రాష్ట్రంలో నియంత పాలన
రాష్ట్రంలో నియంత పాలన
Published Mon, Oct 17 2016 11:18 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
– నిరుద్యోగ భృతి ఇచ్చేది లేదని ప్రకటించడం సిగ్గుచేటు
– వర్ల రామయ్యది జగన్‌ను విమర్శించే స్థాయి కాదు
– వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కజకిస్తాన్, ఉక్రెయిన్ తరహాలో రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య పేర్కొన్నారు. సోమవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు నాయుడు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి విచారణకు సిద్ధపడటం లేదన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి.. ప్రతిపక్షాలపైనే వేలు చూపడం సరికాదన్నారు. టీడీపీ నేత వర్ల రామయ్యది తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించేంత స్థాయి కాదన్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్.. హోమ్ మంత్రి అవమాన పరుస్తూ మాట్లాడారని, దీనిని టీడీపీ నాయకులు ఖండించకపోవడం దారుణమన్నారు. టీడీపీకి ప్రజలే గుణపాఠం చెబుతారని పార్టీ నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్ అన్నారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శౌరి విజయకుమారి, సలోమి మాట్లాడుతూ.. టీడీపీ నాయకుడు ఆకెపోగు ప్రభాకర్ తన స్థాయి తెలుసుకుని మాట్లాడాలని హితబోధ చేశారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి పి.రాజా విష్ణువర్ధణ్ రెడ్డి, లీగల్‌సెల్ ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రఘు, జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement