హోదా కోరుతూ వామపక్షాల దీక్షలు
హోదా కోరుతూ వామపక్షాల దీక్షలు
Published Fri, Aug 5 2016 9:46 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
ఏలూరు(సెంట్రల్) : రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్ట హామీలు అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్ డిమాండ్ చేశారు. స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో శుక్రవారం వామపక్షాల ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష శిబిరాన్ని బలరామ్, సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీజేపీ చేసిన వాగ్ధానాలకు విరుద్ధంగా నేడు మాట్లాడుతోందని విమర్శించారు. నరేంద్ర మోదీ, వెంకయ్యనాయుడులు ప్రత్యేక హోదా తెచ్చేది– ఇచ్చేది మీమే అని చెప్పి ఇప్పుడు మొండిచేయి చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నేతలు గుడిపాటి నరసింహారావు, పి.కన్నబాబు, పి.కిషోర్, బి.సోమయ్య, రెడ్డి శ్రీనివాస్ డాంగే, కె.కృష్ణమాచార్యులు, బి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
విధులు బహిష్కరించిన న్యాయవాదులు
ప్రత్యేక హోదా బిల్లును లోక్‌సభలో ఆమోదించాలని కోరుతూ జిల్లా కోర్టులోని న్యాయవాదులు శుక్రవారం విధులు బహిష్కరించారు. బార్ అసోసియేషన్ భవనం వద్ద నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్బినేని విజయ్‌కుమార్ మాట్లాడుతూ బార్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రత్యేక హోదా కోసం విధులు బహిష్కరించడం జరిగిందన్నారు. సంఘ ఉపాధ్యక్షుడు బీజే రెడ్డి, జనరల్ సెక్రటరీ సీహెచ్ రాజేంద్రప్రసాద్, న్యాయవాదులు కారే బాబురావు, రాజనాల రామ్మోహన్, బీవీ కృష్ణారెడ్డి, ఆచంట వెంకటేశ్వరరావు, ఏలూరు వెంకటేశ్వరరావు, జిజ్జువరపు ప్రతాప్‌కుమార్. రంగరావు పాల్గొన్నారు.
Advertisement