దుర్గమ్మకు నీరాజనం
దుర్గమ్మకు నీరాజనం
Published Sun, Oct 2 2016 8:37 PM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు రెండోరోజు ఆదివారం కూడా వైభవోపేతంగా జరిగాయి. బాలాత్రిపురసుందరీదేవిగా దర్శనమిచ్చిన అమ్మను అశేష భక్తకోటి దర్శించుకుంది. తెల్లవారుజామున మోస్తరు వర్షం కురియడంతో ఉదయం రద్దీ తక్కువగానే కనిపించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి అమాంతం పెరిగింది. ఉచిత దర్శనం క్యూలైన్లు టోల్‌గేట్ వరకూ చేరుకోగా, రూ.300 టికెట్ క్యూ ఘాట్‌రోడ్డులోని తొలి మలుపు వరకు చేరింది. భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుండటంతో పోలీసులు ఎక్కడిక్కడ బారికేడ్లు ఏర్పాటుచేశారు. సాయంత్రం నుంచి రద్దీ మరింత పెరగడంతో పోలీసులు మరింత కట్టుదిట్టంగా వ్యవహరించారు. బాలాత్రిపురసుందరీదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం పెద్దఎత్తున అన్నప్రాశనలు, నామకరణాలు జరిగాయి.
ఘాట్‌రోడ్డు మీదుగా రూ.300 , రూ.100 టికెట్ క్యూలైన్లు కిటకిటలాడగా, ఆలయ ప్రాంగణంలో ఖాళీగా దర్శనమిచ్చాయి. ఓంటర్నింగ్ నుంచి రూ.300, 100 టికెట్ క్యూలైన్‌లోకి ఉచిత దర్శనం భక్తులు వచ్చేయడంతో వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో భక్తులు ఉచిత దర్శనం క్యూలైన్‌లోకి చేరేందుకు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు రూ.100 క్యూలైన్‌లోని సాధారణ భక్తులను అనుమతిస్తే గంటలకొద్దీ భక్తులు క్యూలైన్‌లో వేచి ఉండే పరిస్థితులు తప్పేవి. ఘాట్‌రోడ్డు మీదుగా కొండపైకి చేరుకున్న వీఐపీలు తిరిగి ఘాట్‌రోడ్డు వైపు రాకుండా పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఇంద్రకీలాద్రిపై వీఐపీలకు బ్రేక్ దర్శన సదుపాయం కల్పించారు. ఆదివారం అయినా వీఐపీల తాకిడి కనిపించలేదు.
Advertisement
Advertisement