అరుంధతి(ఫైల్ ఫొటో)
డెంగీ లక్షణాలతో వివాహిత మృతి
Published Sun, Jul 31 2016 11:38 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
♦ కోదండరామవీధిలో అదుపులోకి రాని విషజ్వరాలు
♦ స్పందించని యంత్రాంగం
టెక్కలి: డివిజన్ కేంద్రమైన టెక్కలిలో కోదండరామవీధికి ఆనుకుని ఉన్న బీసీ కాలనీ సమీపంలో డెంగీ లక్షణాలతో బోకర అరుంధతి(44) అనే వివాహిత ఆదివారం మృతి చెందారు. మృతురాలి భర్త పాల్గుణరావు తెలిపిన వివరాల ప్రకారం... అరుంధతి గత నెల 27న తీవ్ర జ్వరానికి గురి కావడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యుడ్ని ఆశ్రయించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన అనంతరం అరుంధతికి టైఫాయిడ్‌తో పాటు డెంగీ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రోజు రోజుకు అరుంధతి ఆరోగ్య పరిస్థితి విషమించి రక్త కణాల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. ఒక వైపు వైద్య సేవలు అందజేస్తున్నా ఫలితం లేకపోయింది.
ఆదివారం అరుంధతి పరిస్థితి విషమించి మృతి చెందారు. దీంతో బీసీకాలనీ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. మొన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న అరుంధతి హఠాత్తుగా మరణించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు కోదండరామవీధిలో విష జ్వరాలు ఇప్పటికీ తగ్గుముఖం పట్టడం లేదు. వీధిలో స్థానికులు జ్వరాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్ కేంద్రంలోని దళిత వాడలో విష జ్వరాలు విజృంభించి మృత్యువాత పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కోదండరామవీధిలో విష జ్వరాలు తారస్థాయికి చేరే ప్రమాదం తప్పదని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
Advertisement