‘దీపం’ పంపిణీ నెల రోజుల్లో పూర్తి చేయాలి
Published Thu, Aug 4 2016 10:40 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
కాకినాడ సిటీ :
జిల్లాకు మంజూరైన దీపం గ్యాస్ కనెక్షన్లను నెల రోజుల్లోగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, ఎల్‌పీజీ డీలర్లను జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో దీపం కనెక్షన్ల పంపిణీ పురోగతిపై సమీక్షించారు. జిల్లాకు 2,26,000 దీపం కనెక్షన్లు మంజూరైనట్టు తెలిపారు. వీటిలో 1,31,000 కనెక్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారన్నారు. మిగిలిన కనెక్షన్లను త్వరితగతిన పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు. ఎంపీడీఓల సమన్వయంతో లబ్ధిదారుల జాబితాలకు జన్మభూమి గ్రామ కమిటీల ఆమోదంతో త్వరితగతిన పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. అన్ని కనెక్షన్లను డోర్ డెలివరీ చేయాలన్నారు. సమావేశంలో డీఎస్‌ఓ ఉమామహేశ్వరరావు కూడా పాల్గొన్నారు.
సర్వే సత్వరమే పూర్తి చేయాలి
ప్రజాసాధికార సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను జేసీ ఆదేశించారు. సర్వే ప్రగతిపై ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టరేట్ నుంచి మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం సమీక్షించారు. ఎన్యూమరేటర్లను ఉదయమే క్షేత్రస్థాయికి పంపించాలన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించాలని, ఎన్యూమరేటర్లుగా ఉన్న మహిళలను సాయంత్రం విధుల నుంచి రిలీవ్ చేయాలన్నారు. పింఛన్ల పంపిణీకి తీసుకున్న ట్యాబ్‌లను ఐదో తేదీ సాయంత్రానికి తహసీల్దార్లకు అప్పగించాలని ఎంపీడీఓలకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పద్మ, పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement