acqa park
-
అక్వాపార్క్పై అమీతుమీ
ఆక్వా పార్క్ పనుల నిలుపుదలకు ఒక్కరోజే గడువు రేపటినుంచి అడ్డుకుంటామంటున్న పోరాట కమిటీ నివురుగప్పిన నిప్పులా తుందుర్రు, పరిసర గ్రామాలు భారీగా మోహరిస్తున్న పోలీసులు బాధిత గ్రామాల్లో ఉద్రిక్తత సాక్షి ప్రతినిధి, ఏలూరు : తుందుర్రు పరిసర గ్రామాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. భీమవరం, వీరవాసరం, నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని సుమారు 30 గ్రామాల ప్రజలు ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం, గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ యాజమాన్యం మొండి వైఖరితో పనులను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తాడోపేడో తేల్చుకోవడానికి ఆక్వా పార్క్ బాధిత గ్రామాల ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు వేచి చూస్తామని, అప్పటికీ పనులను నిలుపుదల చేయకపోతే ఆ రోజే ఫ్యాక్టరీ పనులను అడ్డుకుంటామని పోరాట కమిటీ డెడ్‌లైన్ విధించింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆక్వా పార్క్ వ్యతిరేక పోరాటంలో చురుకుగా ఉంటున్న వారిపై ఇప్పటికే నిఘా పెట్టారు. వారిని మంగళవారం అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. ఇప్పటికే ఏలూరు నుంచి మూడు బెటాలియన్ల పోలీసు బలగాలు భీమవరం తరలివెళ్లాయి. ఇప్పటికే ఆయా గ్రామాల్లో పోలీసుల పహారా పెరిగింది. సైరన్లు మోగించుకుంటూ గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను భయపెట్టే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. గతంలో చోటుచేసుకున్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని భారీగా పోలీసులను మోహరించాల్సి ఉందని నరసాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు ఎస్పీ భాస్కర్ భూషణ్‌ను కలిసి నివేదించినట్టు మాచారం. ఇదిలావుంటే.. తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల ప్రజలను ఇళ్లల్లోంచి బయటకు రాకుండా అడ్డుకోవడంతోపాటు ఇతర ప్రాంతాల ప్రజల్ని ఇక్కడకు రానివ్వకుండా అడ్డుకునేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. గత ఏడాది సెప్టెంబర్ 12వ తేదీనుంచి తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల్లో 144 సెక్షన్ విధించిన విషయం విదితమే. ఆ సమయంలో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా వేధింపులకు గురిచేశారు. వేరే ప్రాంతానికి తరలించాలని వేడుకుంటున్నా.. అక్వా పార్క్ నిర్మాణం వల్ల భూగర్బ జలాలు కలుషితం అవుతాయని, ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాల కారణంగా గొంతేరు డ్రెయిన్ కలుషితం అవుతుందనేది నిపుణులు, ఆ ప్రాంత ప్రజల వాదన. తాగునీటి వనరులు పాడవుతాయని, చేలు దెబ్బతింటాయని, మత్స్య సంపద హరించుకుపోతుందని, భవిష్యత్ తరాలు రోగాల పాలవుతాయని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ దృష్ట్యా ఆక్వా పార్క్‌ను జనావాసాలు లేని సముద్ర తీర ప్రాంతానికి తరలించాలని ప్రజలంతా కోరుతున్నారు. ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోని ప్రభుత్వం ఆక్వా పార్క్ యాజమాన్యానికి వత్తాసు పలుకుతోంది. ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తోంది. పోరాటంలో చురుకుగా పాల్గొంటున్న 37 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టింది. అందులో ఏడుగురిని సుమారు 50 రోజులపాటు జైలు పాల్జేసింది. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ ప్రాంతానికి రావడంతోపాటు బాధితులకు అండగా నిలబడ్డారు. దీంతో 144 సెక్షన్‌ను అధికారికంగా తొలగించకపోయినా ప్రశాంత వాతావరణం నెలకొంది. అయితే ఆక్వాపార్క్ యాజమాన్యం మాత్రం పనులు ఆపడం లేదు. దీనికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమాలు జరిగినా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోంది. దీంతో పనులు అడ్డుకునేందుకు బాధిత గ్రామాల ప్రజలు సన్నద్ధం అవుతుండటంతో ఈ ప్రాంతంలో మరోసారి యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. -
ఆక్వాపార్క్‌కు రక్ష.. మత్స్యకారులకు ఎందుకీ శిక్ష..?
– మా జీవనోపాధికి భంగం కలిగిస్తే సహించం – వంశపారంపర్యంగా వస్తున్న వలకట్లను నాశనం చేస్తే ఊరుకోం – అవసరమైతే న్యాయ పోరాటాలకూ వెనుకాడం – మత్స్యకారుల హెచ్చరిక ‘ఆక్వా పార్క్ పెద్దలకు రక్షగా నిలుస్తోంది. సామాన్య ప్రజలపై కక్ష సాధిస్తోంది. మాపై వివక్ష చూపుతోంది. మా జీవనోపాధికి గండికొట్టి.. మా పొట్టకొట్టేందుకు యత్నిస్తోంది. ఇదేం సర్కారు’ గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ బాధిత గ్రామాల ప్రజల ఆక్రందన ఇది. భీమవరం మండలం తుందుర్రు పరిసర గ్రామాలతోపాటు నరసాపురం, మొగల్తూరు, వీరవాసరం మండలాల్లోని ప్రజలు వ్యతిరేకిస్తున్నా.. ఆక్వా పార్క్ యాజమాన్యం ఎదుట మోకరిల్లిన సర్కారు జనంపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ.. పోలీసులను మోహరించి దాషీ్టకానికి దిగడం విమర్శల పాలవుతోంది. సర్కారు తీరును నిరసిస్తూ.. తమ జీవనంతో ముడిపడిన ఉన్న గొంతేరు కాలువను కాలుష్య కాసారంగా మార్చే ఆక్వా పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా మత్స్యకారులు పోరుబాట పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘తరతరాలుగా గొంతేరు కాలువపై ఆధారపడి బతుకుతున్నాం. మా జీవనోపాధిపై వేటు వేయకండి. కాలువలో మేం వేసుకున్న వలకట్లకు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చింది. వేలాది కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న గొంతేరును కొందరి స్వార్థం కోసం కాలుష్యసాగరంగా మారిస్తే ఊరుకోం’ అని నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని గొంతేరు సరిహద్దు గ్రామాల్లోని మత్స్యకార కుటుంబాలు వేడుకుంటున్నాయి. ఆ రెండు మండలాల్లోని ఆక్వాపార్క్ ప్రభావిత గ్రామాల్లో ‘సాక్షి’ బందం పర్యటించగా.. అక్కడి మత్స్యకారులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ ద్వారా 500 మందికి ఉపాధి కల్పిస్తామంటూ.. 50 వేల కుటుంబాలను రోడ్డున పడవేయడం భావ్యం కాదని వాపోయారు. సంప్రదాయ చేపల వేట సాగించే మత్స్యకారులకు జీవనోపాధి కల్పించడంతోపాటు ఇక్కడి ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తున్న గొంతేరు కాలువను కాలుష్యం బారినుంచి కాపాడుకునేందుకు అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని మత్స్యకార కుటుంబాలు తేల్చిచెప్పాయి. తమపైకి పోలీసుల్ని ఉసిగొల్పినా.. ఎన్నిరకాలుగా వేధించినా పోరాటం నుంచి వెనక్కి తగ్గేది లేదని పలువురు స్పష్టం చేశారు. జీవనోపాధి పోయాక తాము చేయగలిగిందేమీ ఉండదని.. అందుకే, ముందుగానే ఆక్వా పార్క్ నిర్మాణాన్ని అడ్డుకోవాలన్నది తమ అభిమతమని మత్స్యకారులు తెలిపారు. తమ జీవనోపాధికి భంగం కలిగిస్తే సహించబోమని, వంశపారంపర్యంగా వస్తున్న వలకట్లను నాశనం ఊరుకునేది లేదని, అవసరమైతే న్యాయ పోరాటాలకు సిద్ధమవుతామని ముక్తకంఠంతో చెప్పారు. వందలాది వలకట్లు.. అవే ఉపాధి మెట్లు నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని గొంతేరు కాలువ పరిధిలో 31 పెద్ద వలకట్లు, మరో 200 వరకూ చిన్న వలకట్లు ఉన్నాయి. వీటి నిమిత్తం మత్స్యకారులు ఏటా ప్రభుత్వానికి పన్ను చెల్లించి లైసెన్స్ పునరుద్ధరించుకుంటారు. వీటికి ప్రభుత్వం జిరాయితీ తరహాలో పట్టాలు ఇస్తుంది. వీటిని వంశపారంపర్యంగా అనుభవించవచ్చు. లేకపోతే వేరే వారికి రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది. వేట నిషేధం సమయంలో వీరి జీవనోపాధి నిమిత్తం బియ్యం, ఇతర సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ హక్కు కొన్ని తరాలుగా వస్తోంది. ఆక్వా పార్క్ నిర్మాణం పూర్తయి, గొంతేరు కాలువ కలుషితమైతే తమ భవిష్యత్ అంధకారమవుతుందని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆక్వా పార్క్ ప్రభావిత గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల్లో వరితోపాటు, ఆక్వా కల్చర్ కూడా సాగుతోంది. వీటికి గొంతేరు కాలువ నీరే ఆధారం. అందుకే అక్కడి వారంతా ఆక్వాపార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. పరిశ్రమ నిర్మాణానికి మద్దతు ప్రకటించిన నరసాపురం, భీమవరం ఎమ్మెల్యేలపై పూర్తి ఆగ్రహంతో ఉన్నారు. ఆయా గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు కూడా పూర్తిగా ముందుండి ఉద్యమాన్ని నడుపుతున్నారు. పైప్‌లైన్ వేస్తారా.. చూస్తాం తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పైపులైన్ వేస్తామని చెబుతున్నారు. 16 కిలోమీటర్ల మేర ఎవరి భూముల్లోంచి దీనిని వేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ‘పైపులైన్ వేయడం కోసం భూసేకరణ నోటిఫికేషన ఇవ్వనివ్వండి అప్పుడు చూద్దాం’ అని వారు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే మొగల్తూరు మండల శివార్లలో అనంద గ్రూప్ ఏర్పాటు చేసిన రొయ్య తలల ప్రాసెసింగ్ యూనిట్ వల్ల ఆ ప్రాంతంలోని గొంతేరులో దొరికే పీతలు, బొమ్మిడాయిలు వంటి మత్స్యసంపద అంతరించిపోయిందని వారు చెబుతున్నారు. గొంతేరుపై మత్స్యపురి వద్ద ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే నీటినే మంచినీటి చెరువుకు మళ్లించి, వాటిని శుద్ధి చేసుకుని తాగునీటి కోసం ఉపయోగిస్తున్నామని మొగల్తూరు మండలం కొత్తపాలెం గ్రామస్తులు చెబుతున్నారు. మా బతుకే ఈ కాలువ మా తాతల కాలం నుంచి గొంతేరు కాలువలో చేపల్ని వేటాడి బతుకుతున్నాం. తరతరాలుగా మా వత్తి ఇదే. ఈ కాలువ లేకపోతే మా బతుకు లేదు. తుందుర్రులో రొయ్యల ఫ్యాక్టరీలోని మురుగంతా ఈ కాలువలో కలిస్తే మాకు చేపలు దొరకవు. ఎలా బతికేది. –కొల్లాటి నాగరాజు, చింతరేవు, మొగల్తూరు మండలం బ్రిటీసోళ్లే నయమనిపించారు మా ఆయన, కొడుకు గొంతేరు కాలువలో చేపలు, రొయ్యిలు వేటాడుకొస్తారు. వాటిని నేను గంపలో పెట్టుకుని పట్టణానికెళ్లి వీధుల్లో అమ్ముకుని వస్తాను. ఇలాగే ఎన్నో ఏళ్లుగా బతుకుతున్నాం. మాకు గొంతేరులో వేటాడుకుని బతకమని బ్రిటీసోళ్లు లైసెన్స్‌లు ఇచ్చారు. దీన్ని కాలుష్యం చేసి ఇప్పుడు వీళ్లు మా కడుపులు కొట్టాలని చూస్తున్నారు. ఈళ్లకంటే బ్రిటీసోళ్లే నయమనిపించారు. –కొల్లాటి ముత్యామ్మ, చింతరేవు, మొగల్తూరు మండలం ఫ్యాక్టరీ కట్టనివ్వం ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళననలు చేయొద్దని పోలీసులొచ్చి బెదిరిస్తున్నారు. జైల్లో పెడతామంటున్నారు. మా బతుకే పోతున్నప్పుడు మమ్మల్ని జైల్లో పెడితే ఏంటి.. ఉరితీస్తే ఏంటి. ఫ్యాక్టరీ మాత్రం మాకొద్దు. మేం కట్టనివ్వం. వేట లేకపోతే మా బతకులే లేవు. – వైదాని మహాలక్ష్మి, చింతరేవు, మొగల్తూరు మండలం మాకే నష్టం ఎక్కువ తుందుర్రులో ఫ్యాక్టరీ కడుతున్నామని అంటున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు తుందుర్రు వారితోనే మాట్లాడుతున్నారు. గొంతేరు కాలువ అంతా మొగల్తూరు, నరసాపురం మండలాల్లోనే ఉంది. ఇక్కడ మత్స్యకారులు నష్టపోతారు. మా పొలాలు పండవు. నష్టం అంతా మాకే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీ కట్టనివ్వం. – రేవు రాంబాబు, ముత్యాలపల్లి , మొగల్తూరు మండలం మాకు ఇది జీవనది గొంతేరును డ్రెయిన్ అంటారు. కానీ మా కొత్తపాలెం, శేరేపాలెం చుట్టుపక్కల వాళ్లంతా గొంతేరును జీవనదిగా పిలుచుకుంటాం. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కాస్త ఉప్పునీరు ఉంటుంది. మిగతా రోజుల్లో ఈ నీటినే వాడకం నీటిగా వినియోగిస్తాం. స్నానాలు చేస్తాం, పశువులకు పట్టిస్తాం. అవసరమైనప్పుడు కాచి వడగట్టుకుని ఈ నీటినే మేమూ తాగుతాం. తుందుర్రులో రొయ్యల ఫ్యాక్టరీ కడితే ఇక అంతేసంగతులు. – – లోకం చంద్రశేఖర్, రైతు, కొత్తపాలెం, మొగల్తూరు మండలం టీడీపీ అధ్యక్షుడిగా బాధపడుతున్నా చక్కగా రెండు పంటలు పండే పొలాలు మావి. తుందుర్రులో రొయ్యల కంపెనీ కట్టి, ఆ వ్యర్థాలను గొంతేరులో వదిలితే మా పొలాలు బీడుగా మారతాయి. మేమంతా బికారులగా మిగిలిపోతాం. నేను గ్రామ టీడీపీ అధ్యక్షుడిని. ఫ్యాక్టరీ వద్దని భీమవరం ఎమ్మెల్యేకు చెప్పా. నరసాపురం ఎమ్మెల్యేకూ చెప్పా. మమ్మల్ని ఎవరో చెచ్చగొడుతున్నారని అంటున్నారు. మాకు తెలియదా, రెచ్చగొడితే రెచ్చిపోతామా. చెప్పుకోవడానికి ఏమీలేదు. బాధగా ఉంది. – కొత్తపల్లి రాంబాబు, కొత్తపాలెం, మొగల్తూరు మండలం -
నామినేటెడ్ పదవుల భర్తీ మరింత జాప్యం
భీమవరం : భీమవరం మండలం తుందుర్రులో గోదావరి ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణంతో తలబొప్పికట్టిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)కు మార్కెట్ కమిటీ నియామకం మరో సంకటంగా పరిణమించిది. నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టుల భర్తీలో జాప్యంపై టీడీపీ కార్యకర్తల్లో నెలకొన్న అసంతృప్తి నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకానికి సంబంధించిన ఫైల్ రెండు నెలలుగా పెండింగ్‌లో ఉండటంతో అంజిబాబు తీవ్ర అసహనానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం పలువురు పోటీ పడినప్పటికీ ఎట్టకేలకు తన ముఖ్య అనుచరుడు కోళ్ల నాగేశ్వరరావు వైపు ఎమ్మెల్యే మొగ్గుచూపారు. చైర్మన్, వైస్‌చైర్మన్, డైరెక్టర్ పదవులకు ఎమ్మెల్యే సిఫార్సు చేసిన పేర్ల జాబితా ఇలా వుంది. చైర్మన్ పదవికి చినఅమిరం గ్రామానికి చెందిన కోళ్ల నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ పదవికి భీమవరం పట్టణంలోని చినరంగని పాలెంకు చెందిన చెల్లుబోయిన సుబ్బారావు పేర్లు ప్రతిపాదించారు. డైరెక్టర్ పదవులకు వీరవాసరం మండలం కొణితివాడకు చెందిన గొలగాని సత్యనారాయణ, బలుసుగొయ్యపాలెంకు చెందిన దంపనబోయిన అప్పారావు, రాయకుదురు పంచాయతీ పరిధిలోని జగన్నాథరావుపేటకు చెందిన కడలి నెహ్రూ, బొక్కా చంద్రమోహన్, వేర్వేరు ప్రాంతాలకు చెందిన సయ్యపురాజు భాస్కరరాజు, ఎండీ అలీషా (షాబు), బలె లూథరమ్మ, సాలా నరసింహమూర్తి, భూపతిరాజు నాగేంద్రవర్మ, నాగిడి తాతాజీ, కొల్లాటి శ్రీనివాసరావు, కురిశేటి నరసింహరావు (రాజా), వీరవాసరం సొసైటీ అ«ధ్యక్షుడు నూకల కేశవరమేష్ అప్పాజీ పేర్లు జాబితాలో ఉన్నాయి. వీరితోపాటు భీమవరరం మునిసిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు,మార్కెట్ కమిటీ కార్యదర్శి, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు. జాబితాకు మోక్షం కలిగేనా! వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ నియామకం గత రెండేళ్లుగా టీడీపీలో వర్గపోరుకు కారణమైంది. చైర్మన్ పదవికి పార్టీ సీనీయర్ నాయకుడు మెంటే పార్థసారథి, మంత్రి పీతల సుజాత తండ్రి పీతల వరప్రసాద్ (బాబ్జి), పోలిశెట్టి సత్యనారాయణ (దాసు), కొట్టు బాబులు, వీరవల్లి చంద్రశేఖర్, పొత్తూరి బాపిరాజు, కోళ్ల నాగేశ్వరరావు, తోట భోగయ్య తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి. నియోజకవర్గ టీడీపీ నాయకులు ఎమ్మెల్యే అంజిబాబు, ఎంపీ తోట సీతారామలక్ష్మి వర్గాలుగా విడిపోవడంతో మార్కెట్ కమిటీ పాలకవర్గ నియామకంలో తీవ్ర జాప్యం జరిగింది. ఎమ్మెల్యే ఒక మెట్టు దిగివచ్చి చైర్మన్ పదవిని తాను కోరుకున్న వ్యక్తికి కట్టబెడతానని, డైరెక్టర్ పదవులకు భీమవరం పట్టణం, వీరవాసరం, భీమవరం మండలాల్లోని పార్టీ ముఖ్యనాయకులు సమావేశాలు ఏర్పాటుచేసుకుని జాబితాలివ్వాలని సూచించడంతో ఆగస్టు నెలలో కోళ్ల నాగేశ్వరరావు చైర్మన్‌గా, చెల్లబోయిన సుబ్బారావు వైస్‌చైర్మన్‌గా ప్రతిపాదిస్తూ ఎమ్మెల్యే జాబితాను ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపారు. పెండింగ్‌లో ఫైల్. ఈ ఫైల్ రెండునెలలుగా ముఖ్యమంత్రి వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. భీమవరం కమిటీతోపాటు మరొక రెండు,మూడు నియోజకవర్గాల ఫైల్స్ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లగా వాటికి ఆమోదముద్ర వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భీమవరం కమిటీని కావాలనే పెండింగ్‌లో పెట్టారని చెబుతున్నారు. ఎమ్మెల్యే అంజిబాబు పార్టీ కార్యకలాపాల్లో సరిగ్గా పాల్గొనడం లేదని, నెలవారీ పార్టీ సమావేశాలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహంగా ఉన్న ముఖ్యమంత్రి మార్కెట్ కమిటీ జాబితాను పెండింగ్‌లో పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఇదే తరుణంలో తుందుర్రులో ఫుడ్‌పార్క్ నిర్మా ణం విషయంలో అక్కడి ప్రజలను ఒప్పించాలని ఎమ్మెల్యేను సీఎం ఆదేశించారు. దీంతో ఎంపీ తోట సీతారామలక్ష్మితో కలిసి తుందుర్రు వెళ్లిన ఎమ్మెల్యే అంజిబాబు గ్రామ పెద్దలతో మాట్లాడిన వ్యవహారం బెడిసికొట్టింది. ఉద్యమం యువకుల చేతుల్లో ఉందని తామేమి చేయలేమని పెద్దలు కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో అంజిబాబు పరిస్థితి ఇరకాటంలో పడింది. తుందుర్రులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన అనంతరం ఫుడ్‌పార్క్ ప్రభావిత గ్రామాల ప్రజలకు కొండంత ధైర్యం వచ్చింది. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఎలాగైనా పార్కు నిర్మాణాన్ని అడ్డుకుంటామని చెబుతుం డటంతో నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులు నియామకం ప్రశ్నార్థకంగా మారింది. -
ప్చ్... ఇలాగైతే కష్టం!
– పోలవరం ప్రాజెక్ట్ పనులపై సీఎం అసంతృప్తి – ఆక్వా పార్క్ నిర్మాణంపై ప్రజలకు నచ్చచెప్పాలని ప్రజాప్రతినిధులకు ఆదేశం – ముద్రగడ పాదయాత్రను పలుచన చేయాలని సూచన సాక్షి ప్రతినిధి, ఏలూరు/పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ పనుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెదవి విరిచారు. భీమవరం మండలం తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగాలని ఆదేశించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన పాదయాత్రను పలుచన చేయాలంటూ నూరిపోశారు. సోమవారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి వచ్చిన సీఎం చంద్రబాబు అక్కడి పనుల పురోగతిపై సమీక్షించారు. అధికారులకు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు సూచనలు ఇచ్చారు. గడచిన 14 రోజుల్లో అనుకున్న స్థాయిలో పనులు ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. వరదలు, వర్షాల కారణంగా పనులు జరగలేదని కాంట్రాక్టర్లు చెప్పగా, అసంతప్తి వ్యక్తం చేశారు. వారం రోజులుగా పనులు నిలిచిపోవడం, సిబ్బంది సమ్మెకు దిగడంపై ట్రాన్స్ట్రాయ్ బాధ్యులను నిలదీశారు. స్పిల్ వే కాంక్రీట్ పనులను వచ్చే నెల 17 నుంచి 20లోగా ప్రారంభించాలని ఆదేశించారు. ఏ ఒక్క పని ఆలస్యమైనా దాని ప్రభావం ఇతర పనులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ప్రణాళిక ప్రకారం పనులన్నీ సకాలంలో పూర్తి కావాల్సిందేనని కాంట్రాక్టర్లు, అధికారులకు సూచించారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా నీటిని విడుదల చేసేందుకు కతనిశ్చయంతో ఉన్నామని సీఎం పునరుద్ఘాటించారు. పనుల ప్రగతిని ప్రతిరోజూ డ్రోన్ల ద్వారా పరిశీలిస్తానని, ప్రతి వారం అధికారులతో సమీక్ష, ప్రతి నెలా 3వ సోమవారం ప్రాజెక్టు ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో సందర్శిస్తానని చెప్పారు. త్వరలో పురుషోత్తంపట్నం వద్ద పట్టిసీమ తరహాలో ఎత్తిపోతల పథకం నిర్మించి సీలేరు ఆయకట్టు, విశాఖ ప్రాంత తాగునీటి అవసరాలను తీరుస్తామన్నారు. ప్రజాప్రతినిధులకు క్లాస్ భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ అతిథి గహంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆక్వా పార్క్ వల్ల నిర్మాణం వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదన్న విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదేనన్నారు. ఆ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యాన్ని పైప్‌లైన్ ద్వారా సముద్రంలోకి మళ్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఈ విషయాన్ని గ్రామాలకు వెళ్లి ప్రజలకు వివరించాలని ఆదేశించారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్రను లక్ష్యంగా చేసుకుని కాపు ప్రజా ప్రతినిధులు స్పందించాలని చంద్రబాబు హితోపదేశం చేశారు. ఆ కార్యక్రమాన్ని ప్రజల్లో పలుచన చేసేందుకు కషి చేయాలని, టీడీపీ అధికారంలోకి వచ్చాక కాపులకు ఎంతో చేస్తోందనే విషయాన్ని బాగా ప్రచారం చేయాలని ఆదేశించారు. సోమవారం ఉదయం 11.50 నిమిషాలకు పోలవరం ప్రాజెక్ట్ వ్యూ పాయింట్ వద్ద హెలికాప్టర్లో దిగిన చంద్రబాబు పనుల పురోగతిని పరిశీలించారు. స్పిల్‌వే ప్రాంతంలో పనులను పరిశీలించి త్రివేణి ఏజెన్సీ ప్రతినిధులతో పనుల తీరుపై చర్చించారు. అనంతరం స్పిల్‌వే ప్రాంతానికి వెళ్లి కాంక్రీట్ పనులు చేసే ప్రదేశాన్ని పరిశీలించారు. జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఇంజినీరింగ్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు మ్యాప్ సాయంతో స్పిల్‌వే పనుల వివరాలను సీఎంకు తెలిపారు. అక్కడి నుంచి ట్రాన్స్ట్రాయ్ ఏజెన్సీ కార్యాలయానికి చేరుకుని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు మాట్లాడారు. అనంతరం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులపై ప్రాజెక్ట్ పనుల తీరు, భూసేకరణ , ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలుపై సమీక్ష నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు ఇక్కడి నుంచి హెలికాప్టర్లో విజయవాడ బయలుదేరారు. ఈ కార్యక్రమాల్లో జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, ఎంపీలు తోట సీతారామలక్ష్మి, మాగంటి మురళీమోహన్, గోకరాజు గంగరాజు, మాగంటి బాబు, జెడ్పీచైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, కలెక్టర కాటంనేని భాస్కర్, ఎస్పీ భాస్కర్‌భూషణ్, ఎస్ఈ వీఎస్ రమేష్‌బాబు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్యేలు మొడియం శ్రీనివాసరావు, కేఎస్ జవహర్, నిమ్మల రామానాయుడు, కలవపూడి శివరామరాజు, పితాని సత్యనారాయణ, పులపర్తి అంజిబాబు, ఆరుమిల్లి రాధాకష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు, ట్రాన్స్ట్రాయ్ ఎండీ చెరుకూరి శ్రీధర్, ఈడీ సాంబశివరావు, జేసీ పి.కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
మీరే నచ్చ చెప్పండి
– ఆక్వాపార్క్ నిర్మాణంపై ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్ – ముద్రగడకు వ్యతిరేకంగా గొంతువిప్పండి సాక్షి ప్రతినిధి, ఏలూరు భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల ఎలాంటి కాలుష్యం రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో సోమవారం జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తుందుర్రు అంశంతోపాటు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రపై చర్చించారు. గత ఎన్నికల్లో అన్ని సీట్లు కట్టబెట్టిన పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు తాను అన్యాయం చేయనన్న విషయాన్ని వారికి వివరించాలని సూచించారు. ఆ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం రాకుండా సముద్రం వరకూ పైపులైన్ నిర్మిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. గ్రామాలకు వెళ్లి వారికి నచ్చచెప్పాలని, అవసరమైతే తాను కూడా వస్తానని చెప్పినట్లు సమాచారం. ప్రాజెక్టులను అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నారు. అనంతరం ముద్రగడ పద్మనాభం పాదయాత్ర అంశంపైనా చర్చించారు. 2014కు ముందు కూడా కాపుల రిజర్వేషన్ల అంశం ఉందని, అప్పుడు పట్టుబట్టని నాయకులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆందోళన చేయడం ఏంటని ముఖ్యమంత్రి ప్రశ్నించినట్టు సమాచారం. టీడీపీ వచ్చాక కాపుల కోసం చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. ముద్రగడ పద్మనాభంను కౌంటర్ చేసేలా కాపు ప్రజాప్రతినిధులు స్పందించాలని సూచించారు. ప్రత్యేక హోదా విషయంలో తాను స్పందించబట్టే ప్రజలను నమ్మించగలిగామని, లేకపోతే ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చేదని సీఎం పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్ల విషయంలోనూ అదే స్థాయిలో స్పందించాలని నాయకులకు ఆదేశాలు ఇచ్చారు. సమావేశంలో జిల్లా మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీలు మాగంటి బాబు, మాగంటి మురళీమోహన్, గోకరాజు గంగరాజు, తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ మెగా అక్వాఫుడ్ పార్కు విషయమై స్పందిస్తూ.. కాలుష్యంపై తాము సీరియస్‌గా ఉన్నామని, ఈ ప్రాజెక్టు విషయంలో ప్రజలు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని అన్నారు. జిల్లాను అంతర్జాతీయ స్థాయి ఆక్వా హబ్‌గా రూపొందించేందుకు ఈ ఫుడ్ పార్క్ ద్వారా అవకాశం ఉందన్నారు. ఏటా రూ.12 వేల కోట్లు విలువైన ఆక్వా ఉత్పత్తులకు అవకాÔ¶ ం ఉందని, నీటిద్వారా ప్రజలకు, పర్యావరణానికి ఎటువంటి కాలుష్యం కలుగకుండా వ్యర్థాలను ప్రాసెస్ చేసిన అనంతరమే సముద్రంలో వదిలేవిధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో పరిశ్రమల ద్వారా డ్రెయిన్లలోకి విడుదలవుతున్న వ్యర్థాలు, కాలుష్య కారకాలను గుర్తించి, వాటిని సరైనవిధంగా ప్రోసెస్ చేసి డ్రెయిన్లలోకి విడుదల చేసే విధంగా కలెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను ఆదేశించామని చెప్పారు. -
ఆక్వాపార్క్ బాధితులకు అండగా..
– 19న జిల్లాకు వైఎస్ జగన్ రాక – నేడు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గ సమావేశం – అధికార మదంతో ఫ్యాక్టరీ నిర్మాణం – అధికారులు తొత్తులుగా మారారు – పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ధ్వజం మొగల్తూరు : భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా అక్వా ఫుడ్ పార్క్ బాధితులకు అండగా నిలబడేందుకు ఈ నెల 19న వైఎస్సార్ సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు రానున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని తెలిపారు. మొగల్తూరు మండలం కొత్తపాలెం గ్రామంలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి శనివారం ఆయన పర్యటించారు. ఆక్వా పార్క్ నిర్మాణం వల్ల తలెత్తే దుష్పరిణామాలు, ఫ్యాక్టరీ నిర్మిస్తున్న తరుణంలో అధికారుల అండతో పోలీసులు ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్న తీరును ఈ సందర్భంగా గ్రామస్తులు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆళ్ల నాని మాట్లాడుతూ తుందుర్రు పరిసర గ్రామాల ప్రజలు ఆక్వా పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం అధికార మదంతో పరిశ్రమ నిర్మాణంలో ముందుకు వెళుతోందని ధ్వజమెత్తారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పనులు చేపట్టడంతోపాటు వారిని భయాందోళనలకు గురిచేస్తూ 144 సెక్షన్ విధించి, పోలీసులను మోహరించడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మాట మార్చడం తగదన్నారు. అధికారులు కూడా పరిశ్రమ యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులంతా జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిసి తుందుర్రు, పరిసర గ్రామాల్లో విధించిన144 సెక్షన్ తొలగించి, ప్రజలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరామన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా కలుషిత నీటిని సముద్రంలోకి వదిలేలా పైప్లైన్లు ఏర్పాటు చేసేందుకు రూ.11 కోట్లు వెచ్చిస్తున్నామని ఒక అధికారి, రూ.20 కోట్లు వెచ్చిస్తున్నామని మరో అధికారి చెప్పారన్నారు. ఇలా ప్రకటించే అధికారం ఈ అధికారులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. పరిశ్రమ యాజమాన్యానికి, ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. ఇటీవల జిల్లాకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి దష్టికి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తీసుకువెళ్లామని, దీనిపై ఆయన స్పందించి ప్రజల ఆందోళనకు మద్దతు పలుకుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన ఆదేశాల మేరకు తాము బాధిత గ్రామాల్లో పర్యటించామన్నారు. ప్రజల ఇబ్బందుల్ని చూస్తే.. భారతదేశంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా అనే అనుమానం కలిగిందన్నారు. జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారథిలతో కలిసి తామంతా మరోసారి తుందుర్రులో పర్యటించి ప్రజలకు మనోధైర్యం కల్పించామన్నారు. ఆక్వా పార్క్ నిర్మాణం కోసం అప్రకటిత కర్ఫ్యూ విధించి భయానక వాతావరణ సృష్టిస్తున్న పరిశ్రమ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అభివృద్దికి వైఎస్సార్ సీపీ వ్యతిరేకం కాదని, పరిశ్రమల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడాన్ని, అక్రమంగా భూములు లాక్కుని జనాన్ని భయబ్రాంతులకు గురిచేసి అవినీతికి పాల్పడే ఈ ప్రభుత్వ విధానాలకు మాత్రమే వ్యతిరేకమని చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 19న ఆక్వా పార్క్ బాధిత గ్రామాల్లో పర్యటిస్తారని చెప్పారు. ఈ సభలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, పాతపాటి సర్రాజు, నాయకులు కొయ్యే మోషేన్‌రాజు, కవురు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేడు జిల్లా కార్యవర్గ సమావేశం భీమవరం కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ హాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేశామని ఆళ్ల నాని తెలిపారు. ఈ నెల 19న పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆక్వా పార్క్ బాధిత గ్రామాల్లో పర్యటిస్తారన్నారు. ఆయన పర్యటనను విజయవంతానికి అనుసరించాల్సిన కార్యచరణ ప్రణాళికపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలోని పార్టీ నాయకులు, కన్వీనర్లు హాజరు కావాలని పిలుపునిచ్చారు.