి) అథెంటికేషన్‌పై మూడు నెలలకు సంబంధించిన మొత్తం రూ.3000 డ్రా చేశారు.
► పట్టణంలోని సిద్దయ్యగుట్టలో నివాసం ఉంటున్న మేదర వెంకప్ప నాలుగు నెలల క్రితం మరణించగా ఆయనకు సంబంధించిన మూడు నెలల పింఛన్ మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కాజేశారు.
► –11259304 పింఛన్ ఐడి పేరిట పెద్దక్క అనే వృద్ధురాలు పింఛన్ తీసుకుంటుండేది. అయితే ఆమె మూడు నెలల క్రితం చనిపోయింది. అయినప్పటికీ ఆమె బ్రతికున్నట్లుగానే పింఛన్ తీసుకుంటున్నారు. ఈ విషయం తెలిసి ఆమె కుటుంబ సభ్యులు సదరు టీడీపీ నేతలను నిలదీస్తే.. ఒక నెల పింఛన్ మొత్త ం రూ.1000 ఆమె కుటుంబ సభ్యులకు ఇచ్చి పంపినట్లు తెలిసింది.
► రామిరెడ్డి కాలనీలో ఉన్న సాంబశివారెడ్డి అనే వ్యక్తి పింఛన్ తీసుకున్న తొలి నెలలోనే మృతి చెందాడు. అయితే ఈ వ్యక్తి సంబంధించిన పింఛన్‌ను ఆర్‌ఈబి సహకారంతో 32వ వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు నెలనెలా డ్రా చేస్తున్నట్లు తెలిసింది. అలా రెండు నెలలు తీసుకున్న తరువాత విషయం బయట పడతుందని భావించి మున్సిపాలిటీకి సదరు వ్యక్తి మరణించాడని సరండర్ చేసినట్లు తెలిసింది.
పింఛన్ల మంజూరుకు ఆధార్, వేలిముద్రల దెబ్బ
పింఛను దారులకు ఆధార్, వేలిముద్రల(బయోమెట్రిక్ ) విధానం ఇబ్బందిగా మారింది. నియోజకవర్గ వ్యాప్తంగా పలువురి పించన్ దారుల వేలిముద్రలు బయోమెట్రిక్ విధానంలో సరిపడం లేదు. ముఖ్యంగా వద్ధులకు సంబంధించిన చేతివేళ్లు మొత్తబడటం, వారికి వేలిముద్రలు బయోమెట్రిక్ మిషన్ అందుకోలేకపోవడం జరుగుతోంది. ఇలా వేలిముద్రలు సరిపోనివారికి నేరుగా పించన్ పంపిణీ దారులే నగదు ఇవ్వాలనే నిబంధనను పెడితే బాగుంటుందని పించన్‌దారులు చెబుతున్నారు.
అయితే ఈ విధానాన్ని అందరూ అవలంభించి పించన్‌దారులను మోసం చేసే అవకాశాలు లేకపోలేదు. ఇక ఆధార్ కార్డుల విషయంలో వద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో వారికి ఆధార్‌కార్డులు మంజూరు కాలేదు. అధార్ కార్డులు లేకపోతే పించన్ ఇవ్వమని బెదిరిస్తున్నారని వద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేతివాటం చూపుతున్న ఆర్‌ఈబీలు:
ఇది ఇలా ఉంటే పించన్లపంపిణీలో ఆర్‌ఈబి(పించన్లు పంపిణీ చేసే వ్యక్తులు)లు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు అప్పట్లో పనిచేస్తున్న చాలా మంది ఆర్‌ఈబిలను తొలగించి తమకు అనుకూలంగా ఉన్న వారిని వేయించుకుని తమ హస్త లాఘం చూపుతున్నారు. నీకిదీ.. నాకిది అన్న రీతిలో సొమ్ము చేసుకున్న మొత్తాన్ని పంచుకుంటున్నారు. అధికార దర్పంతో వీరు పించన్ల పంపిణీలో అనేక అవకతవకలకు పాల్పడుతున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పించన్ల పంపిణీ వ్యవస్థపై అధికారుల పర్యవేక్షణ కరువవడంతో పించన్‌దారులకు ఇబ్బందులు తప్పడం లేదు.