- ప్రేమ పేరుతో వంచన
- పెళ్లికి నిరాకరించడంతో మూడుసార్లు ఆత్మహత్యాయత్నం
- చీటింగ్ కేసు పెట్టినా మార్పు రాకపోవడంతో విరక్తి
- మరోసారి ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలు
- పరిస్థితి విషమం, అనంతపురం ఆస్పత్రికి తరలింపు
గుత్తి : క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీస్ శాఖలో అతనో కానిస్టేబుల్. న్యాయం కోసం తన వద్దకు వచ్చే వారికి కొండంత అండగా నిలవాల్సిన అతను ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి పేరుతో దగ్గరయ్యాడు. కొన్నాళ్లకు పెళ్లి ప్రస్తావన తెస్తే.. కాకమ్మ కథలు చెప్పాడు. అయినా ఆ అమాయకురాలు నమ్మింది. కాలం గడుస్తున్నా అతని నుంచి పెళ్లి ప్రస్తావన రాకపోవడంతో తనే అడిగింది. ఒత్తిడి తెచ్చింది. నిలదీసింది. ఎంతైనా పోలీస్ కదా.. ఇక నాన్చకూడదనుకున్నాడు. అడ్డం తిరిగాడు. అంతే ఆమె తట్టుకోలేకపోయింది. అతను లేని జీవితం వద్దనుకుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రతిసారి ఏదో ఒక విధంగా బతికి బట్టకట్టింది. అతనిపై చీటింగ్ కేసు పెట్టింది. అయినా ఆ నయవంచకుడిలో మార్పు రాలేదు. జీవితంపై విరక్తితో నాలుగోసారి ఆమె మళ్లీ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన గుత్తి ఎస్‌బీఐ కాలనీలో మంగళవారం జరిగింది.
కదిరికి చెందిన కానిస్టేబుల్ వీరనారాయణను జయలక్ష్మి అనే యువతి ప్రేమించింది. ఎంతలాగంటే.. అతను లేనిదే తన జీవితం లేనంతగా. చివరకు అతను తిరస్కరించడంతో తట్టుకోలేకపోయింది. నాలుగోసారి విష ద్రావకం తాగి బలవన్మరణానికి యత్నించింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే గుత్తి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.