– 15 నుంచి జిల్లాలో 20 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు
– రెండో దశలో 80 పాఠశాలల కోసం ప్రతిపాదనలు
– డివిజన్‌కు 20 పాఠశాలలకు చొప్పున నిర్వహణ
– దాతల సాయంతో ఇప్పటికే 12 పాఠశాలల్లో డిజిటలైజేషన్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఒకప్పుడు ఉపాధ్యాయులు..విద్యార్థులతో ఇసుకలో అక్షరాలు దిద్దించే వారు. తరువాత బ్లాక్ బోర్డులు రంగప్రవేశం చేయాయి. బోధన ఉపకరణాలు మెరుగుపెడ్డాయి. రాను రాను కంప్యూటర్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఇంకా సాంకేతికంగా అభివృద్ధి చెంది.. నేడు డిజిటల్ ప్రపంచం రాజ్యమేలుతోంది. విద్యావిధానంలో ఇది పెనుమార్పు తీసుకొస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ డిజిటల్ తరగతుల నిర్వహణకు గంట కొట్టారు. త్వరలో స్రీన్‌పై త్రీడీ బొమ్మలతో విద్యార్థులకు నూతన పాఠాలు పరిచయం కానున్నాయి.
ప్రభుత్వ పాఠశాలలు సాంకేతికంగా అభివృద్ధి చెందనున్నాయి. జిల్లాలో వంద పాఠశాలలు డిజిటల్ సొబగులు అందిపుచ్చుకోనున్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి మొదటి దశలో 20 పాఠశాలల్లో డిజటిటల్ తరగతులు ప్రారంభం కానున్నాయి. రెండో దశలో మరో 80 పాఠశాలల్లో డిజిటల్ క్లాసు రూంల కోసం విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. ఇప్పటికే జిల్లాలో దాతల సాయంతో 12 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. అనుకున్నట్లు జరిగితే మరో రెండు, మూడు నెలలల్లో మొత్తం 112 పాఠశాలల్లో డిజిటలైజ్ కానున్నాయి.
ప్రధానోపాధ్యాయులకు శిక్షణ..
రాష్ట్ర ప్రభుత్వం 5 వేల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంది. అందులో భాగంగా మొదటి దశలో 18 పాఠశాలలను ఎంపిక చేసింది. ఆ సంఖ్యను ఇక్కడి అధికారులు మరో రెండు పాఠశాలలను కలిపి మొదటి దశలో మొత్తం 20 పాఠశాలల్లో ఈనెల 15 నుంచి డిజిటల్ తరగతులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చారు. స్కూలు, మెయింటెన్స్ గ్రాంట్ల నుంచి డిజిటల్ తరగతులకు అవసరమయ్యే స్క్రీన్లు, ప్రొజెక్టర్లు, కంప్యూటర్లు, సబ్జెక్టుల సీడీలు/డీవీడీలు కొనుగోలుకు విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ మొదటి దశ పాఠశాలలు
1.జెడ్పీహెచ్‌ఎస్, హల్వీ 2.జెడ్పీహెచ్‌ఎస్(బీ), కోసిగి 3. గవర్నమెంట్ హైస్కూల్, నందికొట్కూరు 4.గవర్నమెంట్ హైస్కూల్, ఆత్మకూరు 5.ఏపీఆర్‌ఐఈఎస్(బీసీ), సున్నిపెంట 6.జెడ్పీహెచ్‌ఎస్(గర్ల్స్) కోడుమూరు 7. జెడ్పీహెచ్‌ఎస్(బాయ్స్), వెల్దుర్తి 8. జెడ్పీహెచ్‌ఎస్ రంగాపురం 9. జెడ్పీహెచ్‌ఎస్ గడివేముల 10. జెడ్పీహెచ్‌ఎస్, శిరివెళ్ల 11. గవర్నమెంట్ హైస్కూల్, అళ్లగడ్డ 12. జెడ్పీహెచ్‌ఎస్, చాగలమర్రి, 13. జెడ్పీహెచ్‌ఎస్ దొర్నిపాడు, 14. జెడ్పీహెచ్‌ఎస్, దీబగుంట్ల, 15.జెడ్పీహెచ్‌ఎస్ నందవరం 16. జెడ్పీహెచ్‌ఎస్(గర్ల్స్), బనగానపల్లె 17.జెడ్పీహెచ్‌ఎస్(గర్ల్స్), డోన్ 18.జెడ్పీహెచ్‌ఎస్(గర్ల్స్) పత్తికొండ, 19.జెడ్పీహెచ్‌ఎస్ నిడ్జూరు, 20.జెడ్పీహెచ్‌ఎస్ కంబాలపాడు
డివిజన్‌కు 20 పాఠశాలలు చొప్పున..
జిల్లాలో మొత్తం 898 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రైవేట్‌లో 354, ఎయిడెడ్‌లో 45, రెసిడెన్షియల్‌లో 123, మునిసిపల్‌లో 16, జెడ్పీలో 335, గవర్నమెంట్‌లో 25 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో గవర్నమెంట్, జెడ్పీ, మునిసిపల్ పాఠశాలలు కలిపి మొత్తం 376 ఉన్నాయి. వీటిలో డివిజన్‌కు 20 పాఠశాలల్లో చొప్పున మొత్తం 80 ఉన్నత పాఠశాలల్లో రెండోదశలో డిజిటల్ క్లాసు రూంలను ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ ప్రణాళిలకను రూపొందించింది.
అత్యాధునిక వసతులు..
అత్యాధునిక వసతులతో డిజిటల్ క్లాసు రూంలు ఏర్పాటు కానున్నాయి. ప్రొజెక్టర్, స్క్రీన్, ల్యాప్‌టాప్‌లతోపాటు మరికొన్ని అత్యాధునిక పరికరాలు ఉంటాయి. వీటితోపాటు తరగతి గదిలో విద్యార్థులు కూర్చోవడానికి ప్రత్యేక కుర్చీలు, టేబుల్లు అమర్చుతారు. వీటన్నింటినీ ఉన్నతాధికారులే కొనుగోలు చేసిన ఎంపిక చేసిన పాఠశాలలకు పంపుతారు. డిజిటల్ తరగతులతో విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలుగుతుందనడంలో సందేహం లేదు. ఒక అంశానికి సంబంధించిన బొమ్మలు, మ్యాపులు, వివరణలతో కూడిన త్రీడీ ప్రింటుతో కూడిన చిత్రాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు ప్రత్యక్ష అనుభూతి కలిగేలా చేస్తాయి. ఇక్కడ బోధన చేసే ఉపాధ్యాయుడికి కూడా పనిభారం తగ్గుతుంది. దీంతో ఆయన అంశాన్ని విశదీకరించేందుకు ఎక్కువగా సమయం దొరుకుతుంది.
ఆహ్వానించదగ్గ విషయం: కరుణానిధిమూర్తి, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు
డిజిటల్ క్లాసు రూంల ఏర్పాటు మంచిదే. వీటితో విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది. తద్వారా పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతాయి. అన్ని ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేయాలి.