
అగ్నికి ఆహుతి
జమ్మలమడుగు రూరల్: రోడ్డుపై ఉన్న చెత్తాచెదారాన్ని కాల్చేందుకు ఎవరో నిప్పు పెట్టారు. అది సమీపంలోని అరటి తోటను కాల్చేసింది. ఈ సంఘటన జమ్మలమడుగు మండలం పి.బొమ్మెపల్లిలో చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన రైతు ముర్రా మధుసూధనరెడ్డి రెండున్నర ఎకరాల్లో అరటి సాగు చేశాడు. పంట కోత దశకు చేరుకుంది. దీనిని చూసిన వ్యాపారులు కొనుగోలు చేసి వెళ్లారు.
మరో వారం, పది రోజుల్లో కోత కోసి ఇతర ప్రాంతాలకు తరలించే వారు. అయితే కొందరు రైతులు పసుపు పంట ఆకులు కోసి గ్రామ పొలిమేరలోని రోడ్డుపై వేశారు. వీటికి ఆదివారం రాత్రి ఎవరో నిప్పుపెట్టి వెళ్లారు. మంటలు వ్యాప్తి చెందడంతో ముర్రా మధుసూధన్‌రెడ్డికి చెందిన తోట దగ్ధమైంది. అందులోని 3500 చెట్లు కాలిపోయాయి. గెలలు మాడిపోయాయి. డ్రిప్పు పరికరాలు దెబ్బతిన్నాయి. ఈ సంఘటనను సోమవారం తెల్లవారుజామున బాధిత రైతు గుర్తించారు. రూ. 10 లక్షలకు పైగా నష్టం వచ్చిందని ఆయన వాపోయారు.
రెండేళ్లుగా నష్టం:
గతేడాది ప్రకృతి వైపరీత్యం వల్ల అరటి పంట నాశనమైపోయింది. ఈ ఏడాది ఎవరో పెట్టిన మంటలకు తోట పూర్తిగా దగ్ధమైంది. డ్రిప్పు పరికరాలన్నీ కాలిపోయాయి. గతేడాది నష్టం వచ్చింది. ఈ ఏడాది పది లక్షల వరకు నష్టపోయాను.
- ముర్రా మధుసూధన్‌రెడ్డి, రైతు, పి.బొమ్మెపల్లి.