జింక ప్రాణాలు తీసిన అధికారుల నిర్లక్ష్యం
జూలకల్(గూడూరు రూరల్): కుక్కలదాడిలో గాయపడిన జింక సకాలంలో వైద్యమందక ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు ఫారెస్ట్, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే కారణమని జూలకల్‌గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జూలకల్ గ్రామంలోని రైతు వెంకటేశ్వరరెడ్డి పొలంలో శనివారం జింకపై కుక్కలు దాడి చేశాయి. గమనించిన రైతు దివాకర్‌రెడ్డి వాటి నుంచి జింకను విడిపించాడు. అనంతరం గాయపడిన జింకను స్థానిక తలారి గిడ్డయ్యకు అప్పగించాడు. ఆయన గూడూరులోని పశువైద్యశాలకు తీసుకెళ్లగా సెలవు దినం కావడంతో అక్కడ ఎవరూ లేరు. ఆసుపత్రి కాంపౌండర్ శ్రీనివాసులును పిలిపించి గాయమైన చోట కుట్లు వేయించాడు. చికిత్సకు ముందే అంటే ఉదయం ఉదయం 7 గంటలకు జింక గాయపడిన విషయాన్ని తలారి రెవెన్యూ అధికారులతో కర్నూలు అడవిశాఖ అధికారులకు సమాచారమిచ్చాడు. సాయంత్రం 6 గంటలైనా జింకను తీసుకెళ్లేందుకు ఏ ఒక్క అధికారి రాకపోవడం, మెరుగైన వైద్యం చేయించకపోవడంతో అది కోలుకోలేక మృతి చెందింది. కుక్కల దాడి నుంచి కాపాడి తీసుకొచ్చిన జింకను అధికారుల నిర్లక్ష్యమే ప్రాణం తీసిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.