ఆక్వాపార్క్‌కు రక్ష.. మత్స్యకారులకు ఎందుకీ శిక్ష..?
ఆక్వాపార్క్‌కు రక్ష.. మత్స్యకారులకు ఎందుకీ శిక్ష..?
Published Sat, Oct 29 2016 10:14 PM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM
– మా జీవనోపాధికి భంగం కలిగిస్తే సహించం
– వంశపారంపర్యంగా వస్తున్న వలకట్లను నాశనం చేస్తే ఊరుకోం
– అవసరమైతే న్యాయ పోరాటాలకూ వెనుకాడం
– మత్స్యకారుల హెచ్చరిక
‘ఆక్వా పార్క్ పెద్దలకు రక్షగా నిలుస్తోంది. సామాన్య ప్రజలపై కక్ష సాధిస్తోంది. మాపై వివక్ష చూపుతోంది. మా జీవనోపాధికి గండికొట్టి.. మా పొట్టకొట్టేందుకు యత్నిస్తోంది. ఇదేం సర్కారు’ గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ బాధిత గ్రామాల ప్రజల ఆక్రందన ఇది. భీమవరం మండలం తుందుర్రు పరిసర గ్రామాలతోపాటు నరసాపురం, మొగల్తూరు, వీరవాసరం మండలాల్లోని ప్రజలు వ్యతిరేకిస్తున్నా.. ఆక్వా పార్క్ యాజమాన్యం ఎదుట మోకరిల్లిన సర్కారు జనంపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ.. పోలీసులను మోహరించి దాషీ్టకానికి దిగడం విమర్శల పాలవుతోంది. సర్కారు తీరును నిరసిస్తూ.. తమ జీవనంతో ముడిపడిన ఉన్న గొంతేరు కాలువను కాలుష్య కాసారంగా మార్చే ఆక్వా పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా మత్స్యకారులు పోరుబాట పడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
‘తరతరాలుగా గొంతేరు కాలువపై ఆధారపడి బతుకుతున్నాం. మా జీవనోపాధిపై వేటు వేయకండి. కాలువలో మేం వేసుకున్న వలకట్లకు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చింది. వేలాది కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న గొంతేరును కొందరి స్వార్థం కోసం కాలుష్యసాగరంగా మారిస్తే ఊరుకోం’ అని నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని గొంతేరు సరిహద్దు గ్రామాల్లోని మత్స్యకార కుటుంబాలు వేడుకుంటున్నాయి. ఆ రెండు మండలాల్లోని ఆక్వాపార్క్ ప్రభావిత గ్రామాల్లో ‘సాక్షి’ బందం పర్యటించగా.. అక్కడి మత్స్యకారులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ ద్వారా 500 మందికి ఉపాధి కల్పిస్తామంటూ.. 50 వేల కుటుంబాలను రోడ్డున పడవేయడం భావ్యం కాదని వాపోయారు. సంప్రదాయ చేపల వేట సాగించే మత్స్యకారులకు జీవనోపాధి కల్పించడంతోపాటు ఇక్కడి ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తున్న గొంతేరు కాలువను కాలుష్యం బారినుంచి కాపాడుకునేందుకు అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని మత్స్యకార కుటుంబాలు తేల్చిచెప్పాయి. తమపైకి పోలీసుల్ని ఉసిగొల్పినా.. ఎన్నిరకాలుగా వేధించినా పోరాటం నుంచి వెనక్కి తగ్గేది లేదని పలువురు స్పష్టం చేశారు. జీవనోపాధి పోయాక తాము చేయగలిగిందేమీ ఉండదని.. అందుకే, ముందుగానే ఆక్వా పార్క్ నిర్మాణాన్ని అడ్డుకోవాలన్నది తమ అభిమతమని మత్స్యకారులు తెలిపారు. తమ జీవనోపాధికి భంగం కలిగిస్తే సహించబోమని, వంశపారంపర్యంగా వస్తున్న వలకట్లను నాశనం ఊరుకునేది లేదని, అవసరమైతే న్యాయ పోరాటాలకు సిద్ధమవుతామని ముక్తకంఠంతో చెప్పారు.
వందలాది వలకట్లు.. అవే ఉపాధి మెట్లు
నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని గొంతేరు కాలువ పరిధిలో 31 పెద్ద వలకట్లు, మరో 200 వరకూ చిన్న వలకట్లు ఉన్నాయి. వీటి నిమిత్తం మత్స్యకారులు ఏటా ప్రభుత్వానికి పన్ను చెల్లించి లైసెన్స్ పునరుద్ధరించుకుంటారు. వీటికి ప్రభుత్వం జిరాయితీ తరహాలో పట్టాలు ఇస్తుంది. వీటిని వంశపారంపర్యంగా అనుభవించవచ్చు. లేకపోతే వేరే వారికి రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది. వేట నిషేధం సమయంలో వీరి జీవనోపాధి నిమిత్తం బియ్యం, ఇతర సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ హక్కు కొన్ని తరాలుగా వస్తోంది. ఆక్వా పార్క్ నిర్మాణం పూర్తయి, గొంతేరు కాలువ కలుషితమైతే తమ భవిష్యత్ అంధకారమవుతుందని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆక్వా పార్క్ ప్రభావిత గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల్లో వరితోపాటు, ఆక్వా కల్చర్ కూడా సాగుతోంది. వీటికి గొంతేరు కాలువ నీరే ఆధారం. అందుకే అక్కడి వారంతా ఆక్వాపార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. పరిశ్రమ నిర్మాణానికి మద్దతు ప్రకటించిన నరసాపురం, భీమవరం ఎమ్మెల్యేలపై పూర్తి ఆగ్రహంతో ఉన్నారు. ఆయా గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు కూడా పూర్తిగా ముందుండి ఉద్యమాన్ని నడుపుతున్నారు.
పైప్‌లైన్ వేస్తారా.. చూస్తాం
తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పైపులైన్ వేస్తామని చెబుతున్నారు. 16 కిలోమీటర్ల మేర ఎవరి భూముల్లోంచి దీనిని వేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ‘పైపులైన్ వేయడం కోసం భూసేకరణ నోటిఫికేషన ఇవ్వనివ్వండి అప్పుడు చూద్దాం’ అని వారు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే మొగల్తూరు మండల శివార్లలో అనంద గ్రూప్ ఏర్పాటు చేసిన రొయ్య తలల ప్రాసెసింగ్ యూనిట్ వల్ల ఆ ప్రాంతంలోని గొంతేరులో దొరికే పీతలు, బొమ్మిడాయిలు వంటి మత్స్యసంపద అంతరించిపోయిందని వారు చెబుతున్నారు. గొంతేరుపై మత్స్యపురి వద్ద ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే నీటినే మంచినీటి చెరువుకు మళ్లించి, వాటిని శుద్ధి చేసుకుని తాగునీటి కోసం ఉపయోగిస్తున్నామని మొగల్తూరు మండలం కొత్తపాలెం గ్రామస్తులు చెబుతున్నారు.
మా బతుకే ఈ కాలువ
మా తాతల కాలం నుంచి గొంతేరు కాలువలో చేపల్ని వేటాడి బతుకుతున్నాం. తరతరాలుగా మా వత్తి ఇదే. ఈ కాలువ లేకపోతే మా బతుకు లేదు. తుందుర్రులో రొయ్యల ఫ్యాక్టరీలోని మురుగంతా ఈ కాలువలో కలిస్తే మాకు చేపలు దొరకవు. ఎలా బతికేది.
–కొల్లాటి నాగరాజు, చింతరేవు, మొగల్తూరు మండలం
బ్రిటీసోళ్లే నయమనిపించారు
మా ఆయన, కొడుకు గొంతేరు కాలువలో చేపలు, రొయ్యిలు వేటాడుకొస్తారు. వాటిని నేను గంపలో పెట్టుకుని పట్టణానికెళ్లి వీధుల్లో అమ్ముకుని వస్తాను. ఇలాగే ఎన్నో ఏళ్లుగా బతుకుతున్నాం. మాకు గొంతేరులో వేటాడుకుని బతకమని బ్రిటీసోళ్లు లైసెన్స్‌లు ఇచ్చారు. దీన్ని కాలుష్యం చేసి ఇప్పుడు వీళ్లు మా కడుపులు కొట్టాలని చూస్తున్నారు. ఈళ్లకంటే బ్రిటీసోళ్లే నయమనిపించారు.
–కొల్లాటి ముత్యామ్మ, చింతరేవు, మొగల్తూరు మండలం
ఫ్యాక్టరీ కట్టనివ్వం
ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళననలు చేయొద్దని పోలీసులొచ్చి బెదిరిస్తున్నారు. జైల్లో పెడతామంటున్నారు. మా బతుకే పోతున్నప్పుడు మమ్మల్ని జైల్లో పెడితే ఏంటి.. ఉరితీస్తే ఏంటి. ఫ్యాక్టరీ మాత్రం మాకొద్దు. మేం కట్టనివ్వం. వేట లేకపోతే మా బతకులే లేవు.
– వైదాని మహాలక్ష్మి, చింతరేవు, మొగల్తూరు మండలం
మాకే నష్టం ఎక్కువ
తుందుర్రులో ఫ్యాక్టరీ కడుతున్నామని అంటున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు తుందుర్రు వారితోనే మాట్లాడుతున్నారు. గొంతేరు కాలువ అంతా మొగల్తూరు, నరసాపురం మండలాల్లోనే ఉంది. ఇక్కడ మత్స్యకారులు నష్టపోతారు. మా పొలాలు పండవు. నష్టం అంతా మాకే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీ కట్టనివ్వం.
– రేవు రాంబాబు, ముత్యాలపల్లి , మొగల్తూరు మండలం
మాకు ఇది జీవనది
గొంతేరును డ్రెయిన్ అంటారు. కానీ మా కొత్తపాలెం, శేరేపాలెం చుట్టుపక్కల వాళ్లంతా గొంతేరును జీవనదిగా పిలుచుకుంటాం. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కాస్త ఉప్పునీరు ఉంటుంది. మిగతా రోజుల్లో ఈ నీటినే వాడకం నీటిగా వినియోగిస్తాం. స్నానాలు చేస్తాం, పశువులకు పట్టిస్తాం. అవసరమైనప్పుడు కాచి వడగట్టుకుని ఈ నీటినే మేమూ తాగుతాం. తుందుర్రులో రొయ్యల ఫ్యాక్టరీ కడితే ఇక అంతేసంగతులు.
– – లోకం చంద్రశేఖర్, రైతు, కొత్తపాలెం, మొగల్తూరు మండలం
టీడీపీ అధ్యక్షుడిగా బాధపడుతున్నా
చక్కగా రెండు పంటలు పండే పొలాలు మావి. తుందుర్రులో రొయ్యల కంపెనీ కట్టి, ఆ వ్యర్థాలను గొంతేరులో వదిలితే మా పొలాలు బీడుగా మారతాయి. మేమంతా బికారులగా మిగిలిపోతాం. నేను గ్రామ టీడీపీ అధ్యక్షుడిని. ఫ్యాక్టరీ వద్దని భీమవరం ఎమ్మెల్యేకు చెప్పా. నరసాపురం ఎమ్మెల్యేకూ చెప్పా. మమ్మల్ని ఎవరో చెచ్చగొడుతున్నారని అంటున్నారు. మాకు తెలియదా, రెచ్చగొడితే రెచ్చిపోతామా. చెప్పుకోవడానికి ఏమీలేదు. బాధగా ఉంది.
– కొత్తపల్లి రాంబాబు, కొత్తపాలెం, మొగల్తూరు మండలం
Advertisement
Advertisement