dengy
-
జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. పెరుగుతున్న డెంగీ కేసులు..
ఆదిలాబాద్‌టౌన్: వాతావరణ మార్పులతో జిల్లాలో ఒక్కసారిగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. కురుస్తున్న వర్షాల కారణంగా ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల్లో జనం సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. డయేరియా, వైరల్ జ్వరాలు సోకుతున్నా యి. పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో దోమలువృద్ధి చెందుతున్నాయి. ఈ ప్రభా వం ప్రజారోగ్యంపై పడింది. దీంతో ప్రభుత్వ, ప్రైవే ట్ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసి పోతున్నా యి. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సోమవారం రిమ్స్ ఆస్పత్రి ఓపీ విభాగం రోగులతో కిటకిటలాడింది. పేరు నమోదుకు జనం బారులు తీరా రు. దాదాపు 1500 మంది వరకు వైద్యం కోసం తరలివచ్చారు. అయితే ఇందులో దాదాపు వెయ్యి మంది వరకు దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులతో వచ్చినవారే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పెరుగుతున్న డెంగీ కేసులు.. పారిశుధ్య నిర్వహణ లోపం కారణంగా జ్వరాలు ప్ర బలుతున్నాయి. ఈనెలలో కురిసిన వర్షాల కారణంగా ఒక్కసారిగా డెంగీ కేసులు పెరిగాయి. జనవరి నుంచి ఇప్పటివరకు 23 నమోదవగా, ఇందులో ఈనెలలోనే 5 నమోదైనట్లు వైద్యులు తెలిపారు. జిల్లాకేంద్రంలోని కేఆర్కే కాలనీ, చిల్కూరి లక్ష్మీనగర్‌తో పాటు ఇచ్చోడ, గుడిహత్నూర్, ఇంద్రవెల్లిలో డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మలేరియా కేసులు ఈఏడాది 2 నమోదు కాగా, తాంసిలో 1, నర్సాపూర్(టి)లో మరో కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. సాధారణ జ్వరాలు ఈనెలలో వెయ్యికి పైగా నమోదయ్యాయి. రోగులతో కిటకిట.. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌తో పాటు ఉట్నూర్, బోథ్ ఏరియా ఆస్పత్రులు, ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,అర్బన్హెల్త్సెంటర్లు, జిల్లాకేంద్రంలోని ప్రైవే ట్ ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల్లో జ్వరాల కేసులు అధికంగా ఉ న్నాయి. చాలా మంది ఆస్పత్రులకు వెళ్లలేక మంచం బారిన పడుతున్నారు. కాగా మార్చిలో సాధారణ జ్వరాలు 1617,ఏప్రిల్‌లో 1558, మేలో 1628, జూన్ లో 1571, జూలైలో ఇప్పటివరకు వెయ్యికి పైగా కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. బ్రీడింగ్ చెక్కర్ల నియామకం.. సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. జిల్లాలో 25 మంది బ్రీడింగ్ చెక్కర్లను నియమించింది. డిసెంబర్ వరకు వీరిని కొనసాగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒ క్కో బ్రీడింగ్ చెక్కర్ రోజుకు వంద ఇళ్ల చొప్పున సర్వే చేస్తారు. వ్యాధులపై అవగాహన కల్పిస్తారు. డెంగీ జ్వరాలు ప్రబలిన చోట స్ప్రే చేయిస్తారు. మంగళ, శుక్రవారాల్లో డ్రైడే పాటించే విధంగా చర్యలు చేపడతారు. ప్రత్యేక దృష్టి.. వ్యాధులు ప్రబలుతుండడంతో వైద్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా మందులను అందుబాటులో ఉంచారు. కలెక్టర్ సమక్షంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కళాజాత బృందాలతో గోండీ భాషలో అవగాహన కల్పిస్తున్నారు. ఇంద్రవెల్లి, దంతన్‌పల్లి, గాదిగూడ, నార్నూర్, ఉట్నూర్ మండల వాసుల కోసం ప్రత్యేకంగా ఐదు అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. 16 ట్రైబల్ పీహెచ్‌సీల్లో ప్రతిరోజు ర్యాపిడ్ సర్వే చేపడుతున్నారు. మైదాన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పల్లె దవాఖానాల్లో మందులు, 14 రకాల టెస్టులు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది నమోదైన డెంగీ కేసులు -23 (ఈ నెలలో 05), సాధారణ జ్వరాలు -6,500, మలేరియా కేసులు -02 హైరిస్క్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంటున్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తం వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలి. డ్రమ్ములు, పాత టైర్లు వంటి వాటిలో నీరు నిల్వ ఉంటే అందులో దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా ప్రబలుతాయి. వారంలో రెండు రోజులు డ్రైడే పాటించాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ర్యాపిడ్ సర్వే చేయిస్తున్నాం. బ్రీడ్చెక్కర్లను నియమించాం. ఆస్పత్రుల్లో సరిపడా మందులను అందుబాటులో ఉంచాం. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్‌వో -
డెంగీతో మహిళ మృతి
కంచిలి : మండలంలోని ముండ్ల గ్రామానికి చెందిన కుమారి ప్రధానో(47) శనివారం విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మొదట ఆమెకు రక్త పరీక్షలు చేసిన తర్వాత డెంగీ ఫీవర్‌గా నిర్ధారించిన తర్వాత బరంపురంలోని ఎంకేసీజీ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్సకు విశాఖపట్నం తరలించగా ప్లేట్లెట్ల కౌంట్(రక్తఫలకికలు)సంఖ్య 11,000కు పడిపోవడంతో ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. ఆమె మరణంతో కుటుం సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. డెంగీ మరణంతో ముండ్ల గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. -
‘పెంట’ను సందర్శించిన అధికారులు
–డెంగీ కేసుల నమోదుపై ఆరా –గ్రామంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ పెంట (జి.సిగడాం): మండలంలోని పెంట గ్రామానికి జిల్లా, మండల స్థాయి అధికారులు పరుగు తీశారు. గ్రామంలో నాలుగు డెంగీ కేసులు నమోదు కావడంతో ఈ నెల 21న సాక్షిలో ‘పెంటలో కలకలం’ శీర్షికన ప్రచురితమైన వార్తకు వైద్యశాఖ అధికారులు స్పందించారు. జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారి సనపల తిరుపతిరావు గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. డెంగీ కేసుల వివరాలను సేకరించారు. జ్వరాలతో బాధపడుతున్న రోగుల ఇంటికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించి మెరుగైన వైద్యసేవలందిచాలని గ్రామస్తులు కోరారు. జ్వరాలను అదుపుచేసేందుకు ముందుగా గ్రామంలో పారిశుద్ధ్యపనులు చేపట్టారు. తాగునీటి బావులను క్లోరినేషన్ చేశారు. సర్పంచ్ మక్క సాయిబాబా నాయుడు, మండల పంచాయతీ అధికారి కూన భాస్కరమూర్తి, గ్రామకార్యదర్శి గణేష్‌లు పనులను పర్యవేక్షించారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో జి.సిగడాం వైద్యాధికారిణి గౌతమి ప్రియాంక, ఎంపీహెచ్‌ఎం నారాయణమ్మ, సూపర్వైజర్లు త్రినాథ్, లక్ష్మణరావు, సావిత్రమ్మ, నాగమణి, ఆశ కార్యకర్తలు రోగులకు వైద్యసేవలు అందజేశారు. -
గ్రామంలో నాలుగు డెంగీ కేసులు
జి.సిగడాం : పెంట గ్రామంలో డెంగీ కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన∙సింహద్రి సూర్యనారాయణ, మక్క రాములమ్మల రక్త నమూనాలు శ్రీకాకుళం రిమ్స్‌లో పరీక్షించి డెంగీ ఉన్నట్టు నిర్ధారించారు. అలాగే గ్రామానికి చెందిన మక్క రాముడమ్మ, శ్రీనులు కూడా డెంగీ బారిన పడినట్టు ప్రైవేటు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎంపీడీవో కొత్తకోట హేమసుందరరావు, మండల పంచాయతీ అధికారి కూన భాస్కరమూర్తి, స్థానిక పీహెచ్సీ వైద్యాధికారిణి గౌతమి ప్రియాంక తక్షణమే స్పందించి గ్రామానికి వెళ్లి వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామాల్లో సీజనల్ జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా జ్వరాలపై ఆరా తీశారు. గ్రామంలో ఒకేసారి నాలుగు డెంగీ కేసులు నమోదు చేయడంతో ప్రతి ఇంటికి వెళ్లి రక్త నమూనాలు సేకరించారు. రక్త నమూనాలను ఎల్టీ త్రినాధరావు, సూపర్వైజర్ త్రినాధరావు, ఏఎన్ఎంలు నాగమణి, ఈశ్వరమ్మ, ఈశ్వరరావుతో పాటు మరో ఐదుగురు సేకరించారు. వీటిని జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించనున్నట్టు చెప్పారు. పారిశుధ్య లోపం వల్లే... పెంట గ్రామంలో డెంగీ జ్వరాలు ప్రబలడానికి పారిశుధ్య లోపమే కారణమని వైద్యులు వెల్లడించారు. కాలువలో పూర్తిగా మురికిని తొలగించకపొవడంతో పాటు క్లోరినేషన్ చేయక పొవడంమే వ్యాధులకు కారణమని తెలిపారు. ఎన్ని వైద్య శిబిరాలు నిర్వహించిన పారిశుధ్యం లోపించడంతో జ్వరాలను అదుపు చేయలేమని వైద్య సిబ్బంది తెలిపారు. ఇప్పటికే డెంగీ జ్వరాలతో బాధ పడుతున్న రోగులకు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్‌కు తరలిస్తామన్నారు. చర్యలు తీసుకుంటాం గ్రామంలో పారిశుధ్యం మెరుగుకు ప్రత్యేక చర్యలు చేపడతామని సర్పంచ్ మక్క సాయిబాబానాయుడు, మండల పంచాయతీ అధికారి కూన భాస్కరమూరి తెలిపారు. తాగునీటి బావులను క్లోరినేషన్ చేస్తామని చెప్పారు. గ్రామంలో జ్వరాలు ప్రబలకుండా ఉండేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఎంపీడీవో కె హేమసుందరరావు సూచించారు. -
బల్దియాలో డెంగీ పాగా!
అప్రమత్తం చేసిన వైద్యాధికారులు స్పందించని కార్పొరేషన్ అధికారులు నగరంలో విచ్చవిడిగా డ్రెయినేజీ లీకేజీలు కోల్‌సిటీ : రామగుండం నగరపాలక సంస్థలో పారిశుధ్యం అస్తవ్యస్తంతో ప్రజలు విషజ్వరాలబారిన పడుతున్నారు. విచ్చలవిడిగా పెరిగుతున్న దోమలతో ఇబ్బంది పడుతున్నారు. రామగుండం విద్యుత్‌నగర్‌కు చెందిన ఫక్రోద్దీన్ డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన కరీంనగర్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య పరీక్షల్లో డెంగీ పాజిటీవ్ అని నిర్ధారణ అయినట్లు తెలిసింది. విషయం తెలిసిన జిల్లా వైద్యాధికారులు శుక్రవారం రాత్రి బల్దియా అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో స్పందించిన కమిషనర్ డి.జాన్‌శ్యాంసన్ శనివారం రామగుండం విద్యుత్నగర్తోపాటు పలు సమస్యాత్మకమైన ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఇంటింటికీ తిరిగి పారిశుధ్యం పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం మెరుగుపర్చడంతోపాటు అందరూ అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ హెచ్చరించారు. కంపుకొడుతున్న కాలనీలు.. లక్ష్మీనగర్‌లోని వ్యాపార కూడలి, డాక్టర్స్ స్ట్రీట్, విద్యాలయాల ప్రాతాలు, మార్కెట్ ప్రాంతాలలో చెత్త కుప్పలు, మరోవైపు రమేశ్‌నగర్, మార్కండేయకాలనీ, విఠల్‌నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాలలో భారీగా డ్రెయినేజీ లీకేజీలతో కంపుకొడుతున్నాయి. అంటురోగాలకు నిలయాలుగా మారుతున్నాయి. పందులు చెత్త కుప్పలపై స్వైరవివాహరం చేస్తున్నాయి. కానరాని బ్లీచింగ్ పౌండర్... పేరుకే మున్సిపల్ కార్పొరేషన్. కానీ పారిశుధ్యం విషయంలో గ్రామపంచాయతీలే నయమనిపిస్తుంది. తొలగించిన చెత్త ప్రాంతంలో దుర్వాసన వ్యాపించకుండా, ఈగలు, దోమలు వృద్ధిచెందకుండా బ్లీచింగ్ పౌండర్ చల్లాల్సి ఉంది. కానీ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా కానరావడం లేదు. ఇదేంటని అడిగితే... స్టాక్ తక్కువగా ఉందంటూ పొంతలేని సమాధానాలు ఇస్తున్నారు. వర్షాకాలం అని తెలిసీ కూడా బ్లీచింగ్ పౌండర్ ముందస్తుగా స్టాక్ ఏర్పాటు చేసుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం. పొంచి ఉన్న వ్యాధులు... పారిశుధ్య నిర్వహణ నిర్లక్ష్యానికి గురవుతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో చాలా మంది జ్వరాలతో మంచం పట్టారు. పెరుగుతున్న దోమలు, ఈగలు, పందులతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. మలేరియా, డయేరియా, డెంగీ తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు కానరావడం లేదు. -
డెంగీతో విద్యార్థిని మృతి
సిరిసిల్ల : సిరిసిల్లలో పాలిటెక్నిక్ విద్యార్థిని శుక్రవారం రాత్రి డెంగీతో మృతిచెందింది. పట్టణంలోని శివనగర్‌కు చెందిన కాటబత్తిని వైష్ణవి(18) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. స్థానికంగా ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నా తగ్గలేదు. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే వైష్ణవి మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. డెంగీంతోనే వైష్ణవి మరణించి ఉంటుందని భావిస్తున్నారు. యువతి మృతికి సంతాపకంగా స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు సంతాపం ప్రకటించి బంద్ చేశారు. వైష్ణవి తల్లి అరుణ బీడీ కార్మికురాలు, తండ్రి గణేశ్ మరమగ్గాల కార్మికుడు. -
డెంగీ కలకలం
టెక్కలి : డివిజన్ కేంద్రమైన టెక్కలిలోని కోదండరామవీధిలో విషజ్వరాలు తగ్గుముఖం పట్టడం లేదు. ఈ వీధిలో కొన్ని రోజులుగా విష జ్వరాలు విజృంభించి డెంగీగా తీవ్ర రూపం దాల్చుతున్నప్పటికీ వైద్య శాఖాధికారులు కనీసం పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం మరో డెంగీ కేసు కలకలం రేపింది. కోదండరామవీధికి సమీపంలోని బీసీ కాలనీలో నివాసముంటున్న బోకర అరుంధతి అనే మహిళ గత నెల 31న డెంగీ లక్షణాలతో మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె చిన్న కుమారుడు బోకర వెంకటరమణ కూడా అదే వ్యాధి లక్షణాలతో పలాసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఈ వీధిలో మళ్లీ డెంగీ కలకలం రేపుతోంది. ఇదిలా ఉండగా కోదండరామవీధిలో విష జ్వరాలు విజృంభిస్తున్నప్పటికీ వైద్యాధికారులు కనీసం పట్టించుకోవడం లేదని దళిత మహాసభ జిల్లా అధ్యక్షుడు బోకర నారాయణరావు విమర్శించారు. ఇటీవల కాలంలో రక్తపూతలు సేకరించి ఆయా వివరాలు అందజేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఆయన పేర్కొన్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోతే ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. -
డెంగీ లక్షణాలతో వివాహిత మృతి
♦ కోదండరామవీధిలో అదుపులోకి రాని విషజ్వరాలు ♦ స్పందించని యంత్రాంగం టెక్కలి: డివిజన్ కేంద్రమైన టెక్కలిలో కోదండరామవీధికి ఆనుకుని ఉన్న బీసీ కాలనీ సమీపంలో డెంగీ లక్షణాలతో బోకర అరుంధతి(44) అనే వివాహిత ఆదివారం మృతి చెందారు. మృతురాలి భర్త పాల్గుణరావు తెలిపిన వివరాల ప్రకారం... అరుంధతి గత నెల 27న తీవ్ర జ్వరానికి గురి కావడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యుడ్ని ఆశ్రయించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన అనంతరం అరుంధతికి టైఫాయిడ్‌తో పాటు డెంగీ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రోజు రోజుకు అరుంధతి ఆరోగ్య పరిస్థితి విషమించి రక్త కణాల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. ఒక వైపు వైద్య సేవలు అందజేస్తున్నా ఫలితం లేకపోయింది. ఆదివారం అరుంధతి పరిస్థితి విషమించి మృతి చెందారు. దీంతో బీసీకాలనీ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. మొన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న అరుంధతి హఠాత్తుగా మరణించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు కోదండరామవీధిలో విష జ్వరాలు ఇప్పటికీ తగ్గుముఖం పట్టడం లేదు. వీధిలో స్థానికులు జ్వరాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్ కేంద్రంలోని దళిత వాడలో విష జ్వరాలు విజృంభించి మృత్యువాత పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కోదండరామవీధిలో విష జ్వరాలు తారస్థాయికి చేరే ప్రమాదం తప్పదని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.