డెంగీ కలకలం
Published Sun, Aug 14 2016 11:56 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM
టెక్కలి : డివిజన్ కేంద్రమైన టెక్కలిలోని కోదండరామవీధిలో విషజ్వరాలు తగ్గుముఖం పట్టడం లేదు. ఈ వీధిలో కొన్ని రోజులుగా విష జ్వరాలు విజృంభించి డెంగీగా తీవ్ర రూపం దాల్చుతున్నప్పటికీ వైద్య శాఖాధికారులు కనీసం పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం మరో డెంగీ కేసు కలకలం రేపింది. కోదండరామవీధికి సమీపంలోని బీసీ కాలనీలో నివాసముంటున్న బోకర అరుంధతి అనే మహిళ గత నెల 31న డెంగీ లక్షణాలతో మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె చిన్న కుమారుడు బోకర వెంకటరమణ కూడా అదే వ్యాధి లక్షణాలతో పలాసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఈ వీధిలో మళ్లీ డెంగీ కలకలం రేపుతోంది. ఇదిలా ఉండగా కోదండరామవీధిలో విష జ్వరాలు విజృంభిస్తున్నప్పటికీ వైద్యాధికారులు కనీసం పట్టించుకోవడం లేదని దళిత మహాసభ జిల్లా అధ్యక్షుడు బోకర నారాయణరావు విమర్శించారు. ఇటీవల కాలంలో రక్తపూతలు సేకరించి ఆయా వివరాలు అందజేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఆయన పేర్కొన్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోతే ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.
Advertisement