
రిజిష్టర్‌లో సంతకం చేస్తున్న శ్రీనివాస్
ములుగు: తెలంగాణను సాధించడం తనకు అత్యంత సంతోషానిచ్చిందని ముఖ్యమంత్రి ఓఎస్‌డీ, ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ అన్నారు. గురువారం ములుగు మండలం క్షీరసాగర్ గ్రామ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్‌గా గురువారం విధుల్లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలివిడత తెలంగాణ ఉద్యమంలో తాను భాగస్వామినై ప్రజలను విద్యార్థులను చైతన్య పరిచేందుకు ఎంతగానో శ్రమించానన్నారు. పీడిత పాలన అంతమై స్వరాష్ట్రం సిద్దించడం ఆనందంగా ఉందన్నారు. తాను ఎన్నో సభలు సమావేశాలలో మాట్లాడినా, ఎన్నిపదవులు చేపట్టినా ఉపాధ్యాయుడిగా పనిచేయడాన్ని గర్వంగా స్వీకరిస్తానన్నారు.
గ్రామాలనుంచి వచ్చిన పిల్లలే ఉస్మానియా యూనివర్సిటిలో ఉద్యమం చేసి తెలంగాణ సాధనలో కీలకంగా వ్యవహరించారన్నారు. సాధించిన తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతున్నదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం రాష్ట్రం సిద్ధించాక పాఠ్యంశాల తయారీలో పాలుపంచుకోవడం గర్వంగా ఉందన్నారు.
కాగా విధుల్లో చేరేందుకు పాఠశాలకు చేరుకున్న దేశపతి శ్రీనివాస్‌కు నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొన్యాల బాల్‌రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సబితతో పాటు ఉపాధ్యాయులు దేశపతికి స్వీట్లు తినిపించి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థుల కోరిక మేరకు జయశంకర్ పేరిట పాట పాడి అందరిని ఉత్తేజ పరిచారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అనిత, నాగేశ్వర్‌రావు, సోమయ్య, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.