నామినేటెడ్ పదవుల భర్తీ మరింత జాప్యం
Published Fri, Oct 21 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM
భీమవరం :
భీమవరం మండలం తుందుర్రులో గోదావరి ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణంతో తలబొప్పికట్టిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)కు మార్కెట్ కమిటీ నియామకం మరో సంకటంగా పరిణమించిది. నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టుల భర్తీలో జాప్యంపై టీడీపీ కార్యకర్తల్లో నెలకొన్న అసంతృప్తి నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకానికి సంబంధించిన ఫైల్ రెండు నెలలుగా పెండింగ్‌లో ఉండటంతో అంజిబాబు తీవ్ర అసహనానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం పలువురు పోటీ పడినప్పటికీ ఎట్టకేలకు తన ముఖ్య అనుచరుడు కోళ్ల నాగేశ్వరరావు వైపు ఎమ్మెల్యే మొగ్గుచూపారు. చైర్మన్, వైస్‌చైర్మన్, డైరెక్టర్ పదవులకు ఎమ్మెల్యే సిఫార్సు చేసిన పేర్ల జాబితా ఇలా వుంది. చైర్మన్ పదవికి చినఅమిరం గ్రామానికి చెందిన కోళ్ల నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ పదవికి భీమవరం పట్టణంలోని చినరంగని పాలెంకు చెందిన చెల్లుబోయిన సుబ్బారావు పేర్లు ప్రతిపాదించారు. డైరెక్టర్ పదవులకు వీరవాసరం మండలం కొణితివాడకు చెందిన గొలగాని సత్యనారాయణ, బలుసుగొయ్యపాలెంకు చెందిన దంపనబోయిన అప్పారావు, రాయకుదురు పంచాయతీ పరిధిలోని జగన్నాథరావుపేటకు చెందిన కడలి నెహ్రూ, బొక్కా చంద్రమోహన్, వేర్వేరు ప్రాంతాలకు చెందిన సయ్యపురాజు భాస్కరరాజు, ఎండీ అలీషా (షాబు), బలె లూథరమ్మ, సాలా నరసింహమూర్తి, భూపతిరాజు నాగేంద్రవర్మ, నాగిడి తాతాజీ, కొల్లాటి శ్రీనివాసరావు, కురిశేటి నరసింహరావు (రాజా), వీరవాసరం సొసైటీ అ«ధ్యక్షుడు నూకల కేశవరమేష్ అప్పాజీ పేర్లు జాబితాలో ఉన్నాయి. వీరితోపాటు భీమవరరం మునిసిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు,మార్కెట్ కమిటీ కార్యదర్శి, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు.
జాబితాకు మోక్షం కలిగేనా!
వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ నియామకం గత రెండేళ్లుగా టీడీపీలో వర్గపోరుకు కారణమైంది. చైర్మన్ పదవికి పార్టీ సీనీయర్ నాయకుడు మెంటే పార్థసారథి, మంత్రి పీతల సుజాత తండ్రి పీతల వరప్రసాద్ (బాబ్జి), పోలిశెట్టి సత్యనారాయణ (దాసు), కొట్టు బాబులు, వీరవల్లి చంద్రశేఖర్, పొత్తూరి బాపిరాజు, కోళ్ల నాగేశ్వరరావు, తోట భోగయ్య తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి. నియోజకవర్గ టీడీపీ నాయకులు ఎమ్మెల్యే అంజిబాబు, ఎంపీ తోట సీతారామలక్ష్మి వర్గాలుగా విడిపోవడంతో మార్కెట్ కమిటీ పాలకవర్గ నియామకంలో తీవ్ర జాప్యం జరిగింది. ఎమ్మెల్యే ఒక మెట్టు దిగివచ్చి చైర్మన్ పదవిని తాను కోరుకున్న వ్యక్తికి కట్టబెడతానని, డైరెక్టర్ పదవులకు భీమవరం పట్టణం, వీరవాసరం, భీమవరం మండలాల్లోని పార్టీ ముఖ్యనాయకులు సమావేశాలు ఏర్పాటుచేసుకుని జాబితాలివ్వాలని సూచించడంతో ఆగస్టు నెలలో కోళ్ల నాగేశ్వరరావు చైర్మన్‌గా, చెల్లబోయిన సుబ్బారావు వైస్‌చైర్మన్‌గా ప్రతిపాదిస్తూ ఎమ్మెల్యే జాబితాను ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపారు.
పెండింగ్‌లో ఫైల్.
ఈ ఫైల్ రెండునెలలుగా ముఖ్యమంత్రి వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. భీమవరం కమిటీతోపాటు మరొక రెండు,మూడు నియోజకవర్గాల ఫైల్స్ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లగా వాటికి ఆమోదముద్ర వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భీమవరం కమిటీని కావాలనే పెండింగ్‌లో పెట్టారని చెబుతున్నారు. ఎమ్మెల్యే అంజిబాబు పార్టీ కార్యకలాపాల్లో సరిగ్గా పాల్గొనడం లేదని, నెలవారీ పార్టీ సమావేశాలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహంగా ఉన్న ముఖ్యమంత్రి మార్కెట్ కమిటీ జాబితాను పెండింగ్‌లో పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఇదే తరుణంలో తుందుర్రులో ఫుడ్‌పార్క్ నిర్మా ణం విషయంలో అక్కడి ప్రజలను ఒప్పించాలని ఎమ్మెల్యేను సీఎం ఆదేశించారు. దీంతో ఎంపీ తోట సీతారామలక్ష్మితో కలిసి తుందుర్రు వెళ్లిన ఎమ్మెల్యే అంజిబాబు గ్రామ పెద్దలతో మాట్లాడిన వ్యవహారం బెడిసికొట్టింది. ఉద్యమం యువకుల చేతుల్లో ఉందని తామేమి చేయలేమని పెద్దలు కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో అంజిబాబు పరిస్థితి ఇరకాటంలో పడింది. తుందుర్రులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన అనంతరం ఫుడ్‌పార్క్ ప్రభావిత గ్రామాల ప్రజలకు కొండంత ధైర్యం వచ్చింది. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఎలాగైనా పార్కు నిర్మాణాన్ని అడ్డుకుంటామని చెబుతుం డటంతో నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులు నియామకం ప్రశ్నార్థకంగా మారింది.
Advertisement
Advertisement