బల్దియాలో డెంగీ పాగా!
-
అప్రమత్తం చేసిన వైద్యాధికారులు
-
స్పందించని కార్పొరేషన్ అధికారులు
-
నగరంలో విచ్చవిడిగా డ్రెయినేజీ లీకేజీలు
కోల్‌సిటీ : రామగుండం నగరపాలక సంస్థలో పారిశుధ్యం అస్తవ్యస్తంతో ప్రజలు విషజ్వరాలబారిన పడుతున్నారు. విచ్చలవిడిగా పెరిగుతున్న దోమలతో ఇబ్బంది పడుతున్నారు. రామగుండం విద్యుత్‌నగర్‌కు చెందిన ఫక్రోద్దీన్ డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన కరీంనగర్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య పరీక్షల్లో డెంగీ పాజిటీవ్ అని నిర్ధారణ అయినట్లు తెలిసింది. విషయం తెలిసిన జిల్లా వైద్యాధికారులు శుక్రవారం రాత్రి బల్దియా అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో స్పందించిన కమిషనర్ డి.జాన్‌శ్యాంసన్ శనివారం రామగుండం విద్యుత్‌నగర్‌తోపాటు పలు సమస్యాత్మకమైన ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఇంటింటికీ తిరిగి పారిశుధ్యం పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం మెరుగుపర్చడంతోపాటు అందరూ అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ హెచ్చరించారు.
కంపుకొడుతున్న కాలనీలు..
లక్ష్మీనగర్‌లోని వ్యాపార కూడలి, డాక్టర్స్ స్ట్రీట్, విద్యాలయాల ప్రాతాలు, మార్కెట్ ప్రాంతాలలో చెత్త కుప్పలు, మరోవైపు రమేశ్‌నగర్, మార్కండేయకాలనీ, విఠల్‌నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాలలో భారీగా డ్రెయినేజీ లీకేజీలతో కంపుకొడుతున్నాయి. అంటురోగాలకు నిలయాలుగా మారుతున్నాయి. పందులు చెత్త కుప్పలపై స్వైరవివాహరం చేస్తున్నాయి.
కానరాని బ్లీచింగ్ పౌండర్...
పేరుకే మున్సిపల్ కార్పొరేషన్. కానీ పారిశుధ్యం విషయంలో గ్రామపంచాయతీలే నయమనిపిస్తుంది. తొలగించిన చెత్త ప్రాంతంలో దుర్వాసన వ్యాపించకుండా, ఈగలు, దోమలు వృద్ధిచెందకుండా బ్లీచింగ్ పౌండర్ చల్లాల్సి ఉంది. కానీ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా కానరావడం లేదు. ఇదేంటని అడిగితే... స్టాక్ తక్కువగా ఉందంటూ పొంతలేని సమాధానాలు ఇస్తున్నారు. వర్షాకాలం అని తెలిసీ కూడా బ్లీచింగ్ పౌండర్ ముందస్తుగా స్టాక్ ఏర్పాటు చేసుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం.
పొంచి ఉన్న వ్యాధులు...
పారిశుధ్య నిర్వహణ నిర్లక్ష్యానికి గురవుతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో చాలా మంది జ్వరాలతో మంచం పట్టారు. పెరుగుతున్న దోమలు, ఈగలు, పందులతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. మలేరియా, డయేరియా, డెంగీ తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు కానరావడం లేదు.