రోగుల వివరాలను సేకరిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి తిరుపతిరావు
‘పెంట’ను సందర్శించిన అధికారులు
Published Sun, Aug 21 2016 10:41 PM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM
–డెంగీ కేసుల నమోదుపై ఆరా
–గ్రామంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ
పెంట (జి.సిగడాం): మండలంలోని పెంట గ్రామానికి జిల్లా, మండల స్థాయి అధికారులు పరుగు తీశారు. గ్రామంలో నాలుగు డెంగీ కేసులు నమోదు కావడంతో ఈ నెల 21న సాక్షిలో ‘పెంటలో కలకలం’ శీర్షికన ప్రచురితమైన వార్తకు వైద్యశాఖ అధికారులు స్పందించారు. జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారి సనపల తిరుపతిరావు గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. డెంగీ కేసుల వివరాలను సేకరించారు. జ్వరాలతో బాధపడుతున్న రోగుల ఇంటికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించి మెరుగైన వైద్యసేవలందిచాలని గ్రామస్తులు కోరారు. జ్వరాలను అదుపుచేసేందుకు ముందుగా గ్రామంలో పారిశుద్ధ్యపనులు చేపట్టారు. తాగునీటి బావులను క్లోరినేషన్ చేశారు. సర్పంచ్ మక్క సాయిబాబా నాయుడు, మండల పంచాయతీ అధికారి కూన భాస్కరమూర్తి, గ్రామకార్యదర్శి గణేష్‌లు పనులను పర్యవేక్షించారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో జి.సిగడాం వైద్యాధికారిణి గౌతమి ప్రియాంక, ఎంపీహెచ్‌ఎం నారాయణమ్మ, సూపర్‌వైజర్లు త్రినాథ్, లక్ష్మణరావు, సావిత్రమ్మ, నాగమణి, ఆశ కార్యకర్తలు రోగులకు వైద్యసేవలు అందజేశారు.
Advertisement