
సొమ్ము కేంద్రానిది..సోకు రాష్ట్రానిది
బీజేపీ శాసన సభాపక్ష ఉపనేత ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్
హన్మకొండ: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం 70 శాతం నిధులు ఇస్తుంటే, రాష్ట్రం 30 శాతం నిధులు మాత్రమే వెచ్చిస్తూ తామే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నదని బీజేపీ శాసన సభాపక్ష ఉప నేత ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ దుయ్యబట్టారు. సొమ్ము కేంద్రానిదైతే.. సోకు రాష్ట్రానిదవుతుందని అన్నారు. శనివారం హన్మకొండలో బీజేపీ అభ్యర్థి పగిడిపాటి దేవయ్య ఎన్నికల ప్రచార సభలో ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు.
నిత్యావసర వస్తువల ధరల పెరుగుదలపై ఓట్లకు వస్తున్న రాష్ట్ర మంత్రులను ప్రజలు నిలదీయాలన్నారు. మోదీ పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి అని అన్నారు. ఈ క్రమంలో పేదల అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆపలేని మంత్రులకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.