
బలమైన పోలీస్ వ్యవస్థ ఏర్పాటుకు కృషి
గంపలగూడెం : ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు ఏర్పరచి, మెరుగైన సేవలు అందించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు డీఐజీ పీవీఎస్ రామకృష్ణ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా ప్రమాదాలు, అరాచకాలు, నేరాలు నియంత్రించవచ్చని, ఆ కోణంలో ప్రయత్నాలు చేపడుతుతున్నామన్నారు. ఇందులో భాగంగానే గ్రామస్థాయి నుంచి వివిధ అంశాల్లో (నేరాలు, అక్రమాలు, ప్రమాదాలు) సమాచారం ఇచ్చేందుకు , స్వచ్ఛందంగా పోలీసులతో కలిసి విధుల్లో పనిచేసేందుకు ఉత్సాహం ఉన్నవారిని ఎంపిక చేసిన శిక్షణ ఇస్తామని చెప్పారు. టెక్నాలజీ వినియోగం అనేక సమస్యల పరిష్కారం, విచారణకు ఉపయోగపడుతుందని వివరించారు. ఓవర్ లోడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ నియంత్రణ చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించామన్నారు. పెద్దనోట్ల రద్దు కారణంగా నోట్ల మార్పిడిలో చోటుచేసుకుంటున్న అక్రమాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయంలో పోలీసులైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. అనంతరం రామకృష్ణ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నూజివీడు డీఎస్పీ వి. శ్రీనివాసరావు, తిరువూరు సీఐ కిషోర్‌బాబు, ఎస్సై శివరామకృష్ణ పాల్గొన్నారు.