తెరగతి పాఠాలు
రౌతులపూడి:
సాంకేతిక విప్లవం జోరందుకుంటున్న రోజులివి. మరి ఆ ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోకపోతే భవిష్యత్తులో కష్టమే. అందుకే ఆ మండలంలోని విద్యార్థులు కొందరు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో డిజిటల్ విద్యపై ఆసక్తి చూపుతున్నారు. వీరికి పలువురు పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు అందజేసిన డిజిటల్ ప్రొజెక్టర్లు, స్క్రీన్‌లు, కంప్యూటర్లు ఎంతగానో దోహదపడుతున్నాయి.
తరగతి గదుల్లో చెప్పిన దానికంటే.. తెరపై చూపుతూ పాఠ్యాంశాలను వివరిస్తే విద్యార్థులకు సులువుగా బుర్రకెక్కుతుందంటున్నారు ఉపాధ్యాయులు. అందుకే వారి కోసం డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామని వారు చెబుతున్నారు. సైన్స్, సోషల్, లెక్కలు.. సబ్జెక్టు ఏదైనా ‘స్క్రీన్’పై ప్రయోగాత్మకంగా, బొమ్మల రూపంలో చూపిస్తున్నామని, దీని ద్వారా విద్యార్థులు సులువుగా పాఠాలు నేర్చుకుంటున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రవేశపెడితే డిజిటల్ ఇండియా, మేడిన్ ఇండియాలకు చేరువకావచ్చని వారు సూచిస్తున్నారు.
పూర్వపు విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల చేయూతతో..
∙మండలంలోని రామకృష్ణాపురం ప్రాథమిక పాఠశాలలో ఆగ్రామ పూర్వ విద్యార్థుల సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రొజెక్టర్, కంప్యూటర్లు విద్యార్థులకు పూర్తిస్థాయిలో దోహదపడుతున్నాయి. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు డిజిటల్ పాఠ్యాం శాలపై దగ్గరుండి విద్యార్థులతో ఆపరేటింగ్ చేయించడం ద్వారా మరింత అవగాహన కలిగిస్తున్నారు.
∙బలరామపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ స్వచ్ఛందసంస్థ ప్రతినిధి, ఆ పాఠశాల ఉపాధ్యాయుల సంయుక్త సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రొజెక్టర్ విద్యార్థుల సృజనాత్మకశక్తినిపెంపొందించడానికి ఎంతగానో దోహదపడుతుంది.
∙రౌతులపూడి జెడ్పీ ఉన్నతపాఠశాలలోని విద్యార్థులకు మెరుగైన కంప్యూటర్ విద్యనందించేందుకు ఆ గ్రామ పూర్వపు విద్యార్థి సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రొజెక్టర్ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకొనేందుకు ఉపయోగపడుతుంది.