డెంగీ జ్వరంతో బాధ పడుతున్న రాములమ్మ
గ్రామంలో నాలుగు డెంగీ కేసులు
Published Sat, Aug 20 2016 11:05 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
జి.సిగడాం : పెంట గ్రామంలో డెంగీ కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన∙సింహద్రి సూర్యనారాయణ, మక్క రాములమ్మల రక్త నమూనాలు శ్రీకాకుళం రిమ్స్‌లో పరీక్షించి డెంగీ ఉన్నట్టు నిర్ధారించారు. అలాగే గ్రామానికి చెందిన మక్క రాముడమ్మ, శ్రీనులు కూడా డెంగీ బారిన పడినట్టు ప్రైవేటు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎంపీడీవో కొత్తకోట హేమసుందరరావు, మండల పంచాయతీ అధికారి కూన భాస్కరమూర్తి, స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారిణి గౌతమి ప్రియాంక తక్షణమే స్పందించి గ్రామానికి వెళ్లి వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామాల్లో సీజనల్ జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా జ్వరాలపై ఆరా తీశారు. గ్రామంలో ఒకేసారి నాలుగు డెంగీ కేసులు నమోదు చేయడంతో ప్రతి ఇంటికి వెళ్లి రక్త నమూనాలు సేకరించారు. రక్త నమూనాలను ఎల్‌టీ త్రినాధరావు, సూపర్‌వైజర్ త్రినాధరావు, ఏఎన్‌ఎంలు నాగమణి, ఈశ్వరమ్మ, ఈశ్వరరావుతో పాటు మరో ఐదుగురు సేకరించారు. వీటిని జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించనున్నట్టు చెప్పారు.
పారిశుధ్య లోపం వల్లే...
పెంట గ్రామంలో డెంగీ జ్వరాలు ప్రబలడానికి పారిశుధ్య లోపమే కారణమని వైద్యులు వెల్లడించారు. కాలువలో పూర్తిగా మురికిని తొలగించకపొవడంతో పాటు క్లోరినేషన్ చేయక పొవడంమే వ్యాధులకు కారణమని తెలిపారు. ఎన్ని వైద్య శిబిరాలు నిర్వహించిన పారిశుధ్యం లోపించడంతో జ్వరాలను అదుపు చేయలేమని వైద్య సిబ్బంది తెలిపారు. ఇప్పటికే డెంగీ జ్వరాలతో బాధ పడుతున్న రోగులకు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్‌కు తరలిస్తామన్నారు.
చర్యలు తీసుకుంటాం
గ్రామంలో పారిశుధ్యం మెరుగుకు ప్రత్యేక చర్యలు చేపడతామని సర్పంచ్ మక్క సాయిబాబానాయుడు, మండల పంచాయతీ అధికారి కూన భాస్కరమూరి తెలిపారు. తాగునీటి బావులను క్లోరినేషన్ చేస్తామని చెప్పారు. గ్రామంలో జ్వరాలు ప్రబలకుండా ఉండేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఎంపీడీవో కె హేమసుందరరావు సూచించారు.
Advertisement