చిల్లర కోసం ఎస్‌బీఐ ముట్టడి
ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన
రూ.2వేల నోట్లను రద్దుచేయాలని డిమాండ్
నోట్ల రద్దు వ్యవహారంలో రాజకీయ కోణం – కర్నాకుల
జగ్గంపేట : సామాన్యులు నుంచి అన్ని వర్గాల ప్రజలు పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. మెట్ట ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు దాదాపు స్తంభించడంతో కూలీలు, చిన్నచిన్న వ్యాపారులు, మహిళలు చిల్లర సమస్యతో అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం మ«ధ్యాహ్నం జగ్గంపేట స్టేట్‌బ్యాంక్ శాఖను ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు నాయకత్వం వహించిన రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ ముందస్తు సర్దుబాటు చర్యలు తీసుకోకుండా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడం వెనక రాజకీయ కోణం ఉందన్నారు. ఈ నిర్ణయం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా ముద్రించిన రూ.2వేల నోటు రద్దు చేయాలన్నారు. బ్యాంక్ వద్ద ఆందోళన అనంతరం సర్వీసు రోడ్డు మీదుగా గ్రామంలో మెయి¯ŒS రోడ్డు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు కూలీ సంఘ నేతలు బి.రమేష్, రామలింగేశ్వరరావు, త్రిమూర్తులు, కొండేపూడి మంగయ్యమ్మ, సతీష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.